అతను పని ఒత్తిడిలో ఉన్నానంటాడు
ఇసుమంత సమయమే లేదంటాడు
నాకు తెలుసు
అతన్ని ప్రేమలో ఎలా ముడివేయాలో
మరింత ప్రేమించడమే సులువైన పద్ధతి
అప్పుడప్పుడు తెలిసి... తెలియక
కొంత విరామం ఇస్తాను పలకరింపులకు
అతను
ఉలికిపాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు
పని మధ్యలో ఒక్కసారి నాకై వెతుకుతూ
చిన్న మాట చాలా చిన్న మాట
పిల్లా... ఏమయ్యింది అని అడుగుతాడు.
చిన్నినవ్వుతో
ఏమీ లేదని తిరిగి బదులిస్తాను
అతను తన పనిలో నిశ్శబ్దంగా మునిగిపోతాడు
నాకు తెలుసు
జవాబు ఇవ్వకపోతే
పని చేయడం ఎలాగో మర్చిపోతాడు
పూర్తి విశ్రాంతి సమయంలో చిక్కుబడిపోతాడు
ఓయ్
ఓమారు...రారాదూ
నీ ప్రేమ గురించి ... ఓ మాట చెబుతాను