మీ పిల్లలకు కథ చెప్పరూ .....ప్లీజ్

చందమామ పుస్తకంలో బేతాళ కథ చూడగానే ఎందుకో చిన్ననాటి బాల్యం కళ్ళ ముందు కదలాడింది. ఊడిపోయిన పన్ను పాతిపెడితే డబ్బులచెట్టు మొలుస్తుందని చెప్తే నిజమని నమ్మి ఆ పన్ను తీసికెళ్ళి మట్టిలొ పాతిపెట్టడం. చెట్టు మొలిచిందా లేదా అని రోజూ చూడడం... పదిరోజులు అలా చూసి మర్చిపోవడం. పుస్తకాలలో నెమలి ఈక పెడితే అది పిల్లలు పెడుతుంది. అంటే కష్టపడి. స్నేహితులకు లంచాలు ఇచ్చి నెమలిఈక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపూర్వంగా చూసుకోవడం. పెన్సిల్ పొట్టుని పాలల్లో వేస్తె రబ్బరు అవుతుందని దాచుకోడం. కొవ్వొత్తి వెలిగించి రాత్రి 12 కి చింత చెట్టు దగ్గరికి వెళితే దయ్యం కనిపిస్తుందంటే, నిజమని నమ్మి భయపడడం. స్నేహితులతో కలసి తొక్కుడుబిళ్ళ, గచ్చకాయలు, కోతికోమ్మచి, గిల్లిదండు, బొమ్మల పెళ్లి యిలా ఆటలాడడం. జానపద సినిమాలు చూసి, చందమామ కథల్లోని రాజకుమారులను తలుచుకుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధం చేయడం... ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా...

అమాయకమైన, కల్మషం లేని బాల్యం. ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా! మాకు ఉన్న బాల్యం ఇపుడు లేదేమో అని అనిపించేది...కానీ బాల్యం ఎవరికైనా ఉంటుంది..కాని దాని నిడివి తగ్గిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినవన్నీ నిజమని నేను 8వ తరగతిలో కూడా అనుకునేదాన్ని. కానీ నా కూతురు 5వ తరగతిలోనే అవన్నీ అబద్దం అంటూ చెప్పేసరికి ఎంతగా ఆశ్చర్యపోయనో మరీ...వాళ్ళు మాకంటే తెలివైన వాళ్ళు. మేము కలలు కంటూ కథలు వినేవాళ్ళం, కానీ ఆ కథలను ఇప్పటి కాలానికి అనుగుణంగా చెప్పక పొతే పిల్లలను ఆకట్టుకోడం కూడా కష్టమే.. ఇదే ఇ౦తకు ము౦దు ఆర్టికల్ లో నేను చెప్పిన 'ఈక' కథ లో నా కూతురు సంభాషణే అందుకు తార్కాణం.

ఏది ఏమైనప్పటికీ కథలు పిల్లల మానస వికాసానికి మొదటి మెట్టు. ఇపుడు కథలు వినేవాళ్ళు, కథలు చదివేవాళ్ళు తక్కువయ్యారు. ఇందులో తప్పు ఎవరిదీ అని అనాలి..కథలు ఏమి మార్కులు తెచ్చిపెట్టవు అనే నాన్నలదా, మమ్మల్ని విసిగించకుండా కాసేపు టి.వి చూడండి అని చెప్పే తల్లులదా... ఆ కథల పుస్తకాలు కొనడమే దండగ అని అనుకునేవాళ్లు మనచుట్టూ చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. కథలు పిల్లల మనసుకు పాఠాలు నేర్పుతాయి. ఒక మంచి పుస్తకం నేర్పగలిగింది ఒకోసారి మనం జీవిత కాలంలో కూడా నేర్పలేము ... పిల్లల కోసం చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిని పిల్లలకు ఓర్పుతో, నేర్పుతో చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారు.

పిల్లలు... కథలు అంటే చాలు...మాకు ఎవరు నేర్పారు పుస్తకాలు చదవడం ఆశక్తి ఉంటే అవే వస్తాయి అని చిన్నమాటతో సరిపెట్టేవాళ్ళు కోకొల్లలు. అప్పటిలో ఇన్ని ప్రచారసాధనాలు లేవు. యిలా ఒంటరికుటుంబాలు తక్కువే..సెలవులు అంటే అమ్మమ్మ ఊరు వెళ్ళడం చాలా సహజం. అమ్మకు పిల్లల కబుర్లు వినడమే ఒక ఆటవిడుపులా ఉండేది. అవన్నీ వదిలేసి పిల్లలను తప్పు పడితే ఏమనాలి.
పిల్లలు మాటలు రాకముందు నుండే వినడం నేర్చుకుంటారు...మీరు చెప్పే మాటలే వాళ్ళకు అద్బుతం. పిల్లల బుడిబుడి నడకతో పాటు మీరు తీరిక చేసుకొని చెప్పే కథలు వారిలోని ఉహాశక్తిని పెంచుతుంది., మనసుకి స్పందన, మాటకు మధురిమను ఇస్తుంది. చిన్నపిల్లలు మల్లెతీగ లాంటివాళ్ళు..ముందునుంచి జాగ్రత్తగా అల్లితేనే మల్లెపందిరి అవుతుంది కాని..అది పూర్తిగా ఎదిగాక మల్లెపందిరి వేయాలనుకుంటే సాధ్యమా!

మీకు ఎంత పనివత్తిడి ఉంది..ఉద్యోగం చేస్తున్నారా...మీ ఆరోగ్యం సహకరించదా....యిలా ఏమి అడగలేను...ఎవరి ఇబ్బందులు వాళ్ళవి...కాని మీ పిల్లల మానసిక వికాసానికి మీకు అందుబాటులో ఉన్న అందమైన సాధనం. ఈ కథలు..మీరు మాత్రమే చేయగలిగే చిన్నపని ఈ కథలు చెప్పడం... తెలిసి చేసినా తెలియక చేసినా తప్పేనండి ...! పిల్లలంతా ముత్యాలే.....కానీ ఆణిముత్యాలు కావాలని ఆశపడడం తప్పుకాదేమో కదా....అమ్మా! కథ చెప్పవూ అని పిల్లలు అడగడం లేదంటే అందులో మన పాత్ర ఎంతో ఉందో తెలుసుకోవాలి కదా...నేను ఎవరిని తప్పుపట్టడం లేదండి, ఎందుకో నా మనసులోని ఆరాటం చెప్పుకోవాలి అనిపించి యిలా మీ ముందుకు...కథల గురించి ఇంతగా చెప్పి ఒక చిన్నకథ కూడా చెప్పకుండా ముగిస్తే ఏం బాగుంటుంది...ఈ కథ మీ కోసం...మీరు మీ పిల్లలకు చెప్పడం కోసం....

దాన కర్ణుడు...
ఒకసారి కృష్ణుడు, అర్జునుడు కలసి వెళ్ళేప్పుడు ఎందుకో కర్ణుడి ప్రసక్తి వచ్చింది...అపుడు అర్జునుడు అన్నాడు "బావా" కర్ణుడు దాన కర్ణుడు అని పిలిపించుకునే అర్హత ఉందా.. ఉంటే ఎవరైనా పంచుతారు అది గొప్పేనా అని ఎగతాళిగా మాట్లాడసాగాడు. అంతా విన్న కృష్ణుడు ఏమి మాట్లాడకుండా ..కొంత దూరము వెళ్ళిన తరువాత దూరంగా (తన మాయతో సృష్టించిన) ఒక వెండి కొండను, ఒక బంగారుకొండను చూపించి, అర్జునా! అదిగో అక్కడ కనిపించే రెండు కొండలు నీ సొంతం అవి నువ్వు సాయంత్రం లోపల దానం చెయ్యి..నీవు చేయలేకపోతే కర్ణుడికి ఒప్పచెపుతా అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో... సరే నీవు పని పూర్తి చేసుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు...
కొన్ని క్షణాలు ఐతే పొద్దువాలి పోతుంది అక్కడ చూస్తె..సగం కొండ కూడా తరగలేదు.. అపుడు అర్జునుడు "బావా" ఎవరివల్ల కాదు... ఇది అసాధ్యం అన్నాడు కృష్ణుని చెంతచేరి. అపుడు కర్ణునికి ఒప్పగించాడు ఆ పనిని కృష్ణుడు. ఆతను రెండు క్షణాల్లోనే తిరిగి వచ్చి మీరు చెప్పిన పని పూర్తి అయింది అని చెప్పి, కృష్ణునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని విచారించగా..తన చెంతకు వచ్చిన ఇద్దరికీ ఒకరికి వెండి కొండ ఇంకొకరికి బంగారు కొండ దానంగా ఇచ్చాడని తెలుసుకున్నాడు అర్జునుడు.. అపుడు కృష్ణుడు ...చూసావా అర్జునా ఉన్నదానిలో నుండి పంచేవాడివి నీవు...ఉన్నదంతా పంచేవాడు కర్ణుడు... అందుకే దానకర్ణుడు అయ్యాడు అని...దరహాసం చిందించాడు చిద్విలాసంగా శ్రీకృష్ణుడు.....

 


Comments

Post New Comment


GONE MADHU BABU 09th Apr 2019 22:35:PM

Excellent


SREEDHAR TUMULURI 26th May 2011 07:27:AM

miru cheppindi aksharala nijam rama garu...enta mandi parents valla pillalani ollo koorchopettukoni ilanti kathalu cheputunaru?ee kaalam pillallo enta mandiki chandamama,panchatantram lanti kathalu telusu?asalu vaatillo unnata maanasika vikasam,personality development ye books lo untundi cheppandi?chetulaara maname mana pillala future ni andhakaaram loniki tosestunnamemo anipistundi..