వేల చెట్లు రాల్చిన ఆకులపై కనబడని నీ పాదముద్రలకై వెతుకుతా.. కనబడని బాటపై నీ రాకకై వేచి ఉంటా.. నిజం తెలిసినా వీడని స్వప్నంలా అలికిడి విన్నంతనే కనుచూపుమేర నీకై వెతుకుతా..
గుట్ట మీది అమ్మవారికి సంధ్య దీపం పెట్టబోయి.. తళుక్కుమనే నీ చిరునవ్వు నా గాజుల సవ్వడితో వెంట తెచ్చుకుంటా..
అయినా....
ఎందుకోయి పదేపదే విసిగిస్తావు మధ్యాహ్నపు ఎండలో కనపడని నీడలా.. చీకటిలో దాగిన నైట్ క్వీన్ పరిమళంలా.. మా ఇంటి ముంగిట రంగవల్లిలా..
ఏది ఏమైనా నా కాలి మువ్వల సవ్వడి నీ పేరు తలచింది..నా కాటుక కన్నుల నీ రూపు గీసింది..నా చేతి గోరింటాకు ఎర్రబడింది... నీ ప్రేమ ఆనవాలు అంటూ వెర్రి మనసు రాగరంజితం అయ్యింది...
నేను చెప్పేవన్నీ ఊహాగా మిగిలే ఊసులు కావని .. నా కనుచూపు మేరలో కనుమరుగై ఉన్నావని.. కాలం ఒడిలో నువ్వు ఒదిగిపోయావని తెలుసు...
అయినా నీ ప్రేమకు ఆనవాలు ఎందుకోయ్.. నాలో సగం నీవై ఉండగా....