పొద్దున్నే వంట గదిలోకి వెళ్తానో లేదో.. స్వచ్ఛంగా పాలు కనిపించేసరికి ముందుగా దాన్ని పొయ్యి మీద పెట్టేద్దాం అనిపిస్తుంది.. దాని వంక చూస్తూ అడుగుతాను వేచి ఉంటావు కదా నేను వచ్చేవరకు అని.. అది నన్ను మౌనంగా అలానే చూస్తూ అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకో అని మారాము చేస్తుంది...
కూరగాయలు తరుక్కుంటూ అటు ఇటు చూస్తూ తన వంక చూస్తూ... ఉన్నప్పుడు తను కూడా చిరునవ్వుతో నన్నే చూస్తుంది నాకోసం వేచి ఉన్నట్టు...
ఇంతలో పిల్లలు వస్తారు కాఫీ కలుపుదామని అటువైపు చూస్తానా.. తనను పట్టించుకోలేదని ఉక్రోషం కాబోలు ఒక్కసారిగా చప్పుడు చేస్తుంది.. కోపంగా తనవైపు చూసి అరవడం ఆపమని మొట్టికాయ వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను... నిశ్శబ్దంగా పాలమీగడ దుప్పటి కప్పుకొని వెచ్చగా నిద్రపోతుంది.. తన అలకతీరి చల్లబడే వరకు వేచి ఉండి ఫ్రిజ్లో పెట్టేస్తాను...