న్యూ బాంబే టైలర్స్ కథల పుస్తకం లో ప్రతీ కథ మనసుకు తాకుతుంది. ఖదీర్ బాబు వ్రాసిన ప్రతీ కథ చదువుతున్నపుడు, ఆ కథలో ఈ రచయిత ఏ పాత్ర అయి ఉంటాడు, ఇందులో ఎవరికీ ఇతను నేస్తం అయి ఉంటాడు అని ఆలోచన మనసు పొరల్లో కదులుతూనే ఉంటుంది ఇందులోని కథలన్ని మన కంటిముందు జరిగిన సంఘటనలుగా ఉంటాయి. ఇది కథనే కదా అని, క్షణంలో మనరచిపోయి కదిలి మన జీవితంలోకి రాలేము. ఎక్కడో మనము బంధింప బడుతామన్నది ఒప్పుకోలేని నిజం. ఈ పుస్తకం లో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్ , దావత్,జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ ) ఉన్నాయి. అందులో మనసుని బంధించిన, బాధించిన కథ ఈ దూద్ బఖష్. ఈ కథ చదివి ఇదంతా ట్రాష్ అంటూ తప్పుకొని పోయే మనిషి అంటూ ఎక్కడా కనిపించడు.
దూద్ బఖష్....మహమ్మద్ ఖదీర్ బాబు
గుప్పుమనే మంటతో పొయ్యి వెలిగింది. దొడ్లో వీస్తున్న గాలికి సవక్కట్టెలు చిరచిరలాడతా మండుతున్నాయి. ఎండ సెగ ముఖాన తగలతా ఉంటే నజీరత్త వచ్చి పొయ్యి ముందర కూచునింది.
నువ్వు పోయి లోపల కూచోపో అకా. నేను నీళ్ళు కాగపెడతా' అంది బషీరత్త పొయ్యి మీద ఇత్తడి గంగాళాన్ని పెడతా.
నజీరత్త కదల్లా.
మోకాళ్ళు ముడుచుకుని మంటతట్టే చూస్తా ఉంది.
'పో అకా' అంది మళ్ళీ. నజీరత్త మాటాపలుకూ రాకుండా అట్నే ఉంది. ఒక ఏడుపు ఏడ్చిందీ లా. ఒక మాట పలికిందీ లా. మూగరాయాల బిగుసుకుపోయి కూచోనుంది. ఆమె కరిగి కన్నీళ్లు బెట్టుకుంటే కడుపు కోత రోంతయినా చల్లారద్ది గదా అని అంతా చూస్తా ఉన్నారు.
నజీరత్త కరగట్లా.
'మోవ్' నీకే చెప్పేది' అంది బషీరత్త, అదిలించైనా చూద్దామని.
ఆ అదిలింపుకు అదురులో ఉన్న పసిబిడ్డాల ఇంకాస్త మునగదీసుకుంది నజీరత్త. జబ్బ పట్టుకొని బలవంతంగా లేపబోతుంటే, 'రొంపసేపైనా ఈడ కూచోనీమ్మా బషీర్. నా బిడ్డకు ఆఖరుసారి నీళ్ళు కాగాపెడతా ఉంటే నన్ను రాకుండా జేస్తావా' అంది ప్రాధేయపడుతూ.
ఆ మాటకు బషీరత్త కడుపులో నుంచి ఏడుపు పోర్లుకొచ్చింది.
'నువ్వు ఈ వాటాన ఉంటే ఎట్టా ఆకా, వాడెట్టా పోయినాడు... నువ్వు కూడా పోయేదానికి రెడీ అయినావా' అని లబలబనెత్తి కొట్టుకుంటా కింద కూలబడింది.
బషీరత్త ఏడుపు విని పెదత్త దొడ్లోకొచ్చింది. పోర్లకింతలు పెడుతున్న బషీరత్తను చూసి ఆ ఏడుపుకు నజీరత్త ఏమైపోతుందోనన్న గావరాతో కయ్యిన కసిరింది.
'చాల్లే గాని ఆపు మే. ఏందో సొంత కొడుకు పోయినట్టుగా శోకండాలు పెడుతున్నవే. ఇప్పుడేమైందనీ... వాడి టైమోచ్చింది ఎల్లిపోయినాడు. మనవంతా పోవాల్సినోళ్ళంకామా? లే లే ఇస్కూల్లో కెళ్ళి నాలుగు రేగాకులు దూసుకొద్దూ గానీ. చావు నీళ్ళు బోసే ముందు వేన్నీళ్ళలోరేగాకులు కలపాలి గదా' అంది అన్నాక, బషీరత్త తట్టు తిరిగింది.
'నువ్వెందిమే ఈడ... ఇట్టా పడున్నావా? పోయి నీ కొడుకు దెగ్గిర కాసేపు కూచోరాదా? కంటినిండా చూసుకోరాడా? ఇంకాసేపు తాలితే కనపడమన్నా కనపడతాడా వాడు' అని గద్దించింది.
అంతలోనే తోడబుట్టిన దాని దీనావస్తకి తల్లడిల్లతా, 'లెయ్యె పిచ్చితల్లీ...లేయ్యమ్మా' అంటూ నజీరత్త ఓడిపత్తి ఇంట్లోకి పిలచకెల్లింది.
లోపల నులకమంచం మీద తూరుపు తట్టు తల పెట్టించి పడుకోవేట్టున్నారు. షఫిగాడి శవాన్ని. తల పక్కన స్టీలు గ్లాసులో బియ్యం పోసి, అందులో గుప్పెడు సామ్రాణి కడ్డీలు గుచ్చున్నారు. ఇల్లంతా గంధపు పొగల వాసనతో నిండిపోయి ఉంది.
శవం చుట్టూ పెదత్త, బషీరత్త కూతుళ్ళూ, వాళ్ళ పిలకాయలూ మూగి కూచోనున్నారు. ఇరుగు పొరుగు ఆడోళ్ళు, దూరపు బంధువుల్లో ఒకరిద్దరూ టీ గ్లాసుల్ని పట్టుకొని తాగకుండా చూస్తా ఉన్నారు.
బయటి మొగోళ్ళు వచ్చినప్పుడల్లా కఫన్ తొలగించి కడ చూపులు చూపిస్తున్న షమీన్ ఆపా షషిగాడి మొఖాన్ని చూసే కొద్దీ ఇంకాస్త ఏడస్తానే ఉంది.
'చేతులారా నిన్ను పోగొట్టుకున్నాం గదరా నాయనా, ఇంకే బరోసాతో బతకపోయేదిరా తండ్రీ' అని తారస్తా ఉంది.
ఆమె వాడి కంటే ముందు నజీరత్తకు పుట్టింది. నజీరత్త తరవాత నజీరత్తయ్యి షషిగాణ్ణి చిన్నప్పట్నించి సాకి సంతరించింది. చేతుల్లో పెరిగి ఎదిగినోడు కాళ్ళ ముందటే కాటికి పోబోతా ఉన్నాడంటే ఆరాయించుకోలాకపోతా ఉంది.
'ఊరుకోమ్మే ఊరుకో. నువ్వే ఇట్టయిపోతే చిన్నదేమైపోవాలా? ధైర్యం పెట్టు, దేవుడి మీద బరోసా పెట్టి ముందా అమ్మిని లేపు' అంది.పెదత్త, సల్మా తట్టు చూపిస్తా.
పొద్దుటి నుంచి ఏడ్చీ ఏడ్చీసోషాచ్చిపడిపోయి ఉంది సల్మా. ఊపిరిపోయే ముందు 'సల్మా...సల్మా' అంటా చెల్లెల్ని కలవరించాడంట షఫిగాడు. ఊపిరి పోయాక వచ్చిన ఆ అమ్మికి ఆ సంగతి తెలిసిపోయింది. ఇంకంతే. స్వాధీనం తప్పిపోయింది.
షఫి...ఒర్... నీ కడమాటలు వినలేకపోతినే. నేనెంత కర్మురాలినే. ఏమి చెప్పాలనుకున్నావో గదరే' అని పలవరింతలు మొదలు పెట్టింది.
ఆరు నెలలు కిందట పెళ్లి చేసి పంపిన అన్న అంతలోనే శవమవుతాడని ఆ అమ్మి కలైనా కనున్డలేదు. ఏ అచ్చటకైనా ఏ ముచ్చటకైనా నేనున్నానంటూ వచ్చే అన్న ఇంకా లేడన్నమాట ఆ అమ్మి తలకెక్కడం లేదు. ఒకోసారి ప్రేలాపిస్తా ఉంది. ఒకోసారి శోషాచ్చి పడిపోతా ఉంది. ఇదంతా చూస్తే ముసలాయన అలివికాదని షఫివాళ్ళ నాయనని ఆయన స్నేహితులు ఇంట్లో ఉంచలేదు. నేరుగా తీసికెళ్ళి టీకొట్టు దెగ్గిర కూచోబెట్టుకున్నారు. ఆ మాటా ఈ మాటా చెప్తా ఆయన్ను మామూలు మనిషిని చేయడానికి అవస్థపడతా ఉన్నారు.
కాసేపటికి రిక్షాలో జనాజాని పెట్టుకొని వచ్చాడు బషీరత్త భర్త. రావడంతోనే దాన్ని కడిగే పనిని బయటున్న పిలకాయలకు ఒప్పజెప్పి ఇంట్లోకి వచ్చాడు.
'మోవ్! టైము మూడవతా ఉంది. అయిదు గంటల నమాజు లోపల శవాన్ని మసీదు కాడికి చేర్చాలి. అనేక కబరస్తాన్ కు మోయాలి. ఇప్పట్నించి మోదులుబెడితే కదా. చావు నీళ్ళకి సిద్దం చేసినారా' అన్నాడు.
ఆ మాటలకి సన్నగా ఏడుస్తున్న వాళ్ళంతా గొంతు పెంచేసినారు.
'అయ్యో నా బిడ్డా, నీ కప్పుడే వేళయిపోయిందా నాయనా' అని అరచేతులు చరస్తా ఏడ్చింది షమీన్ ఆపా.
పెదత్త లేచి బషీరత్త భర్తని పక్కకి తీసికెళ్ళింది.
'అప్పుడే ఏమి తొందర? కాసేపు తాలరాదా' అంది ఆయనతో.
'దేనికి' అన్నాడాయన.
'జీనత్ రాబళ్ళా? అక్క రాకుండా తమ్మున్ని మట్టెట్టజేస్తారు' అంది.
ఆయన నెట్టి కొట్టుకున్నాడు.
'సరే కానీయండి. నేను పోయి ఖబర్ సరిగ్గా తవ్వినారో లేదో చూసుకొని వస్తా' అని వెళ్ళిపోయినాడు.
టైము మూడున్నర నాలుగయ్యేటప్పటికి రావలసినోళ్ళంతా వచ్చేశారు. రామాయపట్నం బంధువులు, రాపూర్లో ఉండేవాళ్ళు అందరూ కడచూపులకు దిగబడ్డారు. ఇంకా జీనత్ దే ఆలస్యం.
నజీరత్త నడిమి కూతురు జీనత్, షమీన్ ఆపాకూ షఫిగాడికీ మధ్యన పుట్టిన్డది. బెజవాడలో ఇచ్చి వేశారా అమ్మిని. దాని మొగుడు ఐస్ ప్యాక్టరీలో పని చేస్తాడు.
పొద్దున్న తోమ్మిన్డింటికి షఫిగాడి ప్రాణాలు పొంగానే బెజవాడకు ఫోను చేసి, ప్యాక్టరీ వాళ్లకు చెప్పి, వెంటనే బయలుదేరమని కబురు చేశారు జీనత్ కు, చార్జీలకు డబ్బులు చూసుకొని ఎంత గబుక్కున బయలుదేరినా బెజవాడ నుంచి కావలి రావడానికి అయిదు గంటలు పడుతుంది. ఆ లెక్కన ఇప్పుడో ఇంకా సేపట్లోనో జీనత్ రాబోతా ఉందని అంతా చూస్తా ఉన్నారు.
'సింగరాయకొండ దగ్గిర ట్రాఫిక్ జాము లేదంటలే. వచ్చేస్తది' అంటా వచ్చినాడు బషీరత్త కొడుకు రియాజు, బజారు నుంచి తెచ్చిన పూలబుట్టను కిందకి దించతా.
ఆ బుట్టలో మల్లెపూలు కారబ్బంటి కలిపి అల్లిన పూలకఫన్ ఉంది. జనాజాలోకి ఎక్కించినాక శవం మీద అలంకరించాలి దాన్ని. పెళ్లి కుదిరితే పూల సెహెరా తోడుక్కోవాల్సిన వయసు షషిగాడిది. దానికి వదులుగా దీన్ని తోడుక్కోబోతా ఉన్నాడు.
ఆ కఫన్ చూసి, దగ్గిరపడుతున్న టైమును చూసి, వచ్చిన ఏడుపు దిగమింగుకుంటూ ;ఎందుకైనా మంచిది, ఎవరో ఒకరు బస్టాండ్ కాడికి పోయిరపొండ్రా' అంది పెదత్త. జీనత్ కోసం చూసిరావదానికని. ఆమె ఆ మాట అంటుండగానే వాకిట్లో రిక్షా ఆగింది.
'అదిగో వచ్చింది' అన్నారెవరో.
జీనత్ ని చూడగానే ఆడోళ్ళంతా గొల్లున ఎదుపండు కున్నారు. చెల్లెల్ని కావలించుకుందామని షమీమ్ ఆపా లేచి నిలబడింది.
'మాయ్ జీనత్. చూద్దూగానీ రా' అని ఎదురుపోయింది బషీరత్త.
దారిపొడుగునా ఎంత ఏడ్చుకుందో ఎన్నిమార్లు గుండెలు బాదుకుందో గాని తమ్ముడి శవాన్ని చూడగానే పసిపిల్లలా కిందబడి గిలగిలమని తన్నుకుంది జీనత్. గాజులు పగిలేలా తలబాదుకుంటా 'ఎంత పని చేశావురా షఫీ ' అని అల్లల్లాడిపోయింది.
కాసేపటికి స్తిమిటపడి, 'అసలేట్టా జరిగింది' అంది కళ్ళు తుడుచుకుంటా.
'టీబీ అంటమ్మా. ఆ నా కొడుకు ఎవురితోనూ చెప్పుకోలా. ఎవురికీ తెలీనీలా' అంది పెదత్త.
'ఏందో ఈక్ నెస్ వల్ల పొద్దస్తమానం దగ్గతా ఉన్నాల్లె అని మీ అమ్మ తాత్సారం చేసింది గాని ఇంత పని జరగద్దనుకోలా తల్లీ' అంది బషీరత్త.
ఆ మాటలు వినగానే జీనత్ దుఃఖం కడుపు మంటగా మారింది.
'ఈ నజీరమ్మ బుద్ధి నాశినంగానూ. ఈ మహాతల్లిని మట్టిలో పెట్టి కప్పెట్ట. బిడ్డలకొచ్చే రోగాలని మందులు తినిపించో మంచి చోట చూపించో నయం చేయించుకునే రాత ఈ తల్లికి ఆ దేవుడు రాయలేదు కదా. తెచ్చింది కడుపుకు మేక్కితే సరిపోతుందా? డాక్టర్లకు పెట్టబళ్ళా? ఆస్పత్రులకు తిప్పబళ్ళా? ఆ ఆకూ ఈ ఆకూ నమిలిచ్చి కాంపొండర్లు రాసిచ్చే మాతర్లు మింగిచ్చి పోయే ప్రాణాలని నిలబెట్టేయ్యాలనుకుంటే సాధ్యమా? అట్టా చెయ్యాలని చూసే ఈ మనిషికి పుట్టగతులుంటాయా ' అని శాపనార్ధాలు మొదలుపెట్టింది.
'అట్టా మాట్లాడబాకు మే జీనత్. రోగం బయటపడేటప్పటికే అంతా చేయి దాటిపోయింది. అప్పటికే చేయాల్సిందంతా చేశాం... దారబోయాల్సిన్దంతా దారబోశాం. పాపం మీ అమ్మ... కంటికి రెప్పలా నీ తమ్మున్ని చూసుకోనింది. రోగం కత ముందే తెలిసుంటే ప్రాణాలు అడ్డమేసుండేది కదా' అంది పెదత్త. జీనత్ తలతిప్పి నజీరత్త తట్టు చూసింది. కూతురికి మొకం చూపించలాక తలదిన్చేసుకుంది.
'ఏందీ... ఈ మనిషా? మా అమ్మ సంగతి నాకు చెప్పబాకండి. మా ఇంట్లో ఫుల్లు మందుచీటిని ఏనాడు తెనిచ్చిందనీ? పది రూపాయలకు ఎన్నోస్తే అన్నేనే, టెస్టులు బస్టులు చేయించి చస్తే గద' అంది జీనత్.
'టెస్టులు తేరకున్నాయెంటమ్మా. వేలకు వేలు లాగతా ఉన్నారు. వాటికి మోటుకోవడం మనబోటోళ్ళకుఅయ్యేపనేనా' అంది పెదత్త.
'అయితే మటుకు ఈ నజీరక్కది మరీ చోద్యం లేమ్మా. జబ్బు ముదిరినాక కూడా వాణ్ణి పట్టించుంటే గదా... వాడి ఒల్లును వాణ్ణి చూసుకోనిస్తే కదా. ఇంటికి రావడమే ఆలస్యం. దానిక్కావాలి దీనిక్కావాలి అని జేబులు పెరుక్కునేదే పనాయే. వాడు ఇల్లు చూసుకుంటడా? మందు చూసుకుంటడా' అంది బషీరత్త.
'నజీరంకు చెప్పలేదు కానీ నాకు నెల కిందే పక్కాగా తెలిసిపోయింది వాడికి టీబీ ఉందని. అప్పటికీ జెప్పా... రె షఫీ, ఎవురికీ చెప్పాల్సిన పనిలా. నేరుగా పోయి మదనపల్లి లో చేరిపో చేర్చేసుకుంటారు. రెండు నెలలు ఉన్నావంటే రోగం దారికోచ్చేస్తది. డబ్బులు ఎట్టోకట్ట చేద్దాం అని. వాడు వింటేగా. ఇంటి దెగ్గిర కష్టం లేరా అని మానేసినాడు' అన్నాడు రియాజు.
'మదనపల్లి దాకా ఎందకురా నాయనా. ఇట్టాంటి రోగానికి ఇంటికాడ కూచుంటే చాలదా. యాడ... ఈ మనిషి కూచోనిస్తే కదా. పనికి నాగా పెట్టి వాడు ఏ రోజు పొణుకున్నా ఎంటబడి ప్రాణాలు తీసినే. అంతెందుకు? జబ్బు ముదిరి ఈడిట్టా ఉంటే మందులూ మాకులూ అవతల పారేసి కనుమూరు దర్గాకి తీసకపోయిందంటే ఇంకేమి చెప్పేది? అక్కడ మూడు నిద్దర్లు చేసోచ్చినాక పూర్తిగా అడ్డం పడిపోయినాడు. పైకి లేవకుండా అట్టే పోయినాడు' అంది బషీరత్త.
'అదీ సంగతి. నాకు తెలుసు. మా అమ్మ గుండెలు తీసిన బొంటు. రోగాన ఉన్నానని నీడ పట్టున ఉంచక నెమ్ము రోజుల్లో కసుమూర్లకీ, రహమతాబాద్లకీ తిప్పుంటుంది. దెబ్బకు అయిపోయినాడు. లాకుంటే నాలోజులు బతికేవాడే' అంది జీనత్.
ఇందరు ఇన్ని మాటలు అంటా ఉన్నా నోరు తెరిచి ఒక్కమాట కూడా బదులు చెప్పలేదు నజీరత్త. తలదించుకునే కూచునింది. ఇంతలో బషీరత్త భర్త మళ్ళా వచ్చినాడు. ఈసారి ఆయనతో పాటు నలుగురు మసీదు మనుషులూ ఉన్నారు.
'టైమైంది. నీళ్ళు పొయ్యాలి మే' అన్నాడు.
ఆడోల్లంతా గబగబా లేచి పక్కకు జరిగారు. వచ్చిన నలుగురు మనుషుల్లో అటిద్దరు ఇటిద్దరు చెరి శవాన్ని దొడ్లోని చెక్కబల్ల మీద పొణుకోబెట్టారు. నీళ్ళు పోయ్యదాన్ని ఆడోళ్ళు చూడకుండా ఉండేందుకు దుప్పట్లని అడ్డం కట్టారు.
ఇదంతా చూసి షమీమ్ఆపా , జీనత్ లు శోకండాలు తీస్తుంటే నజీరత్త వడివడిగా బషీరత్త భర్తకాడికి వచ్చింది.
'ఏందీ' అన్నాడాయన నాజీరత్తను చూసి.
నాజీరత్త భయపడతా భయపడతా చెప్పింది.
'వాడికి మసలే మసలే నీళ్ళు పోసుకునే అలవాటు లేదు నాయనా. కాస్త గోరువెచ్చటి నీళ్ళు బోయండి' అంది వేడుకుంటున్నట్లుగా.
బషీరత్త భర్త కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
'అట్నే' అన్నాడు.
రేగాకులు కలిపినా వేడినీళ్ళతో రివాజు ప్రకారం స్నానం చేయిస్తున్నారు. షఫిగాడికి. కోయ్యబల్ల మీద ఎందుకుపోయిన వాడి ఒంటిని చూస్తుంటే అక్కడున్నోల్లెవరికీ ఏడుపు ఆగడంలా. చెంబుతో నీళ్ళు కుమ్మరించినప్పుడల్లా చాతీ మీద కదులుతున్న తావీజులాగా వాడు కూడా లేచి కూచుంటే బాగుండనిపిస్తోంది వాణ్ణి చూస్తోంటే.
'వీళ్ళ నాయాన్ని పిలవండి. ఆయనోచ్చి చెంబెడు నీళ్ళు పోయాలి. అన్నాడు బషీరత్త భర్త.
అప్పటికే నజీరత్త భర్త పిచ్చోడాల ఈదంతా కలతిరుగుతున్నాడు. ఈ.... అని పళ్ళు బిగబట్టి పిచ్చి ఏడుపు ఏడుస్తున్నాడు. నీళ్ళు బోయదన్నికి 'రాను రాను' అన్నాతుఉగా ఆయన చేతులు అడ్డంగా ఊపుతుంటే, రియాజు వెళ్ళి నడుము మీద చెయ్యేసి పట్టుకొని దొడ్లోకి తీసుకొచ్చాడు.
నీళ్ళు ముంచిచ్చిన చేబును పట్టుకొని, ముందుకొచ్చి షఫిగాడి శవాన్ని చూడగానే ఠాప్పున కిందకోదిలేసి, 'రె షఫి... ఎత్టారా మేం బతకబోయేది' అని కూలబడిపోయాడాయన. వెంటనే బయటికి తీసుకోచ్చేసినా సంబాలించుకోవడం ఆయన వాళ్ళ కావడమా, శరీరం వణికిపోతా ఉంది.
ఒకప్పుడు ఈ పక్క కుటుంబాల్లో గాని ఆ పక్క కుటుంబాల్లో గాని అందరి కంటే దయిర్యస్తుడిగా ఉండిఎవరికీ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆదుకున్నమనిషాయన. అందరి ఆస్థులు కరిగిపోయినాక కూడా ఆయన చేతిలో అయిదెకరాల భూమి ఉండేది. పడకండపాడు నుంచి కావలికి వ్యాపారం మార్చినా యవసాయం ఒదుల్కొకుండా మహారాజల్లె బతకతా ఉండేవాడు.
ఒక తడవ ఏం కరువోచ్చిందో ఏమోగానీ ఆయనేసిన పొగాకు సరిగా పడాలా. ఆకు ఎదగాలా. మోచేయ్యంత పోడుగుందే కాదె చివరికి దక్కింది. దాన్ని బోర్డు కొనాలా. ఒక్క యాపారస్తుడు వాసన చూళ్ళా. ఆడ పడింది దెబ్బ. ఇంకాన్నుంచి తేరుకోలేక పోయినాడు. యవసాయమ్లో అప్పులకి షమీమ్ జీనత్ ల పెళ్ళిళ్ళకి పొలం ఖర్చయి పోయి షఫిగాడు ఎదిగొచ్చేటప్పటికి పూర్తిగా దివాలా తీశాడు. ఒంట్లో సత్త్వ లేని ఇంకో పని చేతగాని ఆ మనిషిని చూసి పద్నాలుగేళ్ళకే పనిలో పడ్డాడు షఫిగాడు.
అప్పట్నించి కుటుంబానికి వాడే పెద్ద దిక్కు.
వాడు తెస్తేనే తినడం. లాకుంటే గమ్మున పొణుకోవడం. అట్టా గమ్మున పడుకోపెట్టలేక చిన్నోడైనా పెద్ద పనులెన్నో నేర్చినాడు షఫిగాడు. చెప్పుల షాపులో గుమాస్తాగా చెరి అందులో మెలకువలన్నీ నేర్చుకొని వచ్చే ఆదాయం చూసి ఉద్యోగం మానేసినాడు. ఇరవైవేల చీటీ పాడి, బెజవాడ నుంచి స్టాకు తెచ్చి పల్లెలకి వేయడం మొదలు పెట్టినాడు. అందులో ఆదాయం కనిపించాక ఊర్లు తిరగడం ఎక్కువ చేసినాడు. అట్టా తిరిగీ తిరిగీ కావలి చుట్టుపక్కల ఊళ్లలో 'చెప్పుల షఫి' గా పేరు తెచ్చుకున్నాడు గాని దానితో పాటు టీబీని కూడా తెచ్చుకున్నాడు.
అయితే బయటికి చెప్పాలా. కూడబెట్టిన నాలుగు డబ్బులతో పని మానేసి కొన్నాళ్ళలో కుదురుకుందామనుకున్నాడుగాని ఇంతలో సల్మా పెళ్లి కుదిరింది.
'నాయన్నాయనా....పిల్ల పెళ్లి కాస్త జరిపిస్తే' అంటా వాడి వెంట పడింది నజీరత్త.
మంచి సంబంధం.వాయిదా వేయలేని బాధ్యత. రంగంలోకి దూకినాడు షఫి. కట్నం కోసం కానుకల కోసం ఆడదేచ్చి ఈదదేచ్చి పల్లెల నుంచి వసూళ్లు చేసి యాభై వేల చీటి పాడి ఆ పని కూడా పూర్తి చేశాడు. పెళ్ళయితే జరిగిపోయింది గాని ఆ గొడవలో వాడి ఒళ్లు పూర్తిగా దెబ్బతినిపోయింది. ఒక తట్టు ఇంటి జరుగుబాటుకీ మాతో తట్టు పెళ్లి అప్పులకీ ఇంకా తిరుగుళ్ళు పెంచినాడు. ఒకోసారి తిరగలేక జ్వరం కాసి ఎప్పుడైనా పనికి పోకుండా పొణుకుంటే వాడి వెంటబడి నజీరత్త తరమతా ఉండేది.
'ఆ అప్పులు కాస్తా తీరిపోనీ నాయనా. మళ్ళా నువ్వు హాయిగా నిద్రపోదూగానీ' అని బతిమిలాడేది.
ఆమె కోరుకున్నట్లే ఆ అప్పులు తీరిపోయినాయి. వాడు హాయిగా పడి నిద్రపోయినాడు, మళ్ళా లేవకుండా.
చావు నీళ్ళు పోయడం పూర్తయింది. శవాన్ని లోపలి తీసుకొచ్చి ఈతాకు చాపమీద పడుకోబెట్టారు.
జనాజాలోకి ఎక్కించే ముందు కళ్ళకు సురమా రాసి, పక్కలో కర్పూరం పొడి రుద్ది, పైన అత్తరు పూసి, గులాబ్ నీళ్ళు చల్లి ముస్తాబు చేస్తుంటే ఏడుపుమొదలెట్టారు ఆడోల్లంతా.
'పెళ్లికొడుకాల తయారవతా ఉన్నావా నాయనా, ఖబరస్తాన్ పోబోతా ఉన్నావా తండ్రీ' పెదత్త ఏడస్తా ఉంటే అందరి ఏడుపూ కలగలిసింది.
ఆ గోలకి తాళలేక 'ఆపండి మే' అని గావుకేక వేసి అందర్ని కంట్లోలు చేసినాడు బషీరత్త భర్త.
'ఇప్పుడేడిస్తే వచ్చేదుందా? లేచేదుందా ?జరగన్దట్టా' అని నజీరత్తని దగ్గరకి పిలిచినాడు.
ఆమె కదలకపోయేసరికి లాక్కోనొచ్చిశవం కాడ నిలబెట్టినాడు.
'కానిమ్మా' అన్నాడు ఒక మసీదు మనిషి.
నజీరత్త ఎతిమతంగా చూసింది అర్ధం గాక.
'అట్టా చూస్తావేడంమా. గబాల్నగాని. నీ బిడ్డకి బాలబిక్ష పెట్టాలి గదా' అన్నాడు.
ఆ మాట వినేసరికి ఆమె చేయాల్సిన పని గుర్తోచ్చేసరికి .... అప్పుడు ఏడ్చింది నజీరత్త. ఒళ్ళంతా నీలుక్కుపోతా ఉంటే పిట్టంత మనిషి నిలువెల్లా వణికిపోతా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులోనే తల అడ్డంగా ఊపతా 'పెట్టలేను నాయనా పెట్టలేను' అంది.
అందరూ బిత్తరపోయారు. ఏడుపు ఆపేసి నజీరత్త తట్టు వెర్రిగా చూశారు.
'సాల్లేగానీ ఆపు మే. పాలబిక్ష పెట్టానంటే ఎట్టా కుదరద్దీ? తొరగా పెట్టు.అవతల టయిమవతా ఉంది' అంది పెదత్త.
'నువ్వు పెట్టకుంటే నీ కొడుక్కి పైలోకంలో మోక్షం లేదే ముండదానా' బషీరత్త తిట్టింది.
'కానీ మా. ఈ టైములో హటం చేస్తారా ఎవురైనా' అంది షమీమ్ ఆపా నజీరత్తని సముదాయిస్తా.
అందరి మాటలకి తల అడ్డంగా ఊపుతుందే గాని నజీరత్తకదలడంలా. ఆమె వాటం చూసి అందరూ చేష్టలు మాని నిలబడిపోయారు. ఎందుకంటే, ఆమె పాలబభిక్ష పెట్టకుంటే శవాన్ని ఎత్తేదానికి లా. మట్టి చేసేదానికి లా....
తొంభై తొమ్మిది రక్తపుచుక్కలు కలిస్తే ఒక పాల చుక్క అవద్దనీ అట్టాంటి పాలచుక్కలెన్నిట్నో కుడిపి బిడ్డల్ని పెద్ద చేస్తుంది గనక ఆ తల్లి ఋణం ఆ బిడ్డ ఎన్నటికీ తీర్చుకోలేడని చెప్పే ధర్మంలో షఫిగాడు పుట్టాడు. అందుకని వాడు నజీరత్తకి ఋణపడి ఉన్నాడు. సచ్చినా బతికినా ఆ ఋణం నుంచి బయటపడడం వాడి చేతుల్లో లేదు. నజీరత్త చేతుల్లో ఉండి. ఆమె పెట్టబోయే దూద్ బఖష్ లో ఉంది.
ఆమెకి ఆమె ముందుకొచ్చి 'నాయనా...నేను నీకు పాలు కుదిపే పెద్దవాణ్ణి చేశాను. నువ్వు నా పాలు తాగి ఋణపడి ఉన్నావు. నా ధర్మాన నేను పోకమున్దరే నీ కర్మాన నువ్వు పోయినావు గనక ఇదిగో ఈ నలుగురు మనుషుల ఎదట నేను నా మనసు నిండుగా నీకు పాలభిక్ష పెడతా ఉన్నా. నా పాలు తాగిన ఋణం ఇయ్యాలితో చెల్లిపోతా ఉంది' అని చెప్పాలి.
అలా చెబితేనే వాడికి పైలోకాల్లో ముక్తి, శాంతి.
బతికుండగా కొట్టినా తిట్టినా కూడు పెట్టకుండా మలమలమని మాడ్చినా ప్రాణాలు పోయిన కొడుకును చూసి ఏ తల్లయినా పాలభిక్ష పెట్టేస్తుంది పెట్టేయ్యాలి కూడా. అందరికీ అలా పెట్టేయ్యడమే తెలుసు. నజీరత్తలాగా అడ్డం తిరుక్కున్నోళ్ళనీ ఎవరూ చూళ్ళా. అందుకని ఎవరికీ ఏమీ పాలుబోవట్లా.
కొడుకు శవాన్ని పట్టుకొని తడిమి తడిమి ఏడుస్తున్న నజీరత్తని అందరూ బతిమాలగలుగుతున్నారేగాని ఎవరూ బెదిరించలేకపోతా ఉన్నారు.
'ఎమ్మే ఇంకనైనా వింటావా వినవా' అని చూసింది పెదత్త.
ఇంకా లాభం లేదనుకుని 'రె అబయా. పోయి వాల్లాయాన్ని పిలచకరా పో. ఆ మనిషి మాట తప్పితే ఇంకెవరి మాటా వినదిది' అందామె రియాజుతో.
అప్పటికే ఆ సంగతి బయటికి తెలిసినట్టుంది. నజీరత్త భర్తే లోపలి కొచ్చేసాడు. ఆయన్ని చూడ్డంతోటే గబాల్న వచ్చి వాటేసుకుంది నజీరత్త.
'చూడయా. నేను అన్యాయమైపోయానయా, దిక్కులేని దాన్నాయి పోయానయా. చేతులారా నా బిడ్డను చంపుకున్నానయా' అంటా విలవిలలాడింది.
ఆమె ఏడుపు చూసి ఆయన కూడా ఏడ్చేసినాడు.
'ఊరుకోమ్మే ఊరుకో. ముందే తెలిస్తే ఇట్టా జరగనిచ్చుండేవాళ్ళమా. ఇప్పుడనుకొని ఏమి లాభం. జరగాల్సిన పని చూడు. మన బిడ్డకి పాలభిక్ష పెట్టేయ్' అన్నాడు మన్నించయా' అని ఏడ్చింది.
'ఎందుకని మే' అన్నాడాయన అనునయిస్తా.
'నాకు తెలుసయా. నా బిడ్డకి టీబీ ఉందని ముందే తెలుసు. ఏం చేసేది చెప్పు. ఒళ్ళు బాగాలేదు మా. మదనపల్లికి పోయి రెండు నెలలు ఉండేసొస్తాను మా నై నా బిడ్డ బతిమిలాడుకుంటే నువ్వు లేకుంటే ఇల్లు నడవదు నాయనా అప్పులోల్లు మమ్మల్ని బతకనీయారు నాయనా అని కాళ్ళు కట్టేసిన పాపిష్టి దాన్ని. ఇయ్యాల ఈళ్ళు ఇన్నేసి మాటలు అంటున్నారే, ఒక్కరైనా నా కూతురి పెళ్ళికి సాయం చేసినారా? రె షఫి ఇదుంచు అని నయాపైస అయినా వాడి చేతిలో పెట్టినారా? వాడు లాకుంటే నిన్నూ నన్నూ తీసుకెళ్ళి రెండు దినాలు ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టె గతి ఈల్లలో ఎవురికైనా ఉందా? మందులకు గతిలాక ఆపరేషన్ లకు డబ్బులాక కడకు ఆ దేవుడే దిక్కు అని దర్గాల మీద భారం వేశాను గాని నా బిడ్డను చంపుకునేదానికి కాదయా. పదారేళ్ల పిల్లోడప్పటి కాన్నించి వాడి రెక్కల కష్టం తిని వాడి రక్తం తాగి వాడి ఎముకలు జుర్రి వాడి ప్రాణాలనే కాజేసిన నేను వాడి కడుపునా వెయ్యిసార్లు పుట్టినా తీర్చుకోలేనంత ఋణపడిపోయి ఉంటే వాడు నాకు ఋణపడి ఉండటం ఏందయా. ఇదేమి లెక్కయా' అని నజీరత్త కన్నీళ్ళలో తడిసి పోతా ఉంటే ఆ దుఃఖం తీరేదేట్ట? శవం కదిలేదెట్టా?
ఇండియా టుడే ప్రత్యెక సాహిత్య సంచిక 2000
మరాఠీలో అనువదితం 2005
హిందీలో అనువదితం 2010
a mother debt. muse india 2010