పిల్లలకు ఏం కావలి?
అని అడిగే కన్నా అసలు పెద్దలకు ఏమి కావాలి? అని తెలుసుకుంటే పిల్లలకు - పెద్దలకు గల ప్రాముఖ్యాలలో వత్యాసం ఏమిటో తెలుస్తుంది.
పెద్దలకు సంతోషం కావాలి. |
పిల్లలకు ఆనందం కావాలి. |
పెద్దలకు సౌఖ్యాలు కావాలి. |
పిల్లలకు ఆప్యాయత కావాలి. |
పెద్దలకు పేరు ప్రఖ్యాతులు కావాలి. |
పిల్లలకు స్వీయ వ్యక్తీకరణ కావాలి. |
పెద్దలకు డబ్బు కావాలి. |
పిల్లలకు సమయం కావాలి. |
పెద్దలకు బిజీగా ఉండడం ఇష్టం. |
పిల్లలకు క్రేజీగా ఉండడం ఇష్టం. |
పెద్దలకు పరువు కావాలి. |
పిల్లలకు ప్రేమ కావాలి. |
పెద్దలకు పరుగు కావాలి. |
పిల్లలకు బ్రేకు కావాలి. |
మీరు పిల్లలకు చాలినంత సమయం ఇష్తున్నారో లేదో మీకే తెలిసిపోతుంది. మీకు ఒక రకమైన అపరాధ భావన వస్తుందంటే , ఖచ్చితంగా మీరు ఎక్కడో ఇచ్చిన మాటను మరిచారు లేదా మీ పాత్రకు తగు న్యాయం చేయడం లేదనే భావన మిమ్మల్ని వెంటాడుతుండవచ్చు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి సమయం ఇవ్వలేకపోతే కనీసం ముగ్గురు నష్టపోతారు. ఒకరు మీ పాప/బాబు , రెండవది మీరు, మూడవది మీ భాగస్వామి. ఎందుకంటే గిల్టీఫీలింగ్ తో బాధపడుతున్నవారు మంచి భర్త/భార్య ఎలా అవ్వగలరు.
మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగిన అతి విలువైన కానుక ఆనందమైన తండ్రిని/తల్లిని మీ పిల్లలకు అందించడం. మరి మీరు ఆనందంగా ఉండాలంటే మీరు చేయవలసిందల్లా, ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో 100 శాతం ఉండడం. ముందుగా మన తత్త్వం మారనిదే మీరు ఎంత సమయం పిల్లలతో గడిపినా మీరు వారి అందుబాటులోకి రాలేరు. తనకుతానే దొరకని వ్యక్తి ఇంకెవరికి దొరుకుతారు?
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, వారికి తల్లి ప్రేమ, తండ్రి సాన్నిహిత్యం కావలసి ఉన్నప్పుడు, వారికి తల్లిని/తండ్రిని దూరం చేసే హక్కు పెద్దలకు లేదు. మీరు తల్లి అయినా, తండ్రి అయినా మీ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేస్తున్నారనేది ఎవరికీ వారు 'ఆత్మపరిశీలన' చేసుకోవాలి.
మీ జీవితం సమతుల్యం ఉందో లేదో తెలియడానికి మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల పేర్లు రాసుకోండి లేదా మనసులో అనుకోండి. మీ పిల్లలు తండ్రిగా/తల్లిగా మీకు 1 నుండి 10 మార్కులు ఇవ్వవలసి వస్తే,(ఒకటి అంటే చాలా తక్కువ పది అంటే చాలా ఎక్కువ) వారు మీకు ఎన్ని మార్కులు వేస్తారో వారినే అడిగి తెలుసుకోండి. చెప్పడానికి మొహమాటపడితే మీరే ఊహించి రాసుకోండి. మీ మనస్సు అబద్దం చెప్పదు. అలాగే మీ ఇతర పాత్రలలో కూడా మార్కులు వేసుకోండి. మీరు తండ్రి అయితే మీ ఇతర పాత్రలు భర్త, కొడుకు, వృత్తి, సోదరుడు, స్నేహితుడు ఇలా ఉంటాయి కదా! అదే తల్లి అయితే భార్య, కూతురు, సోదరి, స్నేహితురాలు, వృత్తి, ఇలా ఉంటాయి. మీరు మీకు ఏ ముఖ్యమైన పాత్రను నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభావం మీ ఇతర పాత్రల మీద ప్రభావం చూపిస్తుంది.
ఉదాహరణకు భర్తకు తన వృత్తిలో సమస్యలు, సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు, వాటిని సవ్యంగా ఎదుర్కోలేకపోతున్నప్పుడు, ఇంటికి వచ్చినా వాటికి సంబంధించిన ఆలోచనలే వెంటాడుతాయి. మనిషి ఒక సమస్యను పరిష్కరించగలిగితే దానిగురించి ఆందోళన చెందనవసరం లేదు. పరిష్కరించ లేకపోయినా దాని గురించిన ఆందోళన అవసరం లేదు. మనిషి తనకు మించిన భారం తలపై పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఇతరులపై విశ్వాసం లేకపోవడ౦. ఒకవేళ ఈ పని నేను ఎవరికైనా అప్పచెప్పితే వారు సరిగా చేయలేరన్నది వీరు చెప్పే ఒక సాకు అయితే అసలు విషయం ఆ పనులు చేసి "ఎంతో బిజీ" గా ఉండకపోతే తన జీవితం వృధా అయిపోతుందేమో అనే దిగులు అసలు కారణం. ఈ రోజు "బిజీగా" ఉండడం అన్నది ఒక స్టేటస్ సింబల్. క్షణం తీరికలేకపోతే అతనో విజయవంతమైన వ్యక్తి. బైపాస్ సర్జరీ కూడా ఒక స్టాటస్ సింబలే అట.
మనిషికి ఉన్న అతి పెద్ద భయం, తన "ఐడెంటిటీ" ని కోల్పోతానన్న భయం. ఒక డాక్టర్ స్నేహితుని దగ్గరకు తమ పాపకు జ్వరం వచ్చిందని తీసుకువచ్చారు. ఆయన మందులిచ్చి పాపకు విశ్రాంతి ఇవ్వవలసిందిగా చెప్పారు. నాలుగురోజుల తరువాత జ్వరం తగ్గలేదని మళ్ళీ వచ్చారు. దానికి ఆయన 'పాపకు విశ్రాంతి ఇచ్చారా' అని అడగ్గా 'లేదండి పాప స్కూలుకు వెళ్తూనే ఉంది' అన్నారట. "ఎందుకు పంపిస్తున్నారు? ఒక నాలుగు రోజులు స్కూలుకు వెళ్ళకపోతే వచ్చే నష్టం కన్నా పాప ఆరోగ్యం ముఖ్యం కాదా?" అన్నప్పుడు, ఆ తల్లి తండ్రులు " మేము బలవంతంగా స్కూలుకు పంపించట్లేదండి, మా పాపే నేను స్కూలుకు వెళ్తానని పట్టుపట్టి వెళ్తుందండి" అన్నారు. ఎందుకంటే వాళ్ళ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి "క్లాసు ఫస్ట్ " బ్యాడ్జ్ తగిలిస్తారట. ఒకవేళ ఈ పాపకు మార్కులు తగ్గి మరొకరికి ఎక్కువ వస్తే ఈ బ్యాడ్జ్ వారికి మార్చబడుతుందట. ఇప్పుడు ఈ పాప ఎట్టి పరిస్తితిలోనూ ఆ బ్యాడ్జ్ వదులుకోవడానికి సిద్దంగా లేదు. మరి ఆ పాప చదువు విజ్ఞానం కోసం చదువుతుందంటారా? లేదా తాను అందరిలో 'గొప్ప' అనిపించుకోవడానికి చదువుతుందా అన్నది పెద్దలుగా మనకు అర్ధం అవుతూనే ఉంది. స్కూలులో ఆ పాప "బ్యాడ్జ్" కోసం ఎంత తపన పడుతుందో చూస్తే ఆ బ్యాడ్జ్ కి ఎంత బానిస అయిందో కూడా కనపడుతుంది. ఇక ఆ అభద్రతా భావం నుండి వచ్చిన జ్వరం ఎక్కడ తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది? ఆ పాపకు అర్ధం అవకపోతే అర్ధం ఉంది గానీ, పెద్దలకు కూడా అర్ధంకాకపోవడమే విషాదం.
ఈ రోజు పెద్దలు కూడా ఇతరులు ఇచ్చే "గుర్తింపు" కోసం, తన స్థానాన్ని కోల్పోకుండా ఉండడం కోసం, 'మంచి వ్యక్తి', అనిపించుకోవడం కోసం వెల కట్టలేని ఎన్నిటిని కోల్పోతున్నారో ఈ ఉదంతం మనకు కనువిప్పు కలుగ చేస్తుంది. మనిషి తన మనస్సాక్షిని బట్టి కాక బయటి దొరికే ఉపశమనం కోసం పరిగెట్టినంత కాలం మనిషికి మనశ్శాంతి అన్నది అందని ద్రాక్షే అవుతుంది. మరణించిన చేప మాత్రమే నీటి వాలుతో పోతుంది. అందరూ చేసేదే సరైనది అయితే ఈ రోజు ఇన్ని మానసిక సమస్యలెందుకు? ఇంత అశాంతి ఎందుకు? అన్నీ ఉన్నా తెలియని లోటేందుకు? మనిషి ముందు గృహోన్ముఖం కావాలి. తనకు తాను అందుబాటులోకి రావాలి. తనపై తనకు సదభిప్రాయం రావాలి.
ఎవరైనా తన దగ్గర ఉన్నది మాత్రమే ఎవ్వరికైనా ఇవ్వగలుగుతారు. తన వద్ద లేనిది ఇవ్వలేరు. పిల్లలకు ప్రేమ ఇవ్వాలంటే అది ముందుగా మీకు దొరకాలి. మీరు ప్రేమ తత్వులై ఉండాలి. అలా కాకుండా బలవంతంగా కొంత సమయం, ఇది పిల్లల కోసం అని మీరు వారితో గడపాలని ప్రయత్నించిన, తనువు ఒక చోట మనసొక చోట అన్నట్టుగా "సెల్ ఫోను" స్విచ్ కట్టేసినా కూడా మనసనే ఫోను మోగుతూనే ఉంటుంది. అప్పుడు పిల్లలు, నాతో ఉండే కన్నా మీ పనులు చూసుకోవడం ఉత్తమం అనే భావనకు వచ్చేయవచ్చు. తమకు తల్లి దండ్రుల వద్ద దొరకని పూర్తి అటెన్షన్, కేరింగ్ మరొకరినుండి దొరికితే గుర్తింపు లేని పార్టి నుండి ఆకర్షణీయంగా, ఆశావహంగా ఉండే పార్టికి మారినట్టుగా ఖాతా మార్చేయవచ్చు.
మీ లక్ష్యాలను కానీ మీ వృత్తిని కానీ నిర్లక్ష్యం చేయమని మేము (నా లాంటి రచయితలు) ఏనాడూ చెప్పము. అసలు సంపాదనే లేక ఇంట్లో కూర్చున్నవారికి విలువలేదని ఆదిశంకరులే సెలవిచ్చారు. బిల్ గేట్స్ ఒక మాట అంటారు "ప్రతిభ లేని వాళ్ళే "లైఫ్ బాలెన్స్" గురించి మాట్లాడతారు" అని. ప్రతి రోజూ, ప్రతీ వారం ఒక పద్దతిగా అన్ని పాత్రలూ సమపాళ్ళలో పోషించడం ఒక్క పుస్తకాల్లోనే సాధ్యం అవుతుంది. తన ధర్మాన్ని నిర్వర్తించడానికి కొన్ని సార్లు వృత్తి ధర్మాన్ని త్యాగం చెయ్యాలి, కొన్ని సార్లు కుటుంబ ధర్మాన్ని త్యాగం చెయ్యాలి.
నేను ఒక పుస్తకం రాసే సమయంలో ఇంటి వద్ద ఉన్నా ఎవరికీ దొరకను. కానీ మధ్యలో విరామం తీసుకుంటే ఆ సమయంలో పిల్లలతో ఆడితే 'నేను' ఉండను. ఒక పిల్లవాడు మాత్రమే ఉంటాడు. ఒక్కొక్కసారి ఏకాగ్రత కోసం వేరే ప్రాంతం వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడు ఫోనులో కూడా పెద్దగా సంభాషించను. ఆ సమయంలో నాలో తాత్వికుడు మాత్రమే ఉంటాడు. అనవసర సంభాషణలు, ఫోన్ కాల్స్ ఉండవు. ఒకవేళ ఇంటినుండి ఫోను వస్తే కొద్ది నిముషాలు మాట్లాడినా మనస్సుతో మాట్లాడతాను. కుటుంబ సభ్యల మద్దతు లేకుండా మనస్సు పెట్టి చేసే ఏ పనైనా ముందుకు వెళ్లడం కష్టం.
ప్రతిక్షణం కూడా ఉండకుండా,
అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటమే
ఒక తల్లి పోషించగల ఒక ఉత్తమ పాత్ర.
నీ వయసు రాయలేదు. చిన్నవాడి వైతే అనునయించవచ్చు. పెద్దవాడివయితే మాత్రం బాద్యత నీదే అని తెలుసుకో. పేదరికం అంటే తిండి, డబ్బు, ప్రేమలేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకు అవసరమైన, ఇష్టమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే నిజమైన పేదరికమట. మరి ఎన్నడు లేనన్ని చదువుకొనే అవకాశాలు, సమాచారం తెలుసుకునే అవకాశాలు నీకు ఉన్నాయి. నీలాంటి వారు కొన్ని కోట్ల మంది ఉండి ఉంటారు. వారిలో ఎంతమందికి ఇంటర్నెట్ అందుబాటు లో ఉంది? ప్రతి జన్మకు ఒక ప్రయోజనం ఉంటుంది.నాకు ప్రేమ ఇచ్చే వారు లేరని బాధ పడే కంటే, నీకంటే చిన్న వాళ్ళకు నీ ప్రేమ అవసరమేమో ఆలోచించు. అసలు నీలో ఎందరి ప్రేమనో పొందే ప్రతిభ ఉందేమో శోధించు. పేరెంట్స్ లేక పోవడం వలన నీకు ప్రయోజనం ఉంది అనేవైపునుండి ఆలోచింఛి చూడు. ఉదాహరణకు మార్కులు తక్కువ వచ్చాయని అడిగేవారు లేరు. ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏపని చేయాలి? ఎవర్ని చేసుకోవాలి వంటి విషయాలలో పూర్తి స్వేఛ్చ. కుటుంబాన్ని పోషించాలనే బర్డెన్ లేదు. వంశ పారంపరగా వచ్చే నిబందనలు, నమ్మకాలనుండి స్వేఛ్చ. తల్లి తండ్రులు అంటే జన్మ నిచ్చిన వాళ్ళే కాదు. ప్రేమ చూపించిన ప్రతి వ్యక్తి తల్లితో సమానం. బాద్యత కల ప్రతి వ్యక్తి తండ్రితో సమానం. ఆ మాటకొస్తే అమెరికా వంటి దేశాలలో సొంత తల్లి తండ్రులు అందరికీ దొరకరు. పెంచిన వారే ఎక్కువ ఉంటారు. దివంగత ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ కుడా అలా పెరిగినవాడే. ఆకలికి ఇస్కాన్ దేవాలయంలో ప్రసాదం తిని బ్రతికాడు. అందువల్ల నీకు ఏది లేదో దాని గురించి బాధ పడే కన్నా నీకు ఉన్న ఆస్థుల ( చదువు, తెలివితేటలు, ఆరోగ్య కరమైన శరీరం) గురించి ఆలోచించు ఈ భూమి మీద మనిషిగా పుట్టావు కనుక ఆలోచించగలుగుతున్నావు. నీ ప్రశ్నలను సరైన దిశగా సంధించు. సమాధానాలు దొరుకుతాయి. నేను రాసిన పుస్తకాలు కావాలంటే మెయిల్ చేస్తే పంపిస్తాను. హైదరాబాద్ లో ఉంటే రామకృష్ణా మటంలో వివేకానంద పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఒక్క విషయం గుర్తుంచుకో. ఎన్నడు నీ మీద జాలి పడకు, ఏ పరిస్తితీ శాశ్వతం కాదు. ఏమి లేదని కాకుండా, ఏమి కావాలో ఆలోచించు. లభిస్తుంది. తదాస్తు.
adigae valani sampadinchukovadame jivitham sir.
bhagundi sir meru chyppindi. . . pillalu unna parents ela undalo chypparu........... parents leni pillalaku meru em salaha estharu......... prathi okkaru ela bhathakalo chyputhunnaru kani enduku bhathakali ani evaru chyppatam ledu samajam lo manchithaanam anty chathagani thanam anttunar. . . . . ontariga puttatam, pedarikam lo puttadam mem chysina thappa......... thinnav ani adigey varu undaru,aakaliga undi anty annam prty varu undaru..... mari enduku sir manishi ki e jivitham.....