జీవితం నేర్పే నవల..తెరవని తలుపులు

ఈ రోజే నేను హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి వెళితే అందులో ఒక స్టాల్లో పాత పడిన పుస్తకం కనిపించింది. అది 2004 లో మొదటి ప్రచురణ అయిన కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన నవల 'తెరవని తలుపులు'. ..ఆ పుస్తకమే రెండో ప్రచురణ జరిగినట్లు అనిపించలేదు.....

నేను ఈయన రచనలను నచ్చాయని లేకపోతే నచ్చలేదనీ చెప్పలేను. కానీ ఒక ప్రత్యేకమైన అభిమానం. నేను మొదట చదివిన పుస్తకం 'మంచు పూవు', ఆ పుస్తకము లో కథాంశం నా మనసుని ఎంతగా వెంటాడిందంటే..నా మనసుని, నా ఆలోచనల్నిఒక తాటి మీదకు తెచ్చి  రెండోసారి అతని పుస్తకం చదవడానికి రెండు మాసాలు పట్టింది. ఆతను ఎన్నుకునే ఇతివృత్తం నిజమని తెలిసినా, మన మనస్సు ఒప్పుకోడానికి మొండికేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో,  తనకంటూ ప్రత్యేకమైన శైలీ సంవిధానాలు కలిగిన ఏకైక రచయిత కాశీభట్ల వేణుగోపాల్ రచనలు—నేనూ చీకటి, తపన, దిగంతం, మంచు పూవు మొదలైనవి—ఆయన మాత్రమే రాయగలిగేవి. కథకు వాతావరణాన్ని అల్లడంలో, పాత్రల అంతర్లోకపు చీకట్లని నగ్నంగా వెలిచేసి చూపించడంలో ఆయన కలం నిశితమైనది, నిర్థాక్షిణ్యమైనది. "తెరవని తలుపులు" ఆయన ఐదో నవల. వేణుగోపాల్ గారికే ప్రత్యేకమైన రచనాశైలి, ఉరుకులు - పరుగులు పెట్టే అక్షరాలు, నిగూఢార్ధాలతో వాక్య నిర్మాణం అంత సులభంగా మాత్రం అర్ధం కావు. . కొన్ని తెలుగు పుస్తకాలు చదివాక ఈ నవలలు కూడా ఎక్కువమంది చదవాలని కోరుకుంటాను.

తెరవని తలుపులు' నవల చదివి స్థూలంగా కథ ఇది అంటూ చెప్పగలమే కానీ అందులోని కథా నాయకుని మనసులోని భావాలు విశదీకరించి చెప్పడం కుదరదు, నిజంగానే మనసులోని భావం 'తెరవని తలుపుల' వెనుకే ఉండిపోతాయి..

"తెరవని తలుపులు", కాశీభట్ల వేణుగోపాల్..

తనకు నిమిత్తంలేని బాటలో ఏమరుపాటుగా జీవితాన్ని చివరిదాకా జీవించేసి, మృత్యువు ముంగిట తెప్పరిల్లి, చుట్టూ ఆవరించి ఉన్న తనదికాని జీవితాన్ని చూసుకుని బిత్తరపోయిన వ్యక్తి కథ ఇది. ఇక అప్పుడు కళ్ళెం పుచ్చుకుందామన్నా, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి ఉంటుంది. జీవితం, నడి సంద్రంలో చిల్లు పడ్డ నావ చందాన మిగిలిఉంటుంది. కథ సరిగ్గా ఈ మునక దశలో ప్రారంభమౌతుంది.

కథానాయకుడు యాభైరెండేళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. అతని చుట్టూ ఉన్న ఏ అనుబంధం ప్రేమ పునాదిగా ఏర్పడింది కాదు. భార్యా భర్తలిరువురూ "ఒకే చూరు క్రిందకొచ్చి చేరిన అపరిచిత కాందిశీకులు", తండ్రీ కొడుకులిరువురూ వైరి పక్షాల ఎదురుబొదురు శతఘ్నులు, సంఘంతో కూడా అతని ప్రతీ సంబంధం యాంత్రికమే. వీటికి తోడు వ్యసనాలతో తూట్లు పడ్డ శరీరం. అతని డాక్టర్ స్నేహితుడు, అతిగా పొగ త్రాగడం వల్ల అతని కాళ్ళు పుచ్చి పోయాయని (టి.ఒ.ఎ), యాంప్యుటేషన్ చేసి కాళ్ళు తీసేయక తప్పదనీ చెప్తాడు. మరుసటి రోజు ఆపరేషన్ అనగా, ముందు రోజు అతను విస్కీతో పాటు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇలా నవల ముగుస్తుంది. కానీ ఆ తర్వాత పాఠకుని మనఃప్రపంచంలో అంతర్మథనం మొదలవుతుంది. నవల చదువుతున్న క్రమంలోనే - అన్నీ ఉన్నట్టే ఉండి ఏమి లేనితనాన్ని, ఎవరూ లేని తనాన్ని చూసి పాఠకుడిలో ఒక దిగులు, విషాదం గూడు కట్టుకుంటాయి. చివరి అధ్యాయం 'ప్రశాంత శూన్యం ' దగ్గరకొచ్చేసరికి గుండెను బిగబట్టుకుని చదవాల్సి వస్తుంది. కానీ తప్పదు. ఆ విధంగా తప్ప మరో రకంగా చెప్పడం కుదరదు.నిన్ను నువ్వు తెలుసుకోవాలన్న తపనకు లోను చేసే నవల ఇది అంటూ నవల ముందు మాటలో 'గుడిపాటి' గారు చెప్పిన మాటలు అక్షరసత్యం .

నిజానికి కాశీభట్ల వేణుగోపాల్ రచనల్లో వేటికీ చెప్పుకోదగ్గ కథ ఉండదు. కానీ పాత్రల అంతశ్చేతనా ప్రవాహ తరంగాల్నియదార్ధంగా నమోదు చేయడంలోనూ, పాత్రలని ఆవరించి ఉన్న వాతావరణాన్ని సమగ్రంగా అక్షరీకరించడంలోనూ అతని ప్రతిభ, అతని రచనల్ని ఆసక్తిగా చదివేలా చేస్తుంది.ఇతని పుస్తకాలను మానసిక విశ్లేషణా రచనలుగా పరిగణించవచ్చు.


Comments

Post New Comment


vijay 09th Sep 2013 10:02:AM

this looks like a copypaste article...