Thank you.. జయతి...లోహి
నేను మీ వరకు వేసిన ప్రతి అడుగు.. మీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వేసిన అడుగు కొన్ని వేల నిశ్శబ్దపు కథలను పరిచయం చేసింది... పరిచయం లేని కొన్ని నిశ్శబ్దాలు ఎదురుపడి కొత్త కథ చెప్పాయి అన్నిటికీ మాటలు అందించక్కరలేదు కొన్నిటికి నిశ్శబ్దమే బాగుంటుందని నేర్పించింది... thank you for everything
*******
అనంతమైన నిశ్శబ్దపు రాశి
రెండు విశాలమైన మైదానాలు ఒకదానికొకటి ఎదురుపడ్డట్టుగా కంటికి కనిపించినంత దూరం పరుచుకున్న నింగి... నేల నాకు కొన్ని వేల సంవత్సరాల క్రిందట మనిషికి తెలిసిన ఓ గాఢమైన నిశ్శబ్దాన్ని పరిచయం చేసింది...
అక్కడ కనిపించే చిక్కని నిశ్శబ్దాన్ని నేను మోయలేనంతగా కాస్తంత దొంగిలించుకు వెళ్లాలని ఆశ ఎంతగా అల్లుకుందో.. మనసులోని ఆశకు
తనదైన రంగులు వేస్తూ నిశ్శబ్దం.... అతి సున్నితంగా అల్లుకుంది ఓ స్నేహితగా..
అక్కడ నిశ్శబ్దం వేల రంగుల్లో వికసిస్తుంది.... సమయం కూడా నిశ్శబ్దంలో తనను తాను దాచుకుని తన కదలికల ఆనవాలు కూడా కనిపించనివ్వడం లేదు.. వినిపించే ప్రతి స్వరం కూడా ఓ నిచ్చలమైన నిశ్శబ్దానికి నాంది పలుకుతుంది...
నింగి నేలను కలుపుతూ ఓ నిశ్శబ్దం
మనసుకు మనసుకు దారులు వేస్తూ
సమయం చుట్టు అల్లుకున్న నిశ్శబ్దం
వస్తూ వస్తూ కొనుగోటంత నిశ్శబ్దాన్ని
తోడుగా రమ్మని అడిగా....
ఇంతకూ తను నా వెంటే నడిచిందో ...తనలో నేను చిక్కుకున్నానో తెలియదు ..తెలుసుకోవాలన్న నిక్కచ్చితనం లేదు ... కాలం తనదైన దారిలో
నాకై ఆలపించిన అరుదైన ఓ నిశబ్దగీతం... ఇది మాత్రమే మది నమ్మిన అందమైన కలలాంటి నిజం..