నీ కోసం.... అచ్చంగా నీ కోసం
బంధించాను మనిషిని... మనసుని.. మరపు రాని జ్ఞాపకాన్ని...అయినా...మాట్లాడని నీతో చెప్పాలని ఉంది....
నీ కోసం ఒక లేఖ రాయాలన్న ఊహకు ఊపిరి అందక ముందే ..అక్షరాలు సింగారించుకోక ముందే....నా సందేశం నీకు అందించే రహదారి ఆనవాలు ఏమిటో...
మూసి ఉన్న అద్దాల కిటికీ ఆవల కనిపించే ఆకాశాన కలవరపడుతున్న మబ్బుతునకై దాక్కుంటావెలా
నీడలా రెల్లుగడ్డి నన్నల్లుకున్నప్పుడు.. నీరెండలా నీవు కమ్ముకుంటావెలా.. ....సుదూర రహదారిపై నా చూపు వెతుకుతున్నప్పుడు చిన్ని పిట్ట విన్యాసాలుగా కంటి ముందు కదలాడతావెలా......
నేను ఊసులు చెప్పమన్నానా ఊరడించమన్నానా... అడిగానా దరి చేరమని.. దరిదాపులకు రమ్మని...
నా ప్రయాణంలో నీ తోడు అడగలేదు నీకై వెతకలేదు అయినా ఎందుకు అలసిన చిరుగాలిలా చూసి వెళ్తావు.......నా చూపు వెతకడం లేదు నా మనసు అడగడం లేదు అయినా ఎందుకు నా ముంగిట పచ్చగడ్డి తివాచీ పరుస్తావు...
నాతో నడిచే ఎన్నో జతల కాళ్ళున్నాయి అయినా ఎందుకో నీ అడుగు జాడలు ఇంకా మాసిపోలేదు..
సమయం కాని సమయంలో నిశ్శబ్దం విలయతాండవం చేస్తున్న వేళ ఎందుకో నీవు పలకని మాట పాటగా వచ్చి చేరింది..
అడగని ప్రశ్నలో.. .. చెప్పని మాటలో..దరిచేరని ఊహలో.. తెలియని దారిలో.. వెలసిన రంగులో పూయని పూవులో.... కూలిన చెట్లులో...మొలవని మొక్కలో.. ఎందుకు పదేపదే నీ అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది..
నా చుట్టు కనిపించని కోటగోడ కట్టావేమో... నా మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది మాట్లాడని నీతో మాటలు చెప్పాలని...