లైఫ్ కోచింగ్...వేణుభగవాన్ (venubhagavan...fire)

వేణు భగవాన్ గారి 'ఫైర్ ' విడుదలైన సంవత్సరంలోనే మూడవ ముద్రణ గావింపబడింది, ఈ పుస్తకం చదివిన ప్రతీ ఒక్కరికి అది తనకోసమే వ్రాయబడిందేమో అని మనసుకు అనిపించడం వలననే ఈ పుస్తకానికి పాఠకులనుండి  ఇంత ఆదరణ.. ప్రతీ ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుందంటారు వేణు గారు, ఆ ప్రత్యేకత గుర్తిన్చినపుడే మీ యొక్క అభివృద్ధి సాధ్యం అని నమ్మే వేణు గారు తనవంతు చేయుతగా సమాజానికి అందించిన విలువైన పుస్తకం...ఫైర్(fire).

మనకు అవసరమైన ప్రతీ విషయాన్ని మనమే ప్రారంభం నుంచీ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే దానికి మన జీవితం సరిపోదు. మన లక్ష్య సాధనలో విజయవంతం కావాలంటే, మనకు కావలసిన సామర్ద్యాలను అప్పటికే ఎంతో శ్రమించి నేర్చుకుని ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.- బ్రియాన్ ట్రేసీ..మోటివేషనల్ స్పీకర్,రచయిత.

ఏ ఆటలో అయినా చాంపియన్ అవ్వాలంటే ఒక కోచ్ అవసరం. జీవితంలో ఏ పని చేసినా, ఒక ఆటలా సాగాలనుకుంటే మనకూ ఒక లైఫ్ కోచ్ అవసరం. ఈ రోజు మన తప్పులనుంచి, చెడు అనుభవాలనుంచి నేర్చుకునేంత సమయం లేదు. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది తెలివైన పని. ఆటగాడు సిద్దంగా ఉన్నపుడే కోచ్ ఏమైనా చేయగలడు. మార్పుకు సంసిద్దంగా ఉండడం, చేస్తున్నది సరైనది కాదు అని తెలిసినప్పుడు సరిదిద్దుకోవడం, మార్పుకు నాంది పలుకుతాయి.

ఒక రైతు విత్తనాలను వెదజల్లాడు. ఆ విత్తనాలు కొన్ని రహదారి ప్రక్కన బడ్డాయి. వాటిని పక్షులు తినేశాయి. కొన్ని బండలపై పడ్డాయి. అవి ఎండకు వాడిపోయి ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు ఆ విత్తనాలను ఎదగకుండా చేసాయి. కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడ్డాయి. అవి మాత్రం చక్కగా పుష్పించి, ఫలించి వందల వేల రెట్లుగా మళ్ళీ విత్తనాల నిచ్చాయి. -జీసస్

విత్తనం ఎంత గొప్పదైనా, సారవంతమైన, నేల కూడా ఉన్నపుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది. మహా వృక్షమవుతుంది. సందేహం, అపనమ్మకాల్ని సంపూర్ణంగా అధిగమించి విశ్వాసం రాజ్యమేలే చోట అద్బుతాలు ఆవిష్కరింపబడుతాయి. మనలో చాలా మంది మన అంతరంగం వైపు ఎప్పుడూ దృష్టి మరల్చం. జీవితం అన్నది బయటి నుండి లోపలి కాదు, లోపలి నుండి బయటకు వికసించేది. విత్తనం వేరుగా మారి, లోతుకు ప్రయాణం చేసి, ఎత్తుగా పెరుగుతుంది. వేర్లు లోతుగా ఉన్న వృక్షం పెను గాలులకు సైతం ఊగుతూ నృత్యం చేస్తుంది. లోతుగా లేని చెట్లు పిల్ల గాలులకే నేలకొరుగుతాయి.

ఒకరోజు ఒక వ్యక్తి నడుస్తూ వెళుతుండగా, ఇంతలో ఒక భిక్షగాడు ధర్మం బాబు! అని అడిగాడు దానికాయన, నాదగ్గర నీకివ్వడానికి ఏమి లేదు నాయనా! అంటూ, నువ్వు కూర్చున్నావు చూడు.. అది ఏమిటి? అని అడిగాడు, ఏం లేదండి, పాత పెట్టె! అని సమాధాన మిచ్చాడు! ఎప్పట్నించో ఆ పెట్టె మీద కూర్చొనే యిలా అడుక్కుంటున్నానని  కూడా చెప్పాడు. దాని లోపలేముందో చూసావా?....చూడలేదు గానీ దాంట్లో ఏమీ ఉండదు సార్! అన్నాడు భిక్షగాడు. ఒకసారి లోపలేముందో సరిగ్గా చూడు! అన్నాడు. ఆ వ్యక్తి ఇష్టం లేకపోయినా, ఆ పెట్టె తెరిచాడు.

నమ్మలేనంత ఆశ్చర్యంతో ఆతను ఉబ్బితబ్బిబ్బయిపోయేంతగా, ఆ పెట్టెలోపల అరల్లో బంగారం నింపి ఉంది! నేను కూడా మిమ్మల్ని లోపలికి తొంగిచూడండి! అని చెప్పే ఆ వ్యక్తిలాంటి వాడినే! అయితే ఆ కథలోలా పెట్టెలోకి చూడమనను అంతకంటే సమీపంలోని మీ అంతరంగంలోకి చూడమంటాను.

మనలో జ్ఞానానికి సంబంధించి మూడు విభాగాలుంటాయి. అవి
1. మీకు తెలుసని మీకు తెలిసిన విషయాలు.
2. మీకు తెలియదని మీకు తెలిసిన విషయాలు
3. మీకు తెలియదని కూడా మీకు తెలియని విషయాలు.
ఈ మూడువ విభాగపు జ్ఞానమే మనందరిలో  నిగూడంగా ఉన్న ప్రత్యేక జ్ఞానము. ఇదే వేలికితీయని బంగారు గని. ప్రతి ఒక్కరినీ ఒక ప్రత్యేక వ్యక్తిని చేసే బ్రహ్మాస్త్రం. సహజవనరుల కోసం జరిగే తవ్వకాలలో ఒక భాండాగారం బయటపడినప్పుడు వచ్చే ఆనందం, మనిషికి తనలోని నిధి దొరికినప్పుడు కలుగుతుంది.
సహజ వనరుల కోసం జరిపే తవ్వకాలలో చాలా చోట్ల ఆయిల్, గ్యాస్ పడవచ్చు కానీ అక్కడ ఉన్న నిక్షేపాన్ని వేలికి తీయడానికి పెట్టె నిర్వహణ ఖర్చులు కన్నా ఎన్నో రెట్లు లాభాదాయకమైనప్పుడే అక్కడ రిఫైనరీ కడతారు లేదా ఆ బావిని మూసేస్తారు. అలాగే మీకు కూడా రిలయన్స్ కి కె.జి. బేసిన్ పడినట్టుగా ఒక పుష్కలమైన మేథోగని దొరకాలని చేసే ప్రయత్నానికి ఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిస్తున్నాను.

ఏది నమ్మకండి, ఎక్కడ చదివినా సరే, ఎవరు చెప్పినా సరే, ఆఖరుకు నేను చెప్పినా సరే, అది మీ తర్కానికి, మీ లోక జ్ఞానానికి అంగీకారముంటే తప్ప, - గౌతమ బుద్దా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!