అనంతమైన పరుగులు తీయాలని
మనుషులు ఎందుకో మారాము చేస్తారు
ఆనందాన్ని పొందడానికో
అభిమానం సంపాదించడానికో కాదు
అవకాశాన్ని అందుకోవడానికో
ఆకాశాన్ని చేజిక్కించుకోవడానికో కాదు
దుఃఖానికి ఆమడ దూరం అంటూనే
అలవిగాని దుఃఖాన్ని మూట కట్టుకోవడానికి
తూచితూచి ఎన్నెన్నో వంకలు వెతుకుతాడు
మనిషి మోసం చేశాడని
స్నేహం రాలిపోయిందని
ప్రేమలో అన్యాయం జరిగిపోయిందని
అపజయాలన్నీ తన వైపే ఉన్నాయంటూ
అలలు అలలుగా
అలుపెరుగని ఆవేదనకై తల్లడిల్లుతారు
ఒంటరితనపు దుఃఖం కోసం ఎంతటి ఆరాటమో
అంతేనా ...
జతగాళ్ల కోసం గులకరాళ్ల గుట్టలను పేరుస్తాడు ..
నవ్వే వాడిపై గురి చూసి విసురుతాడు
దుఃఖాన్ని కానుకగా ఇస్తూ
తన వైపు లాక్కుంటాడు మరింత
ఓయ్ ..
ప్రేమతో అంతా సరి చేయొచ్చు అంటావు కదా
ఈ వైపుకు వచ్చి
కాస్తంత దుఃఖాన్ని మోసుకెళ్ళు
గులకరాళ్ళ గుట్టను దోచుకెళ్ళు