నీకైనా తెలుసా...
నేను ఎక్కడో కురిసే వాన జల్లును ఒడిసి పట్టుకుంటున్నాను..
నా వైపుకు వానజల్లుల రహదారి ఎలా ఏర్పడిందో కానీ..
కొన్ని గులాబీ మాటలు.. మరికొన్ని చిరునవ్వులు నా మది వరకు విసిరి వెళ్ళాడు
అబ్బో . నా మనసు అతిథి మర్యాదలకు ఆమడ దూరం ఉండేది కాస్త... అద్భుతం అంటూ నిలబడిపోయింది..
అసలు ఎవరి ఓయ్ నీవు...
నువ్వు అందని చందమామ కాదు అందుకోలేని నక్షత్రము కాదు రాలిపడిన పారిజాతమో కాదు... మరి ఇంకెవరు... ఆలోచన సంద్రంలో చిక్కుబడి పోయాను...
ఇక్కడితో ఆపేద్దాం ఆలోచనను... ఆపేద్దాం.ప్రశ్నించడం అనుకుంటా... ఏమి చేయను... ప్రశ్నించడం ఆపే దైర్యం లేదు... ఏదో ఒక జవాబును ఖాయం చేసుకోవాలన్న దిగులో...తెలివిలేని తనమో... గుర్తెరగను...
ఏమొయ్ అన్న చనువు తీసుకోను లేను... ఎలా ఉన్నారని కుశలాలు అడుగుతూ దూరంగా ఉండలేను... ఖచ్చితంగా ఎక్కడ గీత గీయాలో తెలియని దూరంలో దగ్గరై ఉన్నాను కదా...
ఆ వైపు నీవున్నావన్న ఆనవాలు... నా ఎన్ని క్షణాల్ని సొంతం చేసుకుంటున్నాయో తెలుస్తుందా... నాకై నేను పంచుకునే నీ ఆలోచనకు చెల్లింపు మూల్యం అర్థమవుతుందా..
ఎన్ని చెప్పినా చివరాఖరకి ...
నీవు నాకు తెలియదు అన్నమాట మనసును మాత్రం పూర్తిగా వదిలిపెట్టదు....
ఇంతకు నువ్వు నా మృదువైన గులాబీ సోయగపు మోహపు వర్ణచిత్రమేనా .......