మనమందరం మనదైన ఒక ప్రత్యేక పాటను పాడాల్సి ఉంది. మనదైన, మనకే చెందిన ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించాల్సి ఉంది. మనం దానిని ఎప్పటికీ కనుగొనక ఇతరులతో పంచుకోకుండా ఉండిపోతే, మన టేలెంట్, ప్రత్యేకత మనలోనే మరణించి, ఎవరికీ అందకుండా పోతుంది. కానీ ఎప్పుడైతే మీ గీతాన్ని కనుగొని పాడే ధైర్యం చేయగలిగినప్పుడు, - చిరునవ్వులను గమనిస్తారు, మెచ్చుకోలు స్వరాలను వింటారు, మరియు జీవితం నుండి కరతాళధ్వనులను అందుకుంటారు.
మీరెపుడైనా ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని దానిని సాధించారా? ఆ తర్వాత తెలియని ఒక అసంతృప్తికి లోనయ్యారా? మనలో చాలామందికి ఇలా జరుగుతుంది. ఒక పర్వత శిఖరాన్ని అధిరోహించాలనేది ఒక వ్యక్తి లక్ష్యం అయితే, అక్కడకు చేరిన తరువాత అసంతృప్తికి లోనవడం సహజం. ఎందుకంటే ఇక ఆపై అతను పయనించడానికి ఏమీ లేదు, ఆ విజయ గాథను ఎన్నాళ్లు చెప్పుకుంటారు?
ఉదాహరణకు ఒక సుత్తిని తీసుకోండి, అది మేకులు కొట్టడానికి తయారు చేయబడింది. దాని పని అదే!దానినెపుడూ ఉపయోగించలేదనుకోండి. టూల్ బాక్స్ లో పడి ఉంటుంది. అంతే! కాని ఆ 'సుత్తికి ' ఆత్మ స్వీయచైతన్యం ఉన్నాయని అనుకోండి! రోజుల తరబడి డబ్బాలో పడి ఉండటం దానికి చాలా విసుగ్గా ఉంటుంది. లోపల్నించి ఏదో తెలియని అసంతృప్తితో నిండిపోతుంది! ఏదో కోల్పోయిన భావనతో కొట్టుమిట్టడుతుంది. అయినా అదేమిటో తెలియదు.
ఒకరోజు ఒక వ్యక్తి ఆ సుత్తిని బయటకు తీసి కట్టెలు కొట్టాడానికి ఉపయోగిస్తాడు. అపుడది సంతోషంతో నిండిపోతుంది. తనను ఉపయోగించుకుంటున్నందుకు, ఆనందంతో తను చేసే పనిలో లీనమై పోతుంది. కాని రోజులు గడిచేటప్పటికి, ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది. కట్టెలు కొట్టడం బాగానే ఉంది. కాని ఇంకా ఏదో లోటు ఉంది. ఇంకా ఏదో చెయ్యాలని ఆరాట పడుతుంది. తను మరింత కష్టపడి పలురకాల పనులు చెయ్యాలని అనుకుంటుంది. వస్తువులను విరగ్గొట్టడానికి, వంచడానికి ఇలాంటి పనులు చేయడానికి ఉత్సాహపడుతుంది. అపుడు తన అసంతృప్తి తొలగిపోతుంది అని భావిస్తుంది. కానీ ఎన్ని చేసినా ఆ సుత్తికి తృప్తి లేసు. ఆత్మకి శాంతి లేదు.
కొన్నాళ్ళకు ఎవరో ఒకరు ఆ సుత్తిని మేకులు కొట్టడానికి ఉపయోగిస్తారు... ఆకస్మికంగా దాని ఆత్మలో వెలుగునిండుతుంది. తను ఎందుకు రూపొందించబడ్డానో అనేది ఇపుడు తెలుసుకుంటుంది. మేకులు కొట్టడం తన పని, మిగతా పనులేవీ తన దృష్టిలో యోగ్యమైనవి కావు. ఇప్పుడు తెలుసుకుంటుంది, తాను ఇన్నాళ్ళూ దేనికొరకు వెదుకుతున్నానో అనే విషయం!
మనమొక ప్రయోజనం కొరకు సృష్టించబడ్డాం! మనం ఎవరో మనం తెలుసుకునేవరకు, మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. మనం కొన్ని మంచి పనుల కోసం వినియోగింపబడి ఉండవచ్చు. కాని మనం ఆ పనుల కోసం రూపొందింపబడలేదు. మనకు పరిపూర్ణతనిచ్చే పని దొరికినప్పుడు మనస్సుకు తెలిసిపోతుంది.
మీదైన పనిలో మీరు ప్రవేశించినపుడు, మీలో వెలుగు నిండడమే కాదు. మీ చుట్టూ ఉన్న వారందరిలో కూడా వెలుగు నింపగలుగుతారు. ప్రతిఒక్కరు ఒక ప్రత్యేకమైన పని కోసం సృష్టింపబడతారు. ఆ పని చేయాలన్న " తపన " ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది అంటారు రుమి అనే 13 వా శతాబ్ధపు సూఫీ కవి.
ప్రతి మనిషిలోను 'మెప్పు ' పొందాలనే ఆకాక్ష తీవ్రంగా ఉంటుంది. మనం చేసే పనిలోని శ్రేష్ఠతే ఆ మెప్పును శాసిస్తుంది.మనదైన గీతాన్ని ఆలాపించడం ద్వారా శ్రేష్ఠతను మనం సాధించగలం. మనం పాడుతున్న ఫాటకు మనమే పరవశులమైతే, అలాటి పాట ఇతరుల మనసులని తాకదా? లీనమైచేసే ప్రతి పనీ ఒక ఆటే, ఒక పాటే.
అత్యంత సునాయాసంగా చేయగలిగినదై ఉండి, అది మీకు ఆనందాన్ని, పరులకు ప్రయోజనాన్ని కలిగించేది అయినపుడు - మీ స్వీయ సంగీతాన్ని ఆలపించడానికి ఆలస్యమెందుకు? బ్రతకడం కోసం తమది కాని ఇతరుల గీతాన్ని ఆలపించడమెందుకు?
మరణం నీ తలుపు తట్టక ముందే నీకున్నదంతా ప్రపంచంతో పంచుకో!
నీవొక పాటను పాడగలిగితే ఆ గీతాన్ని మధురంగా ఆలపించు, ఆనందించు! - ఓషో