అప్పుడప్పుడు అతగాడు
కాస్తంత వెర్రిని అరువు తెచ్చుకుంటాడు
అంతేనా...అసూయ ద్వేషాలు
గంపలు గంపలు ఎత్తుకొని
నాకంటే అందరూ ఎక్కువేలే
అంటూ అలకలు సాగిస్తాడు
మౌన పోరాటాలు చేస్తాడు
మనలో మాట ... మనసులో మాట
ఇతగాన్ని తీసుకెళ్లి మనుషులు కానరాని
కారడవిలో చెట్టుకు కట్టేసి
'అంతా నువ్వే అందుకే ఇలా '
అని చెప్పి రావాలనిపిస్తుంది....
అయినా
వేల యుగాల నుండి ఇతగాడు తెలుసు కదా
మనసులోని మాటలన్నీ అలవోకకే ధారపోసే
అతగాడి పిచ్చితనం మరింత ఎరుకే కదా
అయితేనేం.....
మాట జారవిడిస్తే ఊరుకుంటానా
అలాగని కాదని తప్పుకుంటానా
ఓయ్...
నువ్వు నాకు తెలుసని
ఎంత ప్రేమించినా సరే
ఎప్పుడో ఒకప్పుడు
చెట్టుకు కట్టేసి వంతు నాదే
చూపుడు వేలు బెదిరింపు నాదే