ఒకానొక సమయాన ఓ ఊరు ప్రయాణం కోసం బస్సు ఎక్కాను. పొద్దుటి ప్రయాణం ఆహ్లాదంగా గడిచిపోతుందో లేదో చిక్కని సిగరెట్టు వాసన నను చేరింది. అరమైలు దూరంలో వాసన కూడా పసికట్టి చిరాకు పడే నాకు అతి దగ్గరగా అల్లుకోవడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై బస్సులో చూపు సారించాను..
అదిగో బస్సులో ఎడమ వైపు రెండో సీట్లో అతను ఉన్నాడు... కుడివైపున మూడు సీట్లో నేనున్నాను.. అతను తల తిప్పి తిప్పక చూసినంతనే నేను కనిపిస్తాను అన్నది నిజం..
ఈ రైలు ఇంజన్ సిగరెట్ పొగ అక్కడి నుండే.. ఇంత చక్కగా ఉన్నాడు ఆ సిగరెట్టు కాల్చకుంటేయే అనిపించింది... సిగరెట్టు కాలుస్తున్న అతన్ని అసహ్యించుకోవడం మానేసి అతను సిగరెట్టు కాల్చకుంటే బాగుండు అని ఆలోచన ఏమిటో నాపై నాకు కాసింత ఆశ్చర్యం. నా ఆలోచనలో నేను సతమతం అవుతుండగానే నలభై నిమిషాలు గడిచాయేమో లేదో మరోసారి పొగ ఉక్కిరి బిక్కిరి చేసింది... తెలియనితనం కాసింత.. తెలిసిన చిరాకు మరింత నా ఊపిరిలో కలిసి అదుపుతప్పి చిరాకుపరిచే దగ్గుని బస్సంత వెదజల్లింది. ఓ నలుగురు నా వైపు చూశారు అందులో అతను కూడా ఉన్నట్టుంది. ఎందుకో అవమానంగా అనిపించింది..
దానికంతా కారణం అతనే అన్నట్టుగా చిరాకుగా తన వైపు చూస్తూ కర్చీఫ్ ముక్కుకు అడ్డుపెట్టుకున్నాను..
మరో అరగంటకి పొగ నన్ను చుట్టుపడుతుంది అన్నట్టుగా సంసిద్ధంగా ఉన్నాను... అటువంటిది ఏమీ జరగకుండానే గంట గడిచిపోయింది ఆశ్చర్యం... ఇంకాసేప్పట్లో ఇంకాసేపట్లో పొగ చుట్టుముడుతుంది అని అనుకుంటూనే ఉన్నాను రెండు గంటలు గడిచాయి. బస్సాగింది కిందికి వెళ్లి సిగరెట్ కాల్చుకొని వచ్చి కూర్చున్నాడు.
ఇప్పుడు చిరాకు స్థానంలో అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను నా ఇబ్బంది కోసం మానేసాడా. నా గురించి అని కాదు అందరికీ ఇబ్బంది కదా అది కూడా కాదు అతని ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదుగా.. అతను పూర్తిగా సిగరెట్లు మానేస్తే ఎంత బాగుంటుంది.
అతని మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తే మానేస్తాడేమో .. అతనికి ఎవరైనా ఎదురైతే బాగుండు.. నా మనసులో రంగుల వర్ణ చిత్రం గీయబడుతుంది. గుప్పున పొగ అలుముకుంది .. నా ఊహలన్నీ తారుమారు చేస్తూ.. అతడు నన్ను చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు అనిపిస్తుంది.
అతనితో ఇంత ముచ్చటగా ఉన్నావు ఇంతకీ నువ్వు ఏం చేస్తావో అని పలకరించాలనిపించింది... అంతా బాగుంది కానీ కాస్త సిగరెట్టు మానేయకూడదు అని అడగాలనిపించింది...
ఏంటో నేను చెబితే అతను జీవితాంతం సిగరెట్ తాకడేమో అనిపించింది అంతటి బలమైన ఊహ ఏమిటో... ఏదేమైనా చెప్పేస్తే పోలా ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి.
గమ్యస్థానం చేరింది.. బస్సు దిగి గబగబ వెళ్ళిపోయాడు.. నా లగేజ్ తీసుకొని కిందికి దిగేసరికి కనిపించలేదు. మళ్లీ ఎప్పుడైనా ఎదురుపడితే గుర్తుపడతానా .. సిగరెట్ వాసన తప్ప అతను ఎక్కడున్నాడు .. లేదు గుర్తుపట్టడం అన్న ప్రశ్నకు తావు ఎక్కడ...
సిగరెట్ పొగలో చిక్కుకున్న అతను ఓ మబ్బు తెర.. ఇప్పటికీ అతను ఇంకా సిగరెట్ కాలుస్తూనే ఉండి ఉంటాడేమో .... నేను సిగరెట్ మానేయమని చెప్పలేదు కదా...