మానవ సంబంధాల్లో అన్నిటికంటే ముఖ్యం ఐనది నిజాయితీ, నమ్మకం. కానీ ఇవి రెండు ఎప్పుడు కనుమరుగావుతాయో ఎవరూ ఊహించలేరు, ఎంతో ఆత్మీయులు అనుకున్నవారి నుండి ఎదురైతే ఆ పరిస్థితిని చవిచూసిన మనిషి మీకు ఎదురుపడితే,వారి మనోగతం మీరు తాకగలిగితే ఆ గాయానికి మీరు లేపనం అద్దగలిగితే ....మీరు మాటల కందని భావానికి, దేవుడు గీసిన చిత్రానికి ప్రతిరూపంగా ఉండిపోతారు.
బ్రతుకుబాటలో ఎదురైనా స్నేహితుడు, స్నేహధర్మం మరచి, నిజాయితీకి నీల్లోదిలి బ్రతుకుతెరువు కోసం ఈ మాత్రం చేయడం తప్పులేదనుకుంటూ సమర్ధించుకునే ఇలాంటి నీరజ్... ఎక్కడైనా ఉండొచ్చు..కానీ ఎవరికీ ఎదురుపడకుంటే బాగుండు అని మనసారా కోరుకుంటూ ఈ కథ మీ కోసం ....మనసుని కదిలించే విమల్ పాండేయ్ హిందీ కథను . శాంతసుందరి గారు తెలుగులో అనువాదం చేసారు
వీధిన పడ్డ జీవితం
నగర జీవితం వాహనాల వేగంతో పోటీపడి పరుగులు పెడుతోంది. ఈ వీధులకి కళ్లూ, చెవులూ లేవు, కాళ్లు మాత్రమే ఉన్నాయి. వేలవేల కాళ్లతోఈ వీధులు తమ దారికి అడ్డొచ్చేవాటినన్నిటినీ తొక్కుకుంటూ గుడ్డిగా పరిగెడుతున్నాయి. పక్కనించి పోయే కార్ల హారన్లు, కళ్లు బైర్లుకమ్మే హెడ్‌లైట్లు ఆమెని తూట్లు తూట్లు పొడుస్తున్నట్టు…. ఆ మగతనించి కోలుకుని ఆమె అటూ ఇటూ చూసింది. తను ఒక బిజీ రోడ్డు వార పేవ్‌మెంట్ మీద పడుండటం ఆమె గమనించింది. ఒళ్లంతా కుళ్లబొడిచినట్టు విపరీతమైన నొప్పులు…. తోడేళ్లు పీక్కు తిన్నట్టు!
ఆమె తన శక్తినంతా ఉపయోగించి లేచి కూర్చుంది. జరిగిన దాన్ని గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించసాగింది. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క విషయమే గుర్తు రాసాగింది.
తమ ఊరివాడే ఒకాయన ఈ ఊళ్లో ఎమ్‌ఎల్‌ఏ అయ్యాడు. తన తండ్రికి ఆయనతో కొంచెం పరిచయం ఉండటంతో అదే పనిగా తనకి ఉద్యోగం వేయించమని ఆయన కాళ్లా వేళ్లా పడటం మొదలుపెట్టాడు. చివరికి ఒకరోజు ఆ ఎమ్.ఎల్.ఏ. తనని ఇంటికి రమ్మని, అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి…. తాగుతూ, చెత్త మాటలు మాట్లాడుతూ… పారిపోవాలని ప్రయత్నించిన తనని పట్టుకుని, ఆ ముగ్గురూ… ఆ తరవాత తనని ఇక్కడ పారేయించినట్టున్నారు! ఆ విషయాలన్నీ గుర్తుకి రాగానే ఆమె మళ్లీ భయంతోనూ, అసహ్యంతోనూ వణకసాగింది.
మెల్లిగా లేచి నిలబడేసరికి ఆమె మోహం మీద ఏదో లైటు పడింది. ఆ లైటు వెనక మనిషి ఆమెని ఆపాదమస్తకం పరీక్షించి, ”అరె! మీ బట్టలమీద ఆ రక్తం ఏమిటి? ఏమయింది?” అని అడుగుతూ దగ్గరకొచ్చాడు. ఆ గొంతు తనకి బాగా తెలిసినదే అనిపించిందామెకి.
”నాకు… నన్ను…. ముగ్గురు రాక్షసులు… నువ్వు… నువ్వు నీరజ్‌వి కదూ?” అందామె అతన్ని లైటు వెల్తుర్లో చూస్తూ. అలా తనకి బాగా ఆత్మీయుడైన అతన్ని చూడగానే ఆమె కళ్లు తిరిగి పడిపోబోయింది. అతనామెని పడిపోకుండా పట్టుకుని, ”అవును, నీరజ్‌నే… నవ్వు ఝాన్సీవి కదూ? చూడగానే గుర్తు పట్టానులే! కానీ, ನುవ్వు…. ఇక్కడ?” అంటూ ఆమెని నెమ్మదిగా పేవ్‌మెంట్ వార కూర్చోపెట్టి, తనుకూడా కూర్చున్నాడు
.
అతనలా ఆత్మీయంగా మాట్లాడేసరికి ఆమెలో గూడు కట్టుకున్న దుఖమంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బైటికొచ్చింది. జరిగినదంతా అతనికి చెప్పి, అతని గుండెల్లో ఒదిగిపోయి ఏడవసాగింది. నీరజ్ ఆమె తలా, వీపూ నిమురుతూ ఓదార్చాడు.
ఏడుస్తూనే, ”నువ్వు ఇంటర్ పూర్తి చేశాక ఇక్కడికి వచ్చేశావుకదా? ఇప్పుడేం చేస్తున్నావు? అని అడిగింది. తన చిన్ననాటి స్నేహితుణ్ణి చూడగానే ఆమెకి కొండంత బలం వచ్చింది.
ఇక్కడ ఒక టీవీ ఛానెల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాను. నువ్వు ఇంటర్ తరవాత ఏం చేశావు?”
”బీ.ఏ. పూర్తి చేసి ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందంటే ఆ ఎమ్.ఎల్.ఏ. దగ్గరికి….” ఆమె మళ్లీ ఏడవసాగింది. నీరజ్ ఆమెని ఓదార్చేందుకు శతవిధాల ప్రయత్నం చెయ్యసాగాడు.
”నువ్వు కనిపించడంతో నాకు చాలా నిశ్చింతగా ఉంది, నీరజ్! నన్ను మా ఊరు పంపించటానికి ఏర్పాటు చెయ్యవా? ఇక నీదే భారం! కానీ నాన్నకి ఇక్కడ జరిగిన విషయాలేవీ తెలీకూడదు. నాకొక జత బట్టలు కూడా కొనియ్యి!” అంది.
నీరజ్ ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. ఉద్యోగం అంత సుఖంగా లేదతనికి. ఛానెల్ హెడ్ నించి రోజూ చివాట్లు తినటమే…. మంచి వార్తలు తీసుకురాలేక పోతున్నాడనీ, మిగతా ఛానెళ్లవాళ్లలాగ సంచలనం సృష్టించగల కథలేవీ సంపా దించటం లేదనీ రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు….
ఊళ్లో ఇంత హింస, ఇన్ని దారుణాలూ జరుగుతుంటే, వాటిని ఎందుకు కవర్ చెయ్యటం లేదని గొడవ!
పో… అలాంటిది వార్తేదైనా ఉంటే నాదగ్గరికి రా… లేదా ఉద్యోగం వదిలేసి వెళ్లు!”
”సార్, అలాంటి వార్తలు రోజూ ఎక్కడ దొరుకుతాయండీ?”
”దొరక్కపోతే సృష్టించాలోయ్! మీకు మేము ఊరికేనే జీతాలిస్తున్నామను కుంటున్నావా?”
తననే ఆశ్చర్యపరిచే ఒక ఆలోచన నీరజ్ మనసులో తలెత్తింది…. ఆ ఆలోచనకి అతనికి భయం కూడా వేసింది… తనమీద తనకే అసహ్యం లాంటిది కూడా కలిగింది. కానీ ప్రతివాళ్లకీ తమ జీవితమే ముఖ్యం…. ఉద్యోగం అవసరం…
నీరజ్ మనసులో రకరకాల భావాలు సుళ్లు తిరగసాగాయి. ఇక అక్కడ, ఝాన్సీ పక్కన కూర్చోలేక గబుక్కున లేచి నిల బడ్డాడు.
”నాకొక జత బట్టలు….” ఝాన్సీ కూడా ఊరికి వెళ్లాలని తొందరపడుతోంది.
”అలాగే, ఒక్క నిమిషం. ఒక్క ఫోన్ చేసి, ఆ తరవాత నీకోసం బట్టలు కొనుక్కొ స్తాను, ఏం?” అని కొంత దూరంగా వెళ్లి ఫోన్‌లో మాట్లాడసాగాడు-
”యస్, సార్! యస్ సార్! చాలా హృదయవిదా రకమైన సంఘటన సార్! గ్యాంగు రేప్ కేస్, సర్! అవును, సర్! చాలా ఫ్రెష్ స్టోరీ… ఎమ్‌ఎల్‌ఏతో బాటు మరో ఇద్దరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు సార్… అవును, సర్! అది జరిగి రెండు మూడు గంటలే అయుంటుంది, సర్! ఫ్రెష్ ఎండ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ, సర్!
”యస్ సర్! అమ్మాయి నాతోనే ఉంది, సర్! ఆమె ఆ ముగ్గురికీ విరుద్ధంగా స్టేట్‌మెంట్ ఇస్తుంది, సర్! ఓకే, సర్! కెమెరా వాళ్లనీ, మిగతా సిబ్బందినీ పంపండి, సర్!…. ఒకే, సర్!… అన్నట్టు ఆమె బట్టలు మార్చుకోవాలని తొందరపడుతోంది… అలాగే సర్! కవరేజ్ అయిపోయాకే మార్చుకుంటుంది, సర్!
నీరజ్ మళ్లీ వచ్చి ఝాన్సీ పక్కన కూలబడ్డాడు. లోపల లావా పొంగుతోంది… స్థిమితంగా కూర్చోలేక లేచి పచార్లు చెయ్యసాగాడు. ఒక పక్క ఝాన్సీ అంటే ఇష్టం, చిన్నప్పట్నించీ ఉన్న స్నేహం, మరోపక్క తన ఉద్యోగం, తన స్వార్థం. ఈ రెండిటి మధ్యా అతని మనసు నలిగిపోవటం మొదలుపెట్టింది. ఏదో ఒకటి మాట్లాడక పోతే పిచ్చెక్కేట్టుందని అనిపించి, ”అది సరేగాని, ఝాన్సీ, ఒక విషయం చెప్పు, నీకు జరిగిన అన్యాయానికి ఆ దుష్టులని శిక్షించా లని లేదా నీకు?” అన్నాడు చాలా నెమ్మదిగా.
”ఒద్దు, నీరజ్… అలా జరగటానికి వీల్లేదు!” అంది ఆమె బెదిరిపోతూ. మళ్లీ తనే, ”వాళ్లకి శిక్ష పడటం కన్నా, మా నాన్నకి ఎటువంటి మనస్తాపమూ కలగకుండా ఉండడం నాకు ముఖ్యం. ఈ సంగతి నాన్నకి తెలిస్తే ఆయన బతకడు! నీరజ్, నన్ను త్వరగా ఊరికి పంపే ఏర్పాటు చెయ్యవా?” అంది బతిమాలుతున్నట్టు.
నీరజ్‌కి ఆమెని ఎలా ఓదార్చాలో తెలీలేదు. ఆమె ఏదైతే ఒద్దనుకుంటోందో, అదే తను చెయ్యబోతున్నాడు. ఝాన్సీ మళ్లీ ఏడవటం మొదలు పెట్టింది. అతనికేమీ పాలుపోలేదు. ఇద్దరూ కాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్లుండిపోయారు.
ఝాన్సీ ఏడుపు ఆపి నీరజ్‌వైపు చూసి ఏదో అనబోయేంతలో నాలుగైదు పెద్ద వ్యాన్లు, బ్రహ్మాండమైన లైట్లతో వచ్చి వాళ్లముందు ఆగాయి. కొందరు కెమెరాలూ, మైకులూ పట్టుకుని దిగి ఆమెని చుట్టుముట్టారు. మిరుమిట్లు గొలిపే లైట్లు ఆమె మీదికి ఫోకస్ చెయ్యబడ్డాయి. నాలుగురోడ్ల కూడలిలో నిల్చోబెట్టి ఎవరో తన ఒంటి మీది బట్టలన్నీ లాగేసినట్ట నిపించింది ఝాన్సీకి. రక్తంతో తడిసిన తన బట్టలకేసీ, చుట్టూ ఉన్న మనుషులకేసి పిచ్చిగా చూడసాగిందామె.
”నాయకుడంటే అందరికీ ఆదర్శంగా ముందుండి నడిపించేవాడని అర్థం. కానీ మన ఊళ్లోని కొందరు నాయకులు చేసిన అత్యాచారం చూసి ఈ ఊరేకాదు, దేశమంతా తలవంచుకోవాల్సి వస్తోంది. ఒక రాజకీయ నాయకుడు తనకి బాగా తెలిసిన ఒక ఆడపిల్లని ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి పిలిపించుకుని, మరో ఇద్దరు నాయకులతో కలిసి చేసిన ఈ దురాగతం సిగ్గుకి కూడా సిగ్గు కలిగించేదిగా ఉంది. రండి, మన రిపోర్టర్, నీరజ్, ఈ సంఘటన గురించి ఏం చెపుతాడో, విందాం. నీరజ్ వర్మా, చెప్పండి…”
”మురాదాబాద్‌కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లభిన్‌పూర్‌కి చెందిన ఝాన్సీకి తను ఉద్యోగం కోసం కలవ బోతున్న ఎమ్.ఎల్.ఏ. ఎటువంటి వాడో ఎంత మాత్రం తెలీదు. అమాయకంగా అతని ఇంటికి వెళ్లిన ఆ పిల్లని ఎమ్.ఎల్.ఏ. మరో ఇద్దరూ కలిసి దారుణంగా దోచు కున్నారు. తన తండ్రి వయసు వ్యక్తి అని నమ్మి వెళ్లిన ఝాన్సీని వాళ్లు రోడ్డువార అపస్మారక స్థితిలో పారేసి పోయారు….”
ఫుట్‌పాత్ టీవీ స్టూడియోగా మారి పోయింది. ఫోన్లమీద ఫోన్లు…. ఒకటే హడావిడి… పరుగులు….
”యస్ సర్, యస్ సర్….”
”ఎమ్.ఎల్.ఏ.కి ఫోన్ చెయ్యి…. హరీ అప్!”
”అతను ఫోన్ ఎత్తటం లేదు….”
”మిగతా ఇద్దరివీ?”
”యస్ సర్… ప్రయత్నిస్తున్నాం….”
”లైవ్ తీశాక దీనిమీద ఎనాలిసిస్ కూడా ప్రసారం చెయ్యాలి…… ఒక వ్యక్తి ఫోన్‌లో అందాడు… ఎడిటర్‌ని త్వరగా స్టూడియోకి రమ్మను… క్విక్!”
”యస్ సర్….” అంటూ పేవమెంట్ మీద ఒక కూర్చీ తెచ్చి వేశాడు ఎవరో.
ఝాన్సీ ఆ లైట్లూ, కెమెరాల ముందునించి పక్కకి పోబోతూంటే ఎవరో చెయ్యిపట్టుకుని కూర్చీలో కుర్చోబెట్టారు. ఆమె నీరజ్‌కేసి చూడలేక పోతోంది. నీరజ్ చేసే పని… అతనే చేస్తున్నాడని ఆమెకి నమ్మకం కుదరటం లేదు. నీరజ్ తనే స్వయంగా మైక్ పట్టుకుని ఆమె ముందు కూర్చుంటే, ఝాన్సీ అర్థం కానట్టు అతనికేసి చూసి, మొహం తిప్పుకుంది.
”మీకు బాగా పరిచయస్తుడైన ఒక నాయకుడు మీపట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించాడు. అతను చేసిన ఈ విశ్వాస ఘాతం గురించి మీరేం చెప్పదల్చు కున్నారు?”
ఝాన్సీ భోరుమని ఏడవటం మొదలు పెట్టింది. ఏడుపు తగ్గాక తనే మాట్లాడు తుందని ఎదురు చూస్తున్న నీరజ్‌కి, కొంత సేపయాక ఝాన్సీ ఇంక మాట్లాడలేదేమో అనిపించింది. కానీ ఝాన్సీ రుద్ధమైన గొంతుతో మాట్లాడటం మొదలు పెట్టింది
.
”ఎంత పని చేశావు, నీరజ్? నాన్నకి ఈ విషయం అసలు తెలీకూడదని చెప్పలేదా నీకు? కానీ…. నువ్వు… టీవీలో….? వాళ్లు…. వాళ్లు నా శరీరాన్ని మాత్రమే మోసం చేశారు… కానీ నువ్వు? నువ్వు నా మనసుని…. నేను నీ మీద ఉంచిన నమ్మకాన్ని… ఎంత మోసం చేశావు, నీరజ్! ఈ జన్మలో నిన్ను క్షమించను… క్షమిం…” ఝాన్సీ కూర్చీలో కూర్చునే మూర్ఛపోయింది.
నీరజ్ మ్రాన్పడిపోయాడు… ఎంత పెద్ద తప్పుచేశాడు తను!… ఎంత నమ్మక ద్రోహం… అతని బుర్ర పని చెయ్యటం మానేసింది.
రోడ్డు మీద వాహనాలు రొద చేస్తూ పరిగెడుతూనే ఉన్నాయి. దేశంలో ఉండే టీవీలన్నిటిలోనూ, ఒక ఆడపిల్ల పట్ల జరిగిన ఘోరమైన అపచారాన్ని, భోజనంతో పాటు నంచుకుంటూ జనం కుతూహలంతో చూడటం మొదలుపెట్టారు.