*కాఫీ విత్ రమాదేవి…420.
ప్రేయసీ ప్రియుల సంగమంలో కంటే ఎదురు
చూపులోనే అసలు మజా వుంటుంది.అతడి
కోసం ఆమె…ఆమె కోసం అతడు..నిరీక్షిస్తుం
టే ప్రతీ క్షణం ప్రేమపురుడు పోసుకుంటుంది.
కలిసిన క్షణాలకంటే ఎదురుచూపు చూసిన
క్షణాలే మత్తెక్కిస్తాయి...కొత్త కిక్కిస్తాయి.!
రమాదేవి ఈ మధ్య రాస్తున్న కవిత్వం ఇంచుమించు ఇలానే వుంటోంది. ఈరోజు ' కాఫీటైమ్' కవిత కూడా ఇలాంటిదే.మీరూ ఓ సారి చదివితే ఓ పనైపోతుంది.ఆనక మనం దీని గురించివివరంగా మాట్లాడుకుందాం!
"నేను వెళ్లేసరికి ఎదురుపడిన
ఖాళీ కాఫీ కప్పు
వెక్కిరిస్తూ కనిపించింది
అతను వచ్చి వెళ్ళాడు కాబోలు..
అతను వేచి ఉండి వెళ్ళాడో
వేగిరిపడి వెళ్ళిపోయాడో
తేల్చుకునేది ఎలా.....
ఇప్పటికి .. అక్కడ
ఖాళీ చేయబడిన కాఫీ
అడుగంచున....
వదిలివెళ్ళిన ఎదురుచూపు
నువ్వే కదూ."..❤️
అతడు వస్తానన్న చోటికి ఆమె వెళ్ళింది..
ఆయితే ఆ వెళ్ళడంలో కాస్తంత ఆలస్యమైంది.
తీరా వెళ్ళి చూస్తే అతడక్కడ లేడు.
అక్కడో ఖాళీ కాఫీ కప్పు వెక్కిరిస్తూ కనబడింది..
ఇప్పుడామె మనసులో ఒకటే సంకోచం…
అతడొచ్చి వెళ్ళాడా?
ఖాళీ కాఫీ కప్పును చూస్తే..
అతడు వచ్చి వెళ్ళినట్లే వుంది.!
తన ఆలస్యానికి మనసు చిన్నబోయింది..
పశ్చాత్తాపంతో కొండెక్కుతున్న దీపంలా
కొట్టు కుంటోంది.
ఇప్పుడామె మనసులో రెండు ప్రశ్నలు
తలెత్తాయి.
ఒకటి…అతను తన కోసం వేచి చూశాడా?
లేదా?
లేక
తాను రాలేదని వేగిరిపడి వెళ్ళిపోయాడా?
ఈ చిక్కుమీడిని విప్పుకోలేక..
నిజమేమిటో తెలుసుకోలేక.. మనసు
తుఫానుకు నడిసంద్రంలో చిక్కుకున్న నావలాగ
ఎటూపోలేక.. ఎటుపోవాలో పాలుబోక అన్నట్లుంది.
మరి?
అసలు విషయం తేల్చుకునేదెలా....?
మనసులో ఒకటే రచ్చ..సంఘర్షణ..
అతను తన కోసం వేచి చూసి వెళితే
ఒక లెక్క…!
అలాకాకుండా తాను రాలేదని తెలుసుకొని,
వేచి చూడకుండా వెళ్ళిపోతే ఇంకో లెక్క..!
ఇందులో…
మొదటిది జరిగివుంటే తనమనసుకు ఊరట.
తృప్తి.తనమీద అతనికి వల్లమాలిన ప్రేమవుం
దని మనసుకు నచ్చచెప్పుకోవచ్చు..!
అలాకాకుండా….
రెండో ఆప్షన్ అయితే మాత్రం మనసు
ఓ పట్టాన మాట వినదు.ఎంతకూ దారికి
రాదు.
అందుకే …
మొదటి ఆప్షన్ జరిగి వుండాలని ఆమె
గట్టిగా కోరుకుంది..
తేరుకొని మరోసారి ఆ ఖాళీ కాఫీ కప్పును చూసింది….
ఆ ఖాళీ చేయబడిన కప్పు అడుగంచున....
అతడు కొద్దిగా వదిలెళ్ళిన కాఫీతాలూకు అవశేషం కనిపించింది..
అంతే ఆమె కళ్ళు
వేయి మతాబుల్లా వెలిగాయి.ఆ ఖాళీ కప్పు
అడుగున అతడి ఎదురు చూపు కనిపించింది..
దాన్ని వదిలివెళ్ళింది అతడే అయివుంటాడని నిర్ధారణ కొచ్చింది.
హమ్మయ్య ! అనుకుంది…
మనసు కొంత కుదుటపడింది..
ఇప్పుడామె మనసుకు ఊరట కలిగింది.
అప్పటిదాకా అల్లకల్లోలంగా వున్న ఆమె మనసు నిశ్చల ప్రేమ సముద్రమైంది.
ఇంతకూ అతడొదిలివెళ్ళిన ఆ ఎదురు
చూపుమరేదో కాదు…అతడి హృదయ
మే..అదీతనకోసమే..కేవలం తనకోసమే..
తన ప్రేమకోసమే..!
నిజానికి ఒక వేళ అక్కడతడున్నా,....
అంత సంతోషం కలిగేది కాదేమో? తాను లేకున్నా
తన కోసం ఎదురు చూశాడన్న ' భావనే ' ..
చాలా గొప్పది.నిజమైన ప్రేమకు అదే కొలమానం.
ప్రేమికుల సంగమం కంటే.ఒకరి కోసం
ఇంకొకరు ఎదురు చూడటంలోనే నిజమైన
మజా,కిక్కుంది..ఇదే అమలిన ప్రేమ కవిత
సారాంశం..!
ఈ కవిత రాసిన కవయిత్రి ఆర్. రమాదేవి
గారికి అభినందనలు.!!
*ఎ.రజాహుస్సేన్..!!