*కాఫీ విత్ ..రమాదేవి.185
*ఆమె రంగుల జ్ఞాపకాల్లో బందీయైన రామచిలుక.!!
రమాదేవి గారు ప్రేమ కవితల్ని బాగా రాస్తారు.ప్రేమకవిత్వ
మంటే చులకనగా చూసే వాళ్ళకు రమాదేవి కవిత్వమే సమాధానం.ఓ సున్నితమైన భావాన్ని అంతేసున్నితంగా చెప్పి మెప్పించడం అంత తేలికేం కాదు..చేయితిరిగిన చిత్రకారుడు గీసిన బొమ్మలా…అందంగా చెప్పగలగాలి.
కవి చెప్పింది నేరుగా పాఠకుడి ❤️ గుండెను తాకాలి.
అప్పుడే ప్రేమ కవిత్వం ' రస 'స్థితిని పొందుతుంది.!
ముందుగా రమాదేవి కవిత చదవండి.ఆతర్వాత తీరిగ్గా
మాట్లాడుకుందాం..!!
"నా చెవి లోలాకు నీ మాటకై
నా కాలిపట్టా నీ అడుగుల జాడకై
నా చేతి గాజులు నీ రాకకై
వెతుకుతుంది
నీ మౌనం తెలిసి కూడా
దరిదాపుల్లో లేని నీకోసం
నా నీడ వేచి ఉంది...
బహుశా
నీ రంగుల జ్ఞాపకాల్లో బందీనై
నన్ను నేను మరిచానేమో"!!
*ఆర్.రమాదేవి.!!
అతడామె….ప్రియుడు…,
అతడంటే…ఆమెకు ఎనలేని ప్రేమ.
ఎంతంటే?
మాటల్లో చెప్పలేనంత…!
అతని….మాట
అతని….అడుగుజాడ
అతని…రాక..
ఒకటేమిటి?
అన్నీ… ఆమెకు ఇష్టమైనవే.!!
ఇష్టమే కాదండోయ్ ! ప్రాణం కూడా..,
అందుకే వాటిని ఆమె ఆభరణాలుగా చేసుకుంది.
అంతేనా..?
తన దేహంపై అలంకరించుకుంది.
అతని మాట వినాలని 'చెవిలోలాకు'…
అతని అడుగుల జాడకోసం ఆమె ' కాలిపట్టా'
అతడి రాక కోసం ఎదురు చూస్తూ 'చేతిగాజులు'…
ఎదురు చూస్తున్నాయి.
అంతే కాదు…
అతడి మౌనం తెలిసి కూడా….దరిదాపుల్లో లేని అతడికోసం ఆమె ' నీడ ' వేచి ఉంది...
అంతెందుకు..?
అతని రంగుల జ్ఞాపకాల్లో బందీయై….తన్ను తాను మరిచిపోయింది..!!
*ఎ.రజాహుస్సేన్.
నంది వెలుగు..!!