ఎందుకో నీవు పదేపదే గుర్తుకు వస్తావు..
జడివాన కురుస్తూ హోరెత్తి పోతుంటే సన్నని చినుకల్లే గుర్తొస్తావు.. ప్రళయంలో మహావృక్షాలు కూలిపోతుంటే ఎందుకో అప్పుడే చిగురించే మొక్కలా గుర్తొస్తావు.. వాగు వంకలు వరదై పొంగే వేళ.. మా ఊరి చెరువల్లే గుర్తొస్తావ్..
విదిలించిన మెతుకల్లే నేనుంటే.. దరిచేరిన చిన్ని పిట్టలా గుర్తొస్తున్నావ్.....పారవేసిన కసువులా చెల్లాచెదురై నప్పుడు సుడిగాలిలా మారి నీలో కలుపుకుంటావు..
ప్రణయంలో ..ప్రళయంలో ..అనాదరణలో.. క్షణం వీడని నిన్ను చూసినపుడు... ప్రేమంటే ఏమిటో అని అనంత ఆలోచనలు విరుచుకు పడతాయి..
ఏది నా ప్రేమ అనంతమా అనల్పమా నీపై...
చూపుతో కట్టేయనా.. మనసులో బంధించనా జ్ఞాపకాలతో చుట్టేయనా.....
సముద్రంలోని నిశ్శబ్దానిగా..హరివిల్లులోని తొమ్మిదో వర్ణంగా.... పసిపాప రోదనలోని పిలుపులా.. మ్రోగని వేణువు లోని పాటలా..నిన్ను వేల రూపులుగా చిత్రించనా..
నీవు లేని చోట నీకై వెతుకుతూ.. నీవు రాని చోట నీకై వేచి ఉంటూ... నిజం తెలిసిన అబద్దాన్ని అందంగా చుట్టుకుంటూ.. ఊహలన్నీ అందమైన జ్ఞాపకాలుగా మారుస్తూ...
ఎక్కడ ఉన్నాను నేను.. నీలోని నేను దగ్గరగా. నాలోని నీవు దూరంగా... కాదేమో నీవు నేను అన్న గీత చెరిగిపోయి....ఆనందం ..దగ్గరితనం.. ప్రేమ.. ఇష్టం అన్నీ ఒక దానికి ఒకటి రంగులదారాల్లా కలిసిపోయాయి ఏమో.. లేదంటే నీవు నిజంలో ..నేను నిజం లాటి అబద్దంలో కలసి నడుస్తున్నాము ఏమో.
ఏదిఏమైనా చెప్పాలని ఉంది.. పలవరిస్తూ.. కలవరిస్తూ.. పలకరిస్తూ పదేపదే చెప్పాలని ఉంది.. ఎందుకో నీవు పదే పదే గుర్తొస్తావు..