ఓషో..మట్టి దీపాలు

ఓషో మన దైనందిన జీవన విధానాన్ని గురించి చిన్న చిన్న కథలుగా అందరికీ అర్ధమయే రీతిలో విపులంగా చెప్పారు. వాటిని "మట్టికేదియే" అనే పుస్తకంగా మొట్టమొదట హిందీ భాషలో ప్రచురించబడినది. అదే పుస్తకము ఇపుడు స్వామి సంతోషానంద తెలుగులో "మట్టిదీపాలు" గా అనువదించారు. ఇందులో 59 బోధకథలు ఉన్నాయి.

మనిషి నిరంతరం అసంతృప్తితో దేనికో తెలియని ఆరాటంతో పరుగులు పెడుతున్నాడు. తనలోనే ఉన్న చేతన్యాన్ని, దాని శక్తిని గుర్తించలేని గుడ్డివాడుగా బ్రతుకుతున్నాడు. అందువల్ల అతనిలోని వెతుకులాటకి గమ్యం లేకుండా, తెలియకుండా పోతున్నాడు. ప్రమిదలోని వత్తిని మండించడం మొదలు పెడితే ఆ అగ్నిలోని వేడికి మానవుని కప్పి ఉంచిన మాయ తొలగిపోయి అతనిలోని ప్రకాశాన్ని అతనికి తెలియడానికి ఉపయోగపడుతుంది.

ఓషో జీవిత సారాంశాన్ని గురించి అతిసులభంగా, సరళతరంగా అందరికీ అర్ధమయ్యే విధంగా చక్కగా అర్ధమయ్యేలా చెపుతారు, వాటికి చిన్న చిన్న హాస్య కథలు కూడా జోడించి వాటిని మనము మరచిపోలేని విధంగా, మనసుకు హత్తుకునేటట్లు చెప్పారు.

మట్టిదీపాలు లోని ఒక బోధకథ....

ఎక్కడ విన్నా ధర్మం, ధర్మం, ధర్మం అని ఒకే పదము వినపడుతుంది. అసలు ధర్మాన్ని గూర్చి ఎంత ఆలోచన జరుగుతుంది?దాని పరిణామము ఏమిటి? ఊరికే శాస్త్రవచనాలు వల్లించడమేనా లేక ఫలితమేమయినా ఉందా, అని చూస్తే ఏమిలేదు. సరికదా మనుష్యుడు నిరంతరము దుఃఖసాగరంలో మునిగిపోతున్నాడు. జీవనము ప్రతీక్షణం పశువులాగా దిగాజారుతున్నది. నేర్చుకున్న సిద్దాంతాలను వల్లెవేస్తూ మనము పురాతన రాళ్ళ మందిరాలలో తలవంచుతున్నాము.

మనము పూర్తిగా అసత్యంలోనూ దాని శబ్దాలలో మునిగిపోయి సత్యాన్ని గుర్తించే అర్హతను పోగొట్టుకున్నాము. శాస్త్రాలు మానవుని వాటి తర్కంతో బంధించి వేసి
స్వయం గురించి వెతికే అవసరాన్ని మరపింపచేసాయి. బహుశా ఇందుకే ఆచరణలేని విచారణ గానే మిగిలిపోయి రెంటి మధ్య దాట లేనంత పెద్ద అగాధము ఏర్పడింది. బహుశా అందుకే మానవులు చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టు పూర్తి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చెప్పేది ఆచరించలేదు. చేయాలనుకునేదాన్ని చెప్పలేరు. గుర్తించవలసినదేమిటంటే మానవులు దానిని చూడలేని పరిస్థితులలో కండ్లు ఉండి గ్రుద్దివాళ్ళు అయినారు.

ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తే ఎవరయితే తమ ఆస్థిత్వాన్ని గుర్తించలేదో వారు సత్యమును, ముక్తిని సాధించలేరు. వారు ఇలాంటి ఇబ్బందులలో పడతారు. సత్యము మన అస్తిత్వాన్నిగుర్తించడం ద్వారానే వస్తుంది. అలా కానప్పుడు మానవుడు అసత్యంలో మునిగిపోయి నేర్చుకున్న శాస్త్రాలను చిలక పలుకులుగా వల్లే వేయడం తప్ప అసలు సత్యం ఉండదు. నేర్పించబడ్డ సత్యాల కంటే అధిక అసత్యం లేదు. సత్యం, ధర్మం నేర్పితే నేర్చుకునేది కాక తనకి తానూ గుర్తించవలసినది అని తెలియాలి. ఇందుకు ఉదాహరణగా నేను ఒక కథ చెపుతాను వినండి.

ఒక ఊరిలో పర్వతాల మీద కట్టిన ఒక ధర్మశాల ఉండేది. అందులో మాటలు నేర్చుకున్న చిలుక ఒకటి ఉండేది. దానికి దాని యజమాని స్వతంత్రత, స్వతంత్రత. స్వతంత్రత అనే పలుకులు నేర్పించాడు. అది రోజంతా అవే పదాలు వల్లెవేస్తూ ఉండేది. అయితే ఒక రోజు ఒక యాత్రికుడు ఆ ధర్మశాలలో బస చేయడానికి ఆగాడు. రాత్రంతా ఆ చిలుక స్వతంత్రత, స్వతంత్రత, స్వతంత్రతఅంటూ చాలా దుఃఖముతో అరుస్తూ ఉంటె అతనికి అతని గత జీవితం గుర్తువచ్చింది. ఎందుకంటే అతను కూడా పూర్వాశ్రమంలో తను ప్రాంత విముక్తి కోసం పోరాడే కారాగారములో కొన్ని రూలు ఖైదీగా ఉన్నాడు. అప్పుడు అతని అంతరాత్మ కూడా స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము అని మొరపెట్టేది. అందుచేత అతను ఎలాగైనా ఆ చిలుకను ఆ బాధ నుండి విముక్తి చేయాలని తలంచాడు. తెల్లవారగానే అతను చిలుకను పంజరం నుండి బయటికి తీయాలని ప్రయత్నం చేయగా, ఆ చిలుక అందుకు ఇష్టపడక పంజరపు చువ్వాలను గట్టిగా పట్టుకుని అరవడం మొదలుపెట్టింది. చివరికి ఆ యాత్రికుడు బలవంతంగా చిలుకను బయటకు లాగి ఆకాశంలోకి వదిలి హాయిగా ఊపిరిపీల్చుకున్నడు. కాని ఆ చిలుక మరలా పంజరంలోకి వచ్చి యధాతధంగా స్వతంత్రత, స్వతంత్రత, స్వతంత్రత అని అరవడం మొదలు పెట్టింది.

ఎలా అయితే ఆ చిలుక చేసే దానికి చెప్పే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో, తానూ చెప్పే పదాలకు అర్ధం తెలియక కొట్టుమిట్టాడుతోందో, మానవుల పరిస్థితి కూడా అలానే ఉంది.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!