ఓపక్క వేడిసెగల వేసవి.. ఊపిరిసలపని ఉక్కపోతల వడగాలి.. హాయన్నదేదీ తనువును తాకింది లేదు., మనస్సును తడిపింది లేదు.. అదిగో అలాంటి భగ భగల మధ్యాహ్నం పోస్టుమాన్ పిలుపుతో తలుపుతీయగానే..
రమాదేవి గారి " వెన్నెల దుప్పటి కప్పుకుందాం" పుస్తకం అందింది.తెరిచి చూశానా.. ఆహ్లాదకరంగా కవర్ పేజీ., అలా పేజీలు తిరగేశానా చాలా భిన్నంగా ముందుమాటల గోలగానీ,అభినందనల లీలగానీ లేకుండా కేవలం రజాహుస్సేన్ గారి ప్రసంశ మరియు రమాదేవిగారి కృతజ్ఞతల పత్రంతో సరాసరి వెన్నెల దుప్పట్లోకి తీసుకెళ్లిపోయిన తీరు ఆకట్టుకుంది.
ఇక కవితల్లోకి వెళితే కేవలం అతడు,ఆమె బంధం,.. నువ్వు,నేను అనే వలపు పిలుపులతో ఆద్యంతం ప్రేమమయమై పలకరిస్తుంది అనే గట్టి నమ్మకం.ఎందుకంటే ఇప్పటికే ఫేస్ బుక్ సాక్షిగా రమాదేవి గారి ఎన్నో ప్రేమకవితలు మిస్ కాకుండా మీలానే నేనూ చదువుతున్నాను కాబట్టి.
ఇక నిర్లిప్తతమైన నిరీక్షణల ఎడబాటులోని మాధుర్యాన్ని., చిలిపి ఊహల పదనిసలు., అలకపాన్పుల ఊరడింపులు ఓ వైపు.. ఒంటరితనం నిండిన హృదయ వేదన జతగువ్వ పిలుపుకై యుగాలకైనా వేచిచూసేంత పిచ్చిప్రేమ మరో వైపు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి అనే అభిలాష.
అయినా ప్రేమను మించిన మతం,అభిమతం ఏముంటాయి. ప్రేమను మించిన సామాజిక అంశం ఏముంటుంది. అలాంటి యూనివర్సల్ ఎలిమెంట్ ని కవిత్వీకరించడానికి కృషి చేస్తున్న రమాదేవిగార్ని ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ..
ప్రేమంటే గెలుపా., ఓటమా.? లేక ప్రేమంటే వెన్నెలా ? చీకటా?అదీకాదంటే మిళితమా? విరహమా?
ఫలితం ఏమైనా, ఏదైనా అది ప్రేమే కదా.ప్రేమే ఇక్కడ ముఖ్యం.ఫలితం కాదు.విరహం లేని ప్రేమ కెరటం లేని సంద్రం లాంటిది.వెన్నెల లేని చీకటి లాంటిది అని నా అభిప్రాయం.
అలాంటి ప్రేమను అక్షరాలుగా పొదిగి ప్రేమలోని అన్ని కోణాలను తడారని జీవనదీప్రవాహంలా మన హృదయాలమీదుగా ప్రవహింపజేయటానికి., మనందరం జీవితంలో ఎప్పుడో ఎక్కడో పారేసుకున్న ఒకనాటి ప్రణయ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా ఏరుకునే పనిలోకి నెట్టేసేలా వెన్నెల దుప్పటిని మనపై ప్రేమగా కప్పటానికి ముందుకొచ్చిన ప్రేమకవన రాజిని, ప్రణయవిహారాల కవితారూపిని రమాదేవి గార్కి హృదయ పూర్వక శుభాభినందనలు..
చిన్న పలకరింతల పరిచయానికే నన్ను గుర్తు పెట్టుకుని ఎంతో స్నేహంగా పుస్తకం పంపినందుకు ధన్యవాదాలు..
పుస్తకం తెరవగానే 62 వ పేజీలోని కవిత మొదటగా కనిపించింది.. అదే "ఆనవాళ్లు ఎందుకోయ్" కవిత.
చదివా., చాలా బాగుంది. చివరి స్టాంజాలో..
" అయినా ఆకాశమంత ప్రేమించడానికి
ఆనవాళ్లు ఎందుకోయ్
అటువైపు నువ్వు ఉన్నావని
నా మనస్సు నమ్మాక"
అనుంది. నిజమేగా ప్రేమకు నమ్మకాన్ని మించిన భరోసా ఏముంటుంది.
ప్రేమంత నమ్మకంతోనే మీ పుస్తకం కూడా మంచి గుర్తింపుని,విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను.
All the very best Rama devi garu..keep rocking