చిక్కగా వర్షం కురుస్తుంది. అప్పటికే నేను ఆ ఇంటి ముందు ఉన్నాను. లోపలికి రా.. కొద్దిగా పని ఉందంటూ నా వైపు ఒకసారి చూసి కాసేపు కూర్చో అని తన పని తాను చేసుకుంటూ అంది.. తను నాకు ఇదివరకు పరిచయం ఉందో లేదో గుర్తు రావడం లేదు. ఎప్పుడైనా చూసానో లేదో కూడా తెలియదు అసలు నేను ఆ ఇంటికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను.
కాసేపటికి మరొకరు వచ్చారు.. రావడం తోనే నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి.. సోఫాలో ఉన్న చిన్న ఎర్రటి దిండును తీసుకొని ఒడిలో పెట్టుకొని నా పక్కన కూర్చుంది.. తను నవ్వు చూడగానే అర్థమైంది ఈమె నాకు బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపించింది.. అయినా అంత పరిచయం ఉంటే పలకరించాలి కదా నవ్వుతో సరిపెట్టిందంటే బహుశా పరిచయం లేదేమో అని అనుమానం మొదలైంది.
ఇంతలో లోపల నుంచి ఇంకొకరు వచ్చారు కాఫీ తీసుకో ఇష్టం కదా అంది చిరునవ్వుతో.. ఈ ముగ్గురు చాలా పరిచయమైన వాళ్లే ఎక్కడ చూశానో గుర్తు రాలేదు.. ఎవరో గుర్తు రావడంలేదు కానీ నాతో అందరూ పెనవేసుకున్నట్టు.. గజిబిజి ఆలోచనలతో ఉన్న నాకు .........
ఎందుకో ఒక్కసారిగా నాలాంటి వాళ్ళు లోకంలో ఏడుగురు ఉంటారు అని గుర్తొచ్చింది. నేను మరో ముగ్గురు.. నలుగురం అయ్యాము.. కలలో నేను పుస్తకం చదువుతున్నట్టు అనిపించింది ఒక్కసారిగా..
అప్పుడు వచ్చాడు అతను.. అతన్ని ఎప్పుడు చూసినట్టుగా లేదు కానీ చాలా పరిచితుడే అనిపించింది.. ఒకసారి గట్టిగా అరిచాను.. కల నుంచి మెల్కొన్నట్టు.
నేను ఎన్నిసార్లు చెప్పలేదు నీకు. నీలో మృదుత్వం అంతా నాకు ఎప్పటినుంచో తెలిసిందే అని... ఇదిగో వీరందరిలో ఉన్నదే.. ఒకే రాశిగా నీలో నాకు కనిపించింది.. నాకు నువ్వు తెలుసు మరింత గట్టిగానే చెప్పాను.. మెలకువ వచ్చింది కల చెదిరిపోయింది...
నిజమేనేమో.. అక్కడక్కడ కనిపించే మృదుత్వం రాశిగా తన చెంత దాచుకున్నాడు కాబోలు.. అందుకే ఆకాశం అంత ప్రేమిస్తాను అంటూ అతని చెంత చిక్కుపోయాను కాబోలు..