నేడు చాల మందికి జీవితం భారమయిపోయింది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం మనలో 3% మాత్రమే తమకు కావలసినట్టు జీవిస్తున్నారు. 30% కొంతవరకు విజయవంతంగా జీవించగలుగుతున్నారు. మిగతా 67% మంది కేవలం బ్రతుకుతున్నారంతే!
మీరు యాంత్రికంగా, ఏ మాత్రం ఇష్టం లేకపోయినా హృదయగీతమైన సంతోషం లేకుండా కేవలం డబ్బుకోసమే పనిచేయవలసి వస్తుంటే క్రమేపి మీ శక్తి హరించుకుపోతుంది. మనిషి బ్రతకటం కోసం, డబ్బు కోసం పనిచేస్తాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అసలు మనం బ్రతకటం దేనికోసం? కోయిలకు తనదైన పాడడం ఇష్టం. పాడాలంటే తినాలి. తినాలంటే పనిచేయాలి. ఒకవేళ కోయిల తినడం కోసమే పనిచేస్తుందనుకోండి? అపుడు, దాని పాటెక్కడ?
మనకు అవసరం లేని విషయాల్లో పోటీపడిపోతూ కృషి చేయడం వృథా ప్రయాస. మరియు అది ఒక ఎలుకల పందెం లాంటిది. ఇటువంటి వ్యక్తులు నిరంతరం ఒత్తిడికి గురవుతూ, ఇతరుల మెప్పుకోసమో, మెప్పించడం కోసమో పని చేస్తారు. వీరు బౌతికమైన సంపదను కూడపెట్టగలరేమో కాని అంతరంగంలో పేదవారిగానే ఉండిపోతారు. సంపద పెరిగే కొద్దీ వీరి అశాంతి కూడా పెరుగుతుంటుంది. సంపదకూ ఆనందానికీ సంబంధం లేదు. డబ్బు లోపల ఏది ఉందో దాన్నే పెంచుతుంది. ఆనందంగా ఉన్న వ్యక్తి సంపన్నుడైతే ఆనందం పెరుగుతుంది. అశాంతిగా ఉన్న వ్యక్తి సంపన్నుడైతే అశాంతి పెరుగుతుంది.
బ్రతకటం ఎప్పుడూ సమస్య కాదు. మనం పుట్టకముందే మన కోసం తల్లి పాలు సిద్ధంగా ఉంటాయి. జీవించడానికే జీవితం అంతా! పక్షులను చూడండి, అవి విత్తవు పంటను పండించవు. అయినా భగవంతుడు వాటికి రోజూ ఆహారం అందిస్తూనే ఉంటాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠము కాదా! అంటారు జీసస్. ఒక్క మనిషికి తప్ప మిగతా అన్ని జీవులకీ తమ స్వధర్మమేమిటో తెలుసు. మనిషి మాత్రం తన స్వధర్మాన్ని తానే కనుగొనవలసి ఉంది.
ప్రతిరోజూ లేడికి తను బ్రతకాలంటే పులికంటే వేగంగా పరిగెత్తాలని తెలుసు. పులికి తను బతకాలంటే లేడికంటే వేగంగా పరిగెత్తాలని తెలుసు. ఈ రెండిటిలో పులి చాలా బలమైనది. అయినా సుమారు 13 సార్లు ప్రయత్నిస్తేనే కానీ దానికి ఆహారం దొరకదట. ఎందుకంటే పులి, లేళ్ళ గుంపులో ఒక్కదాన్నే టార్గెట్ చేసి తరుముతూ, తరుముతూ కొంతసేపటికి వదిలేస్తుందట. ఎందుకంటే దానికి ఆ ఛాయిస్ ఉంది, కానీ లేడికి అలా కాదు బ్రతకాలంటే పరిగెట్టాల్సిందే! ఒకటి తిండి కోసం పరిగెడితే మరొకటి జీవితం కోసం పరిగెడుతుంది. ఈ కథలో తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే.... తిండి కోసం పరిగెట్టారా అలసిపోతారు, కాని జీవితం కోసం పరిగెట్టారా... పెరిగిపోతారు.
90 % మన సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవే అని నేను చెప్పగలను అందుకే కదా ప్రపంచం అంతా డబ్బుకోసం పరిగెడుతుంది. కాని మనం తెలుసుకోలేకపోతున్న విషయం ఏమిటంటే.... సహజ సామర్ధ్యాలను వృత్తిగా లేదా చేస్తున్న వృత్తికి అనుగుణంగా మలచుకొని సహజమైన ఆట ఆడితే, సకల సంపదలూ మనవెంటపడతాయని.
దారిద్ర్యమంతా మనుష్యుల మస్తిష్కాల్లో ఉంది. ఈ ప్రపంచంలో అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అందుకే జీసస్ అంటాడు "మురికివాడలో ఉన్న వారిని బయటికి లాగాలని ప్రయత్నించకు. వారి మనస్సుల్లో ఉన్న మురికి వాడలను తొలగించు. అపుడు వారికి వారే ఆ మురికి వాడలనుంచి బయట పడతారు" అని
స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒకడు ధనం వెంబడి పడతాడు. మరొకడు ప్రేమ వెంబడి పడతాడు. ప్రేమ ఉన్న వ్యక్తి వెంట ధనం పడుతుంది. ధనం వెంబడి పడిన వ్యక్తికి చావు వచ్చింది. ప్రేమతో ధనాన్ని సంపాదించు, లోభంతో కాదు అంటాడు కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో. సక్రమమైన పద్ధతిలో ధర్మబద్ధంగా సంపాదించిన ధనం శాంతినిస్తుంది. నిజానికి మనస్సులో ఉద్బవించే, సృజనాత్మక ఐడియాలు, సాహసంతో కూడిన నిర్ణయాలు ఎక్కడ ఉరకలు వేస్తుంటాయో, అక్కడికి డబ్బు తనకి తానుగా వచ్చేస్తుంటుంది.
జీవితం నిన్ను అనేక తెలివితక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది.
నువ్వు తెలివైనవాడివైతే ఆ ప్రశ్నలనుంచి ఎంతోకొంత నేర్చుకుంటావ్.
తెలివైన సమాధానం నుంచి తెలితక్కువవాడు నేర్చుకునేదానికన్న,
తెలివితక్కువ ప్రశ్నలనుంచి తెలివైనవాడు నేర్చుకునేదే ఎక్కువ
-బ్రూస్ లీ, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు, తాత్వికుడు.