ఎవరైనా ఒక చిన్న విజయం సాధించి, దాన్ని జీవితంలో ఎంతవరకు నిలబెట్టుకోగలరన్నది ..దానివలన వారు ఎంత ఆనందంగా, ఆడంబరంగా జీవించగలరన్నది ఆ వ్యక్తి మరియు వారి కుటుంబసభ్యులపై ఆధారపడి ఉంటుంది..కానీ వీటన్నిటికంటే ముందు అతని విజయాన్ని విషంగా మార్చే మనుషులు ..ఆ మనిషి మనుగడనే కష్టతరం చేసే మనుషులు అతనికి వలలా అల్లుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం ....ఒకోసారి ఆ వల రాక్షస సాలగూడు కంటే భయంకరమైనదిగా ఎందుకు మారుతుంది..అనే ప్రశ్నకు శ్రీధర్ తన ఆలోచనా విశ్లేషణతో మనిషిలోని మనసుకి ఓ నా మా లు దిద్దించాలన్న ఆశతో ...విజయం అందుకున్నవారు కానీ, విజయాన్ని మెచ్చుకునే వారు కానీ ఒకింత నిబద్దత అలవర్చుకుంటే బాగుండన్న పేరాశతో. నల్లమోతు శ్రీధర్,( ఎడిటర్, కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్) సంధించిన అస్త్రమే 1. విజయాలే ఎక్కువ కాటేస్తాయి
సమాజాన్ని గౌరవించని మనిషిగా..సమాజంలో గౌరవం పొందని వ్యక్తిగా ఉండాలని ఎవరూ అనుకోరు.. మనకు ఎదురు పడే ఎందఱో మహానుభావులు...అందులో కొందరు ఎంతో మేధోసంపత్తి కలిగినవారు, ఇంకొందరు అద్బుతమైన ఆలోచనలు కలిగినవారు తారసపడుతూనే ఉంటారు వారిని చూసి అబ్బురపడకుండా ఉండలేము కానీ ప్రతీ మనిషిలో ఉండే ఒక చీకటికోణం ( కొన్ని అలవాట్లు లేదా సంకుచిత మనస్తత్వం, చమత్కరిస్తున్నామంటూనే ఎదుటివారి మనసుని మాటలతో గాయపరుస్తూ ) వారిలో కూడా కనిపిస్తే ఆకాశమంత అబ్బురం గడ్డిపోచలా మారిపోతుంది...మనిషి వేసే ఈ చిన్న చిన్న తప్పతడుగులపై నల్లమోతు శ్రీధర్..అద్బుతమైన విశ్లేషణలు ఈ ఆర్టికల్స్ .... 2.ఆరాలూ, సమాధానాలే జీవితమా..? 3.ఇంతేనా మనం..? 4.ఇక్కడ మనుషుల్ని ద్వేషించవచ్చు..
ప్రతీ వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఒకచోట మారలనుకుంటారు ..మారడం అనగానే చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తన కలిగి ఉండాలనుకోవడం కాదు....ఒక జీవన విధానం నుండి గాని ఒక అలవాటు నుండి గాని ఒక వృత్తి నుండి గాని ఏదైనా గాని మార్పుని ఆహ్వానించాలనుకోవడం సులువైనదే కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనకు తెలియని మరొక కోణం మన ముందు నిలబడుతుంది అదే మన మనసు.. మార్పుని తప్పనిసరిగా ఆచరించాల్సి వస్తే ...మనం మారడం కోసం ఎన్ని ఎదుర్కోవాలో మనసుని ఎంత నొప్పించాలో ..మనిషిలోని మనసు వేదన మారిన మనిషి వెనుక ఉంటుందంటూ సూటిగా విసిరినా నల్లమోతు శ్రీధర్ అగ్ని గుళిక .... 5.మార్పు ఎంత నరకమంటే..
1.విజయాలే ఎక్కువ కాటేస్తాయి ఎందుకంటే..
మన విజయం, మన సంతోషం మన అనుకునే వాళ్లందరిన్నీ సమాన స్థాయిలోనే సంతోషపెడుతుందని భ్రమిస్తుంటాం. కానీ సంతోష ఘడియలూ, విజయకేతనాలూ ఎంత ప్రమాదకరమైనవో గ్రహించం! ఎంతో ఉల్లాసంగా గడిపేటప్పుడు ఒకింత జాగ్రత్తగా చూడండి.. ఏ మూలనో ఎక్కుపెట్టబడిన బాణం మన గుండెల్లో దూసుకువెళ్లే క్షణం కోసం వేచి చూస్తూ ఉంటుంది.
మనసారా మనం ఓ విజయాన్ని ఆస్వాదించేటప్పుడు మనల్ని ముఖతః తృప్తిపరచడం కోసమే ఎక్కువ చిరునవ్వులు కృత్రిమంగా విచ్చుకుంటాయి తప్ప మనసులో నిజంగానే మన స్థాయిలో మన కోసం ఆనందాన్ని పొందే వారు తక్కువ. మనం గమనిస్తూనే ఉంటాం.. " ఫలానా పొజిషన్ కి వచ్చాక ఆ మనిషికి అహం పెరిగింది.." వంటి ఫిర్యాధులు ఎక్కువ విన్పిస్తూ ఉంటాయి.
మనం ఉప్పొంగిపోయేటప్పుడు ఆ తమకంలో కొద్దిసేపు అందరూ మనవాళ్లే కదా అని ఎవర్నీ పేరుపేరునా పట్టించుకోం. అలా పట్టించుకోపోవడమే అవతలి వారికి "పట్టింపు"గా మారిపోతుంది. "ఎలా విర్రవీగుతున్నారో చూశారా.. కన్నూ మిన్నూ తెలీకుండా పోతోంది" అన్న దుగ్ధ వెళ్లగక్కబడుతుంది. నిజానికి అందరూ మనం ప్రాణానికి ప్రాణంగా భావించే వారే. వారూ మనతో అలా ఈ క్షణం వరకూ గడిపిన వారే. ఓ చిన్న విజయం ఓ అగాధాన్ని ఏర్పరచడం మొదలుపెడుతోందంతే!
అందుకే విజయాలు, సంతోష ఘడియలూ అధఃపాతాళానికి కూరుకుపోయిన స్థితి కన్నా ప్రమాదకరమైనవి. విజయాల్లో మనం మనిషినీ మనిషినీ పట్టి పట్టి పలకరించలేం. కానీ అవతలి వారు మాత్రం ఆ పరవశంలోనూ మనం తమని గుర్తుపెట్టుకుంటేనే విలువ ఇచ్చినట్లు దురభిప్రాయాలూ కల్పించుకుంటారు. విచిత్రంగా విచారాల్లోనూ, వైఫల్యాల్లోనూ పరిస్థితి తారుమారు అవుతుంది. మనం అవతలి వారు మనల్ని పట్టించుకోవాలని ఉవ్విళూరుతూ ఎదురుచూస్తుంటాం. ఎవరూ పట్టించుకోపోయేసరికి విరక్తి చెందుతాం. అవతలి వారికి మాత్రం మన వైఫల్యాల్లో మన సాన్నిహిత్యం అక్కరకు రాదు. "ఆ మనిషి అసలే సమస్యల్లో ఉన్నాడు, మనకెందుకు వచ్చిన శిరోభారం" అని దూరం దూరంగా మసులుతుంటారు.
ఎంత బలీయమైన మానవ సంబంధాలో కదా! ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ మొత్తం ప్రక్రియలో అందరూ తమ ఇగోలు సంతృప్తిపరుచుకోవడమే పరమావధిగా ప్రవర్తించే వారే. తమ ఇగో సంతృప్తిపడకపోతే ఎదుటి వ్యక్తిలోనే లోపం ఉన్నట్లు భావిస్తారు, తమ ఇగో ఎదుటి వ్యక్తితే సంతృప్తిపరచడబడిన క్షణం ఆ వ్యక్తిని మించిన గొప్ప మనిషి ఈ ప్రపంచంలో లేనట్లు భుజానికి ఎత్తుకుంటారు.
- నల్లమోతు శ్రీధర్.. post in fb jan 27 2012
2.ఆరాలూ, సమాధానాలే జీవితమా..?