ఓ లేఖ

జ్ఞాపకాల బంధీ..ఏవైనా నాలుగు మాటలు చెప్పాలి అనుకుంటాను..

ఎక్కడ మొదలు పెట్టాలి అని ఒక చిన్న ఆలోచన రాకముందే వడివడిగా పరుగులు పెడుతూ ఎన్నో భావాలు మనసు చుట్టూ చిక్కని చక్కని పొదలా అల్లుకు పోతాయి...

ఎక్కడో జడి వాన కురుస్తూ ఉంటే నీ పక్కన చలిమంట వేసుకుంటున్నట్లుగా ఊహలు అల్లుకు పోతాయి.. ఎక్కడో పాత హిందీ పాట వినిపిస్తుంది ..వడివడిగా నా వైపు అడుగులు వేస్తున్న నీవు కనిపించక కనిపిస్తావు..

ఒక్కోసారి మాటలే తెలియని పసిపిల్లవాడిలా అనిపించి అరచేతిలో దాచుకుని లోకం అంతా చూపించాలి అనిపిస్తుంది... మరోసారి కర్ర చేతపట్టుకుని నాతో 4 గుంజిళ్ళు తీయిస్తావనిపిస్తుంది...

అద్దంలో చూసిన ప్రతిసారి ఇష్టంగా చేతులు చాస్తున్న నువ్వే కనిపిస్తావు..
ఒక్కత్తినే ఉన్నా అనుకున్న ప్రతిసారి నీ ఊహ నులివెచ్చగా తగులుతుంది..
విరజాజులు విరిసినవేళ నీ జ్ఞాపకాల సౌరభం గదంతా అలుముకుంది..

నువ్వంటే వేరుగా లేవేమో నాలోని ఒక ఆనవాలు కాబోలు... కసిరించే మాట...కవ్వించి నవ్వు.... బెదిరించి చూపు.. చూపించని ప్రేమ.. అన్నిటినీ కలిపి గిజిగాడి గూడు అల్లావేమో....

తారా తోరణాలు మధ్యన వెన్నెల వర్షం కురుస్తోంది.... రొద చేస్తున్న రైలుబండి పచ్చని పచ్చిక బయలులో వెళుతుంది... అప్పుడే పుట్టిన పక్షిపిల్ల సమయం గానక  పిలుస్తోంది..... ఇప్పుడు వీటి సంగతి ఎందుకు అంటే ఏమి అని చెబుతాను నా చూపు వెళ్ళిన ప్రతి చోట నీ జ్ఞాపకాలు తారట్లాడుతున్నాయి మరి..

పొయ్యి మీద పాలు పొంగిపోయాయి.... పప్పులో ఉప్పు వేయనేలేదు.... వచ్చిన అతిథికి పాలులేని డికాషన్ ఇచ్చాను కాబోలు నిమిషమైనా ఆగక వెళ్ళిపోయాడు... మనసును అదుపు చేయడం మర్చిపోయాను కాబోలు... వంట ఇల్లు నాతో తగువు వేసుకుంది....  ఇటు రావలసిన పనిలేదు పొమ్మంది..

విరబూసిన మల్లె చెట్టు.. పూల బాట వేసింది నీవు వస్తావన్న ఆశ కాబోలు..... పారిజాతం చెట్టు వీధి వైపుకు ఒరిగింది దూరం నుంచే నీ ఆనవాలు ఒడిసి పట్టాలని కాబోలు... సంపంగి పూల సువాసన నీకై నాలుగు వీధులు చుట్టబెట్టి వచ్చింది...

నాలోని నువ్వు ..నీలోని నేను ..ఒకరిలో ఒకరు ..గజిబిజి దారంలా ..చిక్కుపడిన ఊహల ఉయ్యాల్లో.. ఇక్కడే ఉన్నాము కదా ..అయినా ఎందుకో నాలుగు మాటలు చెప్పాలనిపిస్తుంది....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!