పిల్లల్ని ఎలా చూడాలి అన్న విషయంలో చాణక్యుడు చెప్పింది చూద్దాం. మొదటి 5 సంవత్సరాలు పిల్లలను మహరాజులా చూడాలట. ఆ తరువాత యువరాజులా శిక్షణ ఇప్పించాలి. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి స్నేహితునిగా మారాలి. అంటే మొదటి 5 సంవత్సరాలు మహారాజులా చూడాలి. రాజు ఆజ్ఞకు బదులు చెప్పకూడదు కదా! ఏది కావాలంటే అది ఇవ్వాలి. ఒక వేళ అడిగింది ఇవ్వలేనప్పుడు వారిని అటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్లకపోవడమే మంచిది. ఈ వయసులో పిల్లలకు సేవ చెయ్యడమే తల్లి తండ్రులకు మహానందం. 5 సంవత్సరాల వరకూ వీలైనంతవరకూ నో చెప్పకూడని వయస్సు. ఆ తరువాత నో చెప్పడం మొదలుపెట్టవచ్చు. అంటే డైరెక్టుగా వద్దు అని చెప్పమని కాదు. ఏది మంచిది, ఏది కాదు అనే విచక్షణా జ్ఞానాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో సహనంతో, ప్రేమతో, తర్కంతో వివరించాల్సిన వయస్సు.
_6 నుండి 14 సంవత్సరాల వరకూ యువరాజులా శిక్షణ ఇప్పించాలి. పూర్వం 7 సం||ల నుండి రాజ కుమారులైనా గురుకులానికి వెళ్ళి శిక్షణ పొందాల్సిందే. ఈ రోజుల్లో అంత వివేకం/సమయం గురువులకు లేదు కనుక తల్లి తండ్రులే ఆ బాధ్యత కూడా తీసుకోవాల్సి వస్తుంది. తల్లిగా ప్రేమ, సహనం, కరుణ చూపుతూనే, తండ్రిగా బాధ్యతలు తెలియచేయడం, గురువుగా ఆచరించి చూపడం ఈ వయస్సులో అత్యంత ప్రభావం చూపే అంశాలు. ఇక టీనేజ్ నుండి తమను ‘వ్యక్తులు (Individual) గా గుర్తించాలనే తపన మొదలవుతుంది. నిజానికి ఈ వయసులో వారికి జీవితం పట్ల స్పష్టత, పరిణతి లేక, పరిణితి లేని తోటి మిత్రుల సలహాలే సరైనవని పిస్తాయి. ఈ సమయంలో పెద్దల సలహాలు, నిబంధనలు, నీతుల పట్ల అసహనం వ్యక్తంచేస్తుంటారు. ఎదురు సమాధానాలు చెప్తారు. తల్లి తండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరూ తమను 'కంట్రోల్ చేయడానికే ఉన్నట్లు భావించి, నిబంధనలను అతిక్రమించడమే ధ్యేయంగా మారిపోయే పిల్లలను సరైన దారిలోకి మళ్ళించడానికి “వారిలో ఉన్న పలురకాల టేలెంట్స్ ను, సామర్థ్యాలను, ఆసక్తులను'' చిన్ననాటినుండే గమనించి, అటు వైపు ప్రోత్సహించడమే ఉత్తమం.
ఒక సంవత్సర కాలం గురించి ఆలోచిస్తే
- మొక్కజొన్న నాటు
ఒక దశాబ్దపు ప్రణాలిక అయితే
- చెట్లు నాటు
ఒక జీవితకాలం ఆలోచిస్తే
వ్యక్తులకు శిక్షణ ఇచ్చి విద్యావంతుల్ని చెయ్యి
- క్వాన్సు