ఆత్మగౌరవం అన్నది ఎవరికీ వారు తమ ప్రతిబింబాన్ని అందంగా చిత్రీకరించుకోవాలనే చేసే ప్రయత్నసాధనే.... ఆత్మా గౌరవం అన్నది చిన్నాప్పటినుండి మనతో పాటే అడుగు వేస్తుంది. హింసాయుతమైన వాతావరణం ఉన్న కొన్ని కుటుంబాలల్లో, కల్లోలిత సామాజిక సంఘటనల వల్ల ఆత్మా గౌరవం కుంటూ పడొచ్చు, కానీ అలాటి వారందరు ఆత్మా గౌరవం పొందడానికి అనర్హులుగా మాత్రం పరిగణించడం కుదరదు. మంచి కుటుంబ వాతావరణం నుంచి వచ్చినవారిలో ఆత్మ గౌరవం మెండుగా ఉండాలని కూడాలేదు. ఇది ఎవరి ప్రతిబింబాన్ని ఎంత అందంగా తమకు తాము చూడాలని అంతరంగంలో నిజాయితీగా ఆశ పడుతారో వారు తప్పక అందుకునే అపురూపమైన కానుక.
ఆత్మగౌరవం అంటే ఎవరినుంచో అందుకునే వస్తువు కాదు, అది ప్రతీ వారి దగ్గరుండే అమూల్యమైన వజ్రం, ఎంతటి విలువైన వజ్రం ఐనా మెరుగు లేనిదే ప్రకాశించదు. ఎప్పటి కప్పుడు మనలోని ఆత్మనూన్యతను, బలహీనతలను అధిగమించడము వలననే అది సాధ్యం. మనము ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, వారి తో మర్యాద పాటించడం అన్నది ప్రతీ వారికీ తెలుసు..కానీ తనకు తాను మర్యాద ఇచ్చుకోవడం అన్నది ఈ మాత్రం పట్టిచుకోకపోవడం గమనార్హం. మర్యాద ఇచ్చుకోవడం అంటే వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఎదుటివారి ముందు తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడడం, తను వ్యక్తిగతంగా నష్టపోతానేమో అన్న ఆలోచనతో తను అవమానపాలు కావడానికి సిద్ధపడడం ఇలాంటివి అన్నీ కూడా మీ మీద మీరు గౌరవం పోగొట్టుకునేలా చేస్తుంది..
ఒకసారి ఆత్మగౌరవం కోల్పోతే మళ్ళీ జీవితంలో పొందలేము అన్నది చాల తప్పు..మనం చేసే పొరపాట్లు , తప్పులు ఎవరి ఊహకు అందకపోయినా మనకు తెలుస్తాయి అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మూలంగా మాత్రమే ఆత్మగౌరవం అన్నది మన చెంత చేరుతుంది. అలాంటి వ్యక్తి తనను తాను ప్రేమించుకోగలడు అలాంటి వ్యక్తే ఇతరులను మనఃపూర్వకంగా గౌరవించగలడు, ప్రేమించగలడు. ఒక రూపాయి కాగితం నలిగిపోయినా, కొన్ని పరిస్థితుల్లో చిరికి పోయినా కూడా రూపాయి ని తిరిగి పొందవచ్చు. కానీ నలగని రూపాయి ఐనా కూడా మట్టిలో పాతిపెడితే దాని విలువ రాబట్టుకోవడం ఎంత సాధ్యమో ఆత్మగౌరవం కూడా మనం ఎంతాగా చేజార్చుకున్న కావల్సినపుడు తిరిగి పొందవచ్చు అన్నది కూడా అంతే సాద్యం. ప్రతీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి అవి అధిగమించాకముందే మనం నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి.
సరైన అవకాశాలు లేక,వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక తాము సాధారణ జీవితాన్ని గడపాల్సి వస్తుందని చాల మంది ఆవేదన చెందుతుంటారు. డబ్బు, మంచి ఉద్యోగం, అదృష్టం...వీటి గురించి ఆలోచిస్తూ మనుషులు అసంతృప్తి తో బతికేస్తుంటారు.
"ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటాడో అది మాత్రమే అతని కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది"అంటారు తత్వవేత్త హోన్రీ డేవిడ్ థోరో.
మన గురించి మనం ఎలా భావించుకుంటున్నామో అదే మన ఆత్మగౌరవం. ఒక వ్యక్తి కి ఆత్మగౌరవం లేకపోతె అతనికి ఏమిలేనట్లే. ఆత్మగౌరవం ఉంటె జీవితంలో అన్నీ సాధించుకోవచ్చు. జీవితంలో అద్బుతాలు సృష్టించడానికి తొలిఅడుగు ఆత్మగౌరవం
.
ఆత్మగౌరవం బలంగా ఉంటె జీవితంలో ఆనందం తృప్తి కలుగుతాయి. జీవితానికి ఒక అర్ధం ఉందన్న భావన, మనం యోగ్యులమన్న భావన కలుగుతాయి.ఆత్మగౌరవం మనల్ని ముందుకు నడిపించే స్వీయ ప్రేరణ. జీవితంలో విజయం సాధించాలంటే ఈ అంతః శక్తి ఎంతో అవసరమని ప్రపంచంలోని పెద్ద గొప్ప నాయకులూ, తత్వవేత్తలు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆత్మగౌరవంబలంగా ఉన్నవాళ్ళకి దృఢవిశ్వాసం బాధ్యతా స్వీకరించే లక్షణం, ఆశావాద దృక్పథం ఉంటాయి. వారికి ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇతరుల సహాయం కోరతారు. వారి సంబంధం బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి. ఏదైనా సాధించాలన్న, కోరిక బలంగా ఉంటుంది. వారిలో సవాళ్ళని ఎదుర్కొనే సామర్ధ్యం ఉంటుంది. కొత్త అవకాశాలని అడిపుచ్చుకోడానికి సిద్దంగా ఉంటారు. ఆత్మగౌరవం బలంగా ఉన్నవారు తమని తాము నమ్ముతారు. గౌరవిన్చుకుంటారు. ఇతరులని గౌరవిస్తారు.తమ పనితీరును మెరుగు పరుచుకుంటూ కష్టసాధ్యమైన పనులు చేయగలుగుతారు....రాజేంద్ర ప్రసాద్ రెడ్డి (నవ్య వారపత్రిక)
ఆత్మగౌరవం అన్నది స్వవిషయం, దీని వల్ల ఎవరికీ ఏమి ముప్పు లేదు అని వాదనలు చేయడం తగదు, ఆత్మగౌరవం అన్నది ఒక మనిషి ఉన్నతికి తోడ్పడేది మాత్రమే కాదు. సమాజం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. తనమీద నమ్మకం, గౌరవం కోల్పోయిన వ్యక్తి ఇతరులను మాత్రం ఎలా ప్రేమించగలడు. మంచి చేయకున్నా సమాజానికి చెడు చేయడానికి వెనుకడుగు వేయరు. ఇది అందరు తనని గుర్తించాలని ఆరాటం చెందడం మూలంగా ఏర్పడే పరిణామం.
మీ అనుమతి లేనిదే ఎవరు మిమ్మలిని కించపరచలేరు ..ఎలినా రూజ్వెల్ట్ ....జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోడం ప్రతీ ఒక్కరికి అనుభవంలోకి వచ్చేవే, కొన్ని చోట్ల మనం అవమానింపబడుతాం అందులో మన తప్పు ఒప్పులతో పనిలేకుండా, ఒకరికి చేయూత అందించడం లో మనం నష్టపోతాం,అలాంటప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని మనల్ని మన నిదించుకోకూడదు . అపుడే మనం జీవిత పాఠాలని తగు విధంగా నేర్చుకోగలము. మనము ఏమి చేయగలము, ఎంత చక్కగా చేయగలము, ఎంత బాధ్యతగా చేయగలము అనే దానితోనే మనం ఆత్మ గౌరవం పొందగలము.
ఎదుటివారిని గౌరవించడమనే సంస్కారం ఉంటే సరిపోదు ....మనల్ని మనం గౌరవించుకోవడం అనే బాధ్యత ఉంటేనే .....మనల్ని మనము ఇష్టపడగలము.....అలాంటి వ్యక్తులే ఇతరులచే ప్రేమింపబడగలరు.