ప్రేమించేవారిదే ఎప్పుడూ పై చేయి

వాళ్లు వీళ్లు అలవోకగా అంటుంటారు
ప్రేమించడం కాణి ఖర్చు లేనిదని ...

అవును నిజమేనేమో
మనసు మట్టిముద్దనే వారొకరు
ముళ్ళకంచె అనేదొకరు
అద్దమనే వారికి కొదవలేదు
మనసుకు విలువే లేదని వెల కట్టి తేల్చేశారు

అయినా మరి
ఇన్ని అలకలెందుకో...కోపతాపాలెందుకో
నాకే సొంతం కావాలన్న తపన ఎందుకో
ప్రేమించేవారి చుట్టూ దడికట్టడం ఎందుకో

వాదనలెందుకులే..
అందరూ ప్రేమను అందుకోవాలనుకునే వారే
అందించే వారే కాస్త కొదవపడ్డారుగా మరి...

కారణాలు ఎన్ని చెప్పినా
తూకపు తక్కెటలో
ప్రేమించేవారిదే ఎప్పుడూ పై చేయి..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!