పాత సామాన్లు కొంటాం.......

ప్రకటన

ఆమ్మబడును - ఒక Yamaha Rx 135 బండి

ఈ బండి కొనదల్చుకున్న వారు మద్రాసు రోడ్ల మీద తిరగ వలసిందిగా ప్రార్థన. రోడ్డుపక్కన ఒక yamaha Rx 135 స్టార్ట్ కాక అవస్థపడుతూ ఏవరైన కనిపిస్తే...అది నేనే. స్పాట్ లో బండి ఇవ్వబడును.

వెల - మీ సుఖశాంతులు
-----------------------------------------------------------------------

నా బండి కొని రెండేళ్ళు అయిపొయ్యింది. ఇప్పటిదాక ముప్పై సార్లు ఆఫీసుకు వేసుకెళ్ళుంటాను - అందులొ రెండు సార్లు కింద పడ్డాను, పది సార్లు దారిలొ ఆగిపొయి౦ది, మిగత పద్దెనిమిది సార్లు ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వలేదు - ఇదీ నా బండి ట్రాక్ రికార్డు.

దాన్ని నిరంతరం నడుపుతూనే ఉండాలి. ఒక్క పది నిముషాలు పార్క్ చెసినా స్టార్ట్ అవ్వదు. అటువంటిది... మూడు రోజులు ఊరిలో లేను..ఇవ్వాళ పొద్దున్నే దిగాను. స్టార్ట్ అయ్యే సమస్యే లేదని తెలిసు. కాని ...చూద్దాం....ఆఫీసుకు తయారయ్యి, దాన్ని శుభ్రంగా తుడిచాను.

పావుగంట కిక్కు కొట్టాను. చమటలు, కాలు నొప్పి. బండి మాత్రం స్టార్ట్ అవ్వలా. ఇంగ్లీషులొ "చచ్చాడు" అనటానికి "Kicked the bucket" అంటారట. సుద్ద తప్పు."Kicked Yamaha Rx 135" అనాలి.

ఆఫీసుకు లేటు అవుతొంది. ఇక లాభం లేదని ఆటో ఎక్కటానికి బయటకు నడిచాను. అక్కడ పాచి పళ్ళేసుకుని నవ్వుతూ ఆటో డ్రైవర్ గాడు నాకొసం కాచుకుని ఉన్నాడు. కావేరీ నదీ జలాల కేసు తమిళనాడు గెలిచిందిగా....చాల రోజుల తరువాత వీడు స్నానం చెసినట్టున్నాడు.

"ఎన్న సార్....వండి స్టార్ట్ ఆవ్లియా" అని అడిగాడు.దీనిని తెలుగు లొకి అనువదిస్తే - "దొరికావురా నాకు..ఇవ్వాళ నీకు గుండే" అని అర్థం.

వేరే గత్యంతరం లేక ఆటో ఎక్కాను.ఆ డ్రైవర్ గాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.వాడికి తెలుసు.. ఇంకో వారం రోజుల వరకు వెరే పార్టీ వెతుక్కోవలసిన పని లేదని...

యాభై నాలుగు వేల రూపాయలు - రెండేళ్ళ పాటు ఈ బండికి వాయిదాలు కట్టాను. తలుచుకుంటేనే కళ్ళలొంచి పెట్రోలు కారుతుంది. ఈ ఆటో డ్రైవర్ గాడికి ఇలాంటి కష్టం రాకపొతుందా...అప్పుడు నేనూ నవ్వక పొతానా...

కసి కొద్దీ వాడిని అడిగాను "ఎంతకు కొన్నవు ఈ ఆటొ?"
వాడు "మూడున్నర లక్షలు" అన్నాడు.
"ఎన్ని వాయిదాలు?" అని అడిగాను
వాడు నవ్వి ఊరుకున్నాడు....

అప్పుడు అర్థమయ్యింది...నేను ఎంత వెర్రి ప్రశ్న వెసానో అని.

మనలాంటి వాళ్ళము లోన్లు తీసుకుంటాము గానీ....మద్రాసు ఆటో డ్రైవర్లకు ఏంటి ఖర్మ? రాత్రి పూట రెండు ట్రిప్పులు వేస్తే ఒక ఆటో కొనెయ్యవచ్చు. ఒక నెల రోజులు నైట్ డ్యుటీ చేస్తే మన దేశం వరల్డ్ బ్యాంకుకు చేసిన అప్పు తీర్చెయ్యవచ్చు. మొన్నీమధ్య ఆటో డ్రైవర్ ల కాలనీ లొ Income Tax వాళ్ళు రైడు కూడ చెసారంట!  పేరు కు ఆటొ డ్రైవర్లు కానీ....వీళ్ళ ఆదాయం చూస్తే మన డిగ్రీలన్ని మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాయి.

మా ఆఫీసు ముందు ఆటో బ్రేకు వెయ్యగానే బాధాకరమైన ఆ ఆలొచనల్లోంచి ఈ లోకం లొకి వచ్చాను. ఆ ఆటో వాడికి ఒక పది పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఆఫీసులోకి వెళ్ళాను. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీసు కారు ఉండటంతొ నా పర్సు కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఇంటికి చేరగానే బయట నా బండి కనిపించింది. కోపం పట్టలేక వెనక టైరు మీద లాగి కొట్టాను."సరే...రేపు పొద్దున వస్తావుగా" అన్నట్టు చూసింది నన్ను.

దీన్ని అమ్మటానికి మనసు ఒప్పదు...అమ్మి ఇంకొకడి గొంతు కోసిన పాపం ఎందుకని.

కేవలం నేను ఉన్నాను అన్న ధైర్యంతొ మా ఆటో దరిద్రుడు వాడి బండికి credit card swiping machine కూడా పెట్టించాడు.

రేపు కూడా బండి స్టార్ట్ కాకపొతే....నేను ఉద్యొగం మానేసి ఒక ఆటో కొనుక్కుంటాను.

వంశీ గనక ఇప్పుడు "చెట్టు కింద ప్లీడరు" సినిమా మళ్ళీ తీస్తే.. అందులొ ఆ కారుకు బదులు తప్పకుండ నా బండే వాడతాడు.

పాత సామాన్లు కొంటాం.......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!