ఓయ్ అన్నాను
బ్లూ టిక్ తప్ప జవాబు లేదు
చూసి వెళతావే
పలకరింపు లేకుండా
ప్రశ్నించాను ఎన్నడూ లేనిది
అయినా
బ్లూ టిక్కు మాత్రమే వచ్చింది
ఫోన్ మౌనంగా ఉంది
*****
సాయంత్రం ఫోను మోగింది
బిజీగా ఉన్నాను అంటూనే
ఏంటి విషయం అన్నాడు..
అబ్బో.... మరే
ఆ.... ఏం లేదు
చెక్కభజన చేసుకోవడానికి
నిన్ను అనుమతి అడుగుదామని
దీర్ఘం తీశాను సాగదీస్తూ...
ఫక్కున నవ్వాడు. అతను
ఆగి ..ఆగి
మళ్లీ మళ్లీ నవ్వాడు....
ఇంతకూ....
ఏంటి విషయం కాస్త నెమ్మదిగా అడిగాడు
మరేమీ లేదు లేవోయ్
నీ నవ్వు కోసమే...
నిజంగా నిజం
వత్తి పలుకుతూ అన్నాను
నిజంగానే...
మరి మరీ నిదానించి అడిగాడు...
అయ్యో రామ ..అప్పుడప్పుడు
మాట వినాలనిపించదా?
మాట కలపాలనిపించదా?
మరింత సాగదీస్తూ అన్నాను...
*****
నిశ్శబ్దంగా ఫోన్ పెట్టేయబడింది
అతని బిజీ షెడ్యూల్
కాస్త విరామం అందుకుంది
నాకు తెలుసు
నా తల తిక్క వ్యవహారాలు
అతనికి సరిపోవని....
ఇప్పుడో ..కాసేపటికో ..ఇంకాసేపటికో
నేను చెప్పిన జవాబుకి లాజిక్కులు దొరకక
ఈసారి
సముద్రపుహోరై వస్తాడని....