నిశ్శబ్దం...(జెన్ కథ)
ఒక వ్యాపారస్తుడు గురువు దగ్గరికి వచ్చి నాకు మీ దగ్గర కూర్చుని గంటల కొద్ధీ గడిపే ఓపిక, సమయం లేవు. మీరు చెప్పదలచుకున్నదంతా కొన్ని మాటల్లో నాకు సంక్షిప్తంగా బోధించగలరా?" అన్నాడు.
గురువు "కొన్ని మాటలు ఎందుకు? ఒక్క మాటలో సంక్షిప్తంగా చెబుతాను" అన్నాదు.
"నిజంగానా? ఏమిటా ఒక్క మాట" అన్నాడు వ్యాపారస్తుడు.
గురువు "నిశ్శబ్దం" అన్నాడు.
వ్యాపారస్తుడు "మరి ఆ నిశ్శబ్ధాన్ని ఎలా అందుకుంటాం" అన్నాడు.
గురువు "ధ్యానం ద్వార" అన్నాడు.
"అయితే ధ్యానం ఎలా చేస్తారు?"
"నిశ్శబ్దంగా వుండడం ద్వారా" అన్నాడు గురువు.
వ్యాపారస్తుడు నిశ్శబ్దంగా నిష్ర్కమించాడు.
పవిత్ర అరటిపండు... (జెన్ కథ)
అతని గొప్పతనం వల్ల ఆ గురువు పేరు దూరతీరాల్లో, దేశదేశాల్లో కూడా అందరికీ తెలిసింది.
దూరప్రాతం నుండి ఆ గురువు గారిని చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడు. గురువు గారిని కలిశాడు. అప్పుడు గురువు చిన్ని బల్ల ముందు కూర్చుని తన ముందున్న అరటిగెల నుండి ఒక అరటిపండు తెంపుకొని తింటున్నాడు.
గురువు తనని చూడడానికి వచ్చిన వ్యక్తికి కూడా గెల నుండి ఒక అరటిపండును తీసి ఇచ్చాడు. తనలాంటి సామాన్యవ్యక్తికి ఇంత పవిత్రమైన పండును ఇవ్వడంతో అతడు దానిని మహాప్రసాదంగా భావించి బయటకు వచ్చి ప్రేమగా, గౌరవంగా, భక్తిగా ఆ అరటిపండును చూసుకుంటూ ఆ మండపంలో అక్కడక్కడే తచ్చాడుతున్నాడు.
అతని పరిస్థితి గమనించిన ఒక శిష్యుడు అతన్ని అనుసరించి, అతనితో మాట్లాడి విషయం తెలుసుకుని గురువు గారి దగ్గరకు వచ్చి విషయం చెప్పి "అతన్ని ఏం చెయ్యమంటారు?" అన్నాడు.
గురువు గారు నవ్వి "ఆ బుర్రలేనివాడికి అరటిపండును తినమని చెప్పు" అన్నాడు.
మరణానంతరం జీవితం... (జెన్ కథ)
ఒక శిష్యుడు "గురువు గారూ! మరణం తరువాత జీవితం వుందా?" అని అడిగాడు.
గురువు "ఎందుకలా అడిగావు?" అన్నాడు.
శిష్యుడు "ప్రేమ లేకుండా, నవ్వు లేకుండా, పాటలు లేకుండా, కలలు కనకుండా వుండడం దారుణం అనిపించి అలా అడిగాను" అన్నాడు.
గురువుగారు నవ్వి "చాలామంది మనుష్యులు అవన్నీ మరణానికి ముందు కూడా చేయరు. అవి చేసినా పైపైన చేస్తారు. అసలైన ప్రశ్న అది కాదు. అసలైన ప్రశ్న "మరణానికి ముందు జీవితం వుందా? అన్నది" అన్నాడు.