నీకు ఓ లేఖ వ్రాయాలని అనుకుంటా...
అక్షరం మొదలు పెట్టకముందే అనంత మైన భావాలు అంతం లేకుండా సముద్రపు అలలా అలపు లేకుండా నను తాకుతూనే ఉంటాయి..
నీకు తెలుసా....ఒకప్పుడు నా మనసు ఎక్కడో దారి తప్పిపోయింది .. వస్తూ వస్తూ ఆరుగురిని వెంటబెట్టకొని వచ్చింది... మనలాంటి వారే లోకంలో మొత్తంగా ఏడుగురు ఉంటారన్నది నిజం చేస్తూ...
అందులోని అతను నీవే కదా.. అందుకే కాబోలు నీవు ఎక్కడ ఉన్నా... ఏమీ చేస్తున్నా... నాతోనే ఉన్నట్లు... నాలోనే ఉన్నట్టు ఉంది...విరహం తెలియని చోట ...నీకై విరహాగీతాలు ఎలా రాయను?
గాలి రొదచేయని సమయాన నీతో మాట కలుపుతాను... అనంతంగా మాటలు..కొన్ని నవ్వులు..మరిన్ని అలకలతో ముగిసే వేళ... నాపై ప్రేమ లేదంటూ నువ్వు విసిరే చిన్ని ఇసుక రేణువు... నీ పెదవి వీడని నవ్వులోనే కరిగిపోతుంది... ఈ అద్భుతం పదే పదే ఎదురవ్వడం కోసమే కాబోలు... నీతో మాటల యుద్ధం మొదలెడతాను
నీవు నాకు తెలియదంటూ ..వాదించే నాకు నీ మౌనం చెపుతుంది గుసగుసగా.... నా ప్రశ్నకు సమాధానం ఎన్నో జన్మల ముందే ఇవ్వబడిందని..
అది చాలు కదా.. జీవితంలోని అన్ని క్షణాలపై నీ పేరు రాయడానికి.....