ప్రేమ అన్నది ఎంతో చిన్న పదం... ఆ పదానికి వివరణ ఇవ్వడం మొదలెడితే ఎన్ని కావ్యాలు రాసినా సరిపోవు.. ప్రతి మనిషి ఇచ్చే వివరణ కొత్త కొత్త కోణాలను చెబుతూనే ఉంటుంది. ఒకే మనిషి వేరు వేరు సమయాల్లో చెప్పే నిర్వచనం కూడా మారిపోతూనే ఉంటుంది.
ప్రేమలో వచ్చే సమస్య ప్రేమించడం.. ప్రేమించబడడం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం...సమన్వయ లోపం ప్రేమలో అనిశ్చత.. అస్థిరతకు ప్రధాన కారణంగా మారుతుంది...ఈ ఈక్వేషన్ ప్రేయసి ప్రియుల లోనే కాదు స్నేహంలో కానీ బంధుత్వాలలో కానీ ఎక్కడైనా ఒకేలా ప్రతిబింబిస్తుంది..ఒక స్త్రీ పురుషున్ని ప్రేమించినప్పుడు.. అతని కోసం సమయాన్ని నమ్మకాన్ని సేవలను అనురాగాన్ని అనేక బహుమతులు అందిస్తూ అతని కోసం బంధింపబడుతుంది... అతని లేకపోతే క్షణమైనా ఉండజాలనని పదేపదే అనుకుంటూ...(ఇదే విధంగా పురుషుడు ప్రేమించేటప్పుడు స్త్రీ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది) తన ప్రేమ నిజము అనడం వరకు బాగుంది... తను ఎంతగా ప్రేమిస్తుందో తను ప్రేమలో ఎలా అయితే బంధింపబడిందో ఆ విధంగానే అవతలి పురుషుడు కూడా అతనికి బంధింపబడాలని తమ సమయాన్ని తన సంతోషము ఏదైనా కానీ తన దగ్గర మాత్రమే పొందాలని ఆమె అనుకోవడం మొదలుపెట్టినప్పుడు... సమస్యలు మొదలవుతాయి.
ప్రేమించిన వారు ఎలా అయితే బంధింపబడ్డారో అవతలి వారు కూడా తమ దగ్గరే బంధింపబడాలి అని కోరుకోవడమే ప్రేమను కోల్పోవడానికి ముఖ్య కారణం. ప్రేమలో ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఒకే విధంగా బంధింపబడతారు అన్నది సత్యానికి కొంచెం దూరం. ఒక్కొక్కరి విషయంలో ఆ దూరం ఎక్కువ తక్కువగా ఉండొచ్చు ఇసుమంతైనా తేడా లేకుండా ఒకరికొకరు ప్రేమలో ఉండడం అన్నది ఒకింత నమ్మశక్యము కానిది.
ప్రేమించడం ఎప్పటికీ తప్పు కాదు ప్రేమలో బంధింపబడడం అపురూపమైన విషయం కాకపోతే తాము బంధింపబడ్డామని గుర్తించక, అవతలి వాళ్ళు తమకు బంధింపబడలేదు అన్నది ఎరుగక.... నేను ప్రేమించినంతగా నువ్వు ఎందుకు ప్రేమించవు అంటూ ప్రేమించిన వారితో తగులాటడం మొదలుపెడతారు నీకోసమే ఎంతో సమయాన్ని కేటాయించానని, నీకోసం ఎదురు చూస్తుంటే నాపై చిన్న చూపని మనం ఏదైతే చేస్తున్నామో అది మన ఆనందం కోసం చేస్తాం.. మనం ప్రేమించడం వల్ల చేస్తాం.. మనం ప్రేమించడం అది మనకు అపురూపం.
ఎదుటివారికి అంతే గొప్పగా అపురూపం అవ్వాలని ఆశపడడం.. అవతలి వాళ్ళు మన దగ్గర బంధింపబడాలని కోరుకోవడం .. మనకు తెలియకుండానే మన మనసులో అసూయను ద్వేషాన్ని రగిలించడం ఒకదానికి మరొకటి తోడై ప్రేమ బీటలు బారి ... ఒక్కోసారి ఒక అసహ్యకరమైన అసూయ అవమానాల సంఘటనలతో అంతమవుతుంది... అంతటితో ఆగిపోదు ప్రేమలో బంధింపబడిన మనసు విపరీతమైన ద్వేషంతో నిండిపోతూ ప్రేమ అన్నది అబద్ధమని ..ప్రేమించడం తప్పని.. లోకంలో ప్రేమే లేదని ఎన్ని విధాలుగా ద్వేషించవచ్చో అన్ని విధాలుగా ద్వేషిస్తూ... అవతలి వారి మనసును చిన్నాభిన్నం చేస్తూ.. తమకు తాము గొప్ప ప్రేమికులమనే మభ్యపెట్టుకుంటూ వారి జీవితంలో వెనకడుగులు వేస్తూ ఉంటారు...( అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే ప్రేమించలేదని చంపడం వంటివి)
ప్రేమ అందించడం ..అందుకోవడమనే ప్రక్రియల అంతరం గుర్తించనంతవరకు... ప్రేమించే మనసులు గాయపడుతూనే ఉంటాయి... ప్రేమించే మనుషులే అంతరం గుర్తించక ప్రేమను ద్వేషిస్తూ ఉంటారు....
ఒక్క నిజాన్ని గుర్తించండి మీరు ప్రేమించే వారుగా ఉన్నారా... ప్రేమింపబడేవారిగా ఉన్నారా...
మీరు ప్రేమించే వారుగా ఉంటే ప్రేమించండి అంతేగాని అవతల వారు తమ దగ్గర బంధింపబడాలని పదేపదే కోరుకోకండి.... ఒకవేళ మీరు ప్రేమింపబడేవారుగా ఉంటే మీరు వారికి బంధింపబడలేదు అన్న విషయాన్ని గుర్తిస్తే.. వారి నుంచి సాధ్యమైనంత త్వరగా దూరం జరగండి లేదంటే వారి అకారణద్వేషానికి గురవుతారు... అవమానపాలవుతారు.
******
ఈ ప్రేమ జగమెరిగిన సత్యం.....
మనిషికి మనిషికి మధ్యనే కాదు మనిషికి దేవుడికి మధ్యన కూడా సంభవించేది కూడా ప్రేమే... నేను దేవుని ఎంత నమ్మాను నాపై కనికరం లేదు అంటాడు. ప్రేమ అనే ప్రక్రియ ఎంతటి కష్టపరమైనదో తెలుసుకోగలిగితే కదా... దేవునిపై ఆరాధన ఎలా ఉండాలి అంటే అతను ఏ దూరాన ఉన్న ఆనవాళ్లు వడిసి పట్టుకోగలిగినపుడు కదా తెలిసేది, అతడు నీకై వెనుతిరిగి చూస్తాడో లేదో... ఇదే కదా మనం తలుచుకొని పరవశం చెందే మహామహులు చెప్పిన మాట...