విద్య యొక్క లక్ష్యం అంతా ప్రతి వ్యక్తినీ ఒక క్యారెక్టర్ గల ఒక మానవ వనరుగా తీర్చిదిద్దడమే. ఎడ్యుకేషన్ అంటే ప్రాధమికంగా విలువలు నేర్పించడమే. కానీ నేడు విలువలు గురించి మాట్లాడడమే ఒక బోరింగ్ సబ్జెక్టు అయిపొయింది.
మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించిన ప్రఖ్యాత డెవలప్ మెంటల్ సైకాలజిస్ట్, హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రొఫెసర్, ఎడ్యుకేషన్ రంగంలో రాక్ స్టార్ గా పిలవబడే హావర్డ్ గార్డెనర్ 21 వ శతాబ్దంలో డెవలప్ చేయాల్సిన 5 మైండ్స్ గురించి వివరించారు. తను కనుక చక్రవర్తి అయితే, విద్యా విధానంలో ఈ 5 మైండ్స్ డెవలప్ చేయడాన్ని నిర్దేశిస్తానని తెలిపారు.
భవిష్యత్తులో జెనెటిక్ రివల్యూషన్ (జన్యుపరమైన విప్లవం) ఎంత రాబోతుందంటే, పిల్లలు తమ మొత్తం జన్యు సముదాయం జినోమ్ (genome) కలిగిన జీన్ చిప్ పట్టుకు వెళ్లి, టీచర్లు, అధికారులతో ఇదిగో నా జీన్స్ లో ఇవి ఏక్టివ్ గా ఉన్నాయి. ఇవి లేవు, మీరు నాకు ఎఫెక్టివ్ గా పాఠాలు చెప్పండి, అని కస్టమర్ సర్వీస్ కోసం డిమాండ్ చేసినట్టు నిలదీయవచ్చట. నేడు కంప్యూటర్ ఎడ్యూకేషన్ లో కానీ, ఎలక్రానిక్ వస్తువుల వినియోగంలో కానీ పిల్లలు పెద్దలకంటే ముందున్నారు. మరి ఈ సమయంలో పిల్లలు పెద్దలకి ఇవ్వాల్సిందేమిటి ? పెద్దలు పిల్లలకివ్వాల్సిందేమిటి అన్న విషయంలో ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. మరి ఈ సందర్బంలో పిల్లలు నాయకులుగా, మేధావులుగా ఎదగడానికి పిల్లల్లో అభివృద్ధి చేయాల్సిన హావర్డ్ గార్డ్ నర్ చెప్పిన 5 మైండ్స్ గురించి తెలుసుకుందాం.
పిల్లల్లో వృద్ది చేయాల్సిన 5 రకాల మైండ్స్ ...:
The Disciplined Mind (క్రమశిక్షణ కల మైండ్) :
ముందు మన పూర్వికులు ఏది మాస్టర్ చేసారో అది తెలుసుకోవాలి. దాని గురించి నిరంతరం అన్వేషించాలి. సాధన చేయాలి. ఏ సాధనైనా మనిషిని మాస్టర్ చేస్తుంది. రెండవది, యూనివర్సీటీకి వెళ్ళకముందు స్కూలులో 'ఆలోచించే విధానాన్ని' మాస్టర్ చేయాలి, సైన్స్, హిస్టరీ, గణితం, ఒకటి లేదా ఎక్కువ ఆర్ట్, లైఫ్ సైన్సెస్ యందు మాస్టరీ సంపాదించాలి.
క్రమశిక్షణకు, బట్టీ పట్టడానికి మధ్యన విభేదాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలి....క్రమశిక్షణ అంటే మెమరీ కాదు. ఒక సబ్జెక్టును పూర్తిగా అర్ధం చేసుకుని అక్కడ నుండి ఆలోచించడం. ఏదో ఒక రంగంలో పిల్లలు నిష్ణాతులుగా ఎదగకపోతే భవిష్యత్ లో నిష్ణాతుల వద్ద సహాయకులుగా పనిచేయాల్సి ఉంటుంది.
నేడు నాలెడ్జ్ యుగంలో క్రియేటివ్ జీనియస్ ఉన్నవారే భవిష్యత్ లో రాణిస్తారు. ఏ రాజు ఏ రాణిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరికీ సమాధి కట్టాడు? సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? పలానా సంఘటన ఏ సం''లో జరిగింది? అని మాత్రమే తెలుసుకుంటే మన భవిష్యత్ కి మనమే సమాధి కట్టుకుంటాం. క్రమశిక్షణ అంటే విషయాలను మెమరైజ్ చేయడం కాదు. క్రమశిక్షణ గల మైండ్ అంటే ఒక శాస్త్రవేత్త, ఒక చరిత్రకారుడు, ఒక కళాకారుడు తన ప్రతిరోజునూ ఎలా గడుపుతాడో అలా గడపటం.
ప్రపంచీకరణ వలన వచ్చిన నాలుగు మార్పులను ఇక్కడ చూద్దాం..
పుస్తకాలు రాకముందు జ్ఞాపక శక్తి ప్రశంసించబడింది. ఈ రోజు కంప్యూటర్ మెమరీ ఎక్కువ ఉంది కనుక మనిషి అనవసరమైనవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గింది.
ఈ క్రమశిక్షణ కల మైండుని ఎలా సాధించాలి?
The Synthesizing Mind (మిశ్రమ మైండ్).....
లక్ష కోట్ల అణువులు ఏదో విధంగా తమను తాము సమైక్యంగా కూర్చుకొని, గూడు పుఠానీ చేసుకుని, ఉపకారం చేయడానికి బద్దుడైన తీరులో కలిస్తే మనం సృష్టించబడ్డాము. అలాగే తానూ తెలుసుకున్న విషయాలనన్నీ ఏకతాటిపై సమకూర్చగలిగినప్పుడే నూతన సృష్టికి నాంది పలకగలుగుతాము. ఉదాహరణకు ఈ పుస్తకం ఎక్కడో, ఎప్పుడో, ఏ సందర్బంలోనో చదివినవి, విన్నవి, ఆలోచించినవి, మదిలో తట్టినవి, చూసి పరిశీలించిన ఎన్నో సమ్మేళనాల ఫలితం. ఇలా ఏ రంగంలో అయినా నేర్చుకున్న విషయాలనన్నిటినీ సమైక్యపరిచే ఆలోచనా విధానమే సింథసైజింగ్ మైండ్.
ఉదాహరణకు ఒక విద్యా సంస్థ ప్రారంభించాలంటే ఆ యాజమాన్యం ఒక పది స్కూళ్ళను సందర్శించవచ్చు. ఎన్నో రకాల విద్యా విధానాలను పరిశీలించి ఉండవచ్చు. గురుకులాల వంటివాటి నుండి, పూర్తి స్వేఛ్చ నిచ్చే కాన్సెప్ట్ స్కూళ్ళ నుండి, అతిగా చదువు చెప్పే కార్పోరేట్ స్కూళ్ళ నుండీ ఇలా ఒక్కొక్కరి నుండీ ఒక విశిష్టతను తెలుసుకుని, వీటన్నిటినీ సమన్వయపరచి, భవిష్యత్, సృజనాత్మకత ప్రాతిపదికగా ఒక విధానాన్ని సృష్టించుకునే తెలివితేటలే సింథసిస్ మైండ్ అంటే... అందరూ చేస్తున్నది ఇదే అయినా, ఇలా ఆలోచించడం నేర్పడం ముఖ్యం అని గార్డెనర్ అంటారు.
The Creative Mind (సృజనాత్మక మైండ్)
మనలో అందరికీ వచ్చే ఒక సదేహం. క్రియేటివ్ గా ఉండాలంటే ఏం చేయాలి? గార్డెనర్ ఏమంటారంటే క్రియేటివ్ గా తయారుచేయడం కంటే సృజనాత్మకత పోగొట్టకుండా చేయడం సులభం. ఒక ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పినా, కొత్తగా రాసినా ఉన్నది ఉన్నట్టు రాయలేదని శిక్షించకపోతే క్రియేటివిటీ బతికి బట్టకడుతుంది.
ఎవరైనా నేను క్రియేటివ్ వ్యక్తిని అని చెప్పుకున్నంత మాత్రానా క్రియేటివ్ అయిపోడు. చాలా కాలం ఎవరైనా తమ క్రియేటివ్ వర్క్ ద్వారా ఇతరుల ఆలోచన, ప్రవర్తన మార్చగలిగితే వారిని క్రియేటివ్ అనవచ్చు. సాధారణంగా యాడ్ ఏజెన్సీలు, సినిమా రంగం, ఫాషన్ డిజైనింగ్ వంటివి క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్పుకుంటారు. అయితే ఏ రంగంలో అయినా క్రియేటివిటీని వ్యక్తీకరించవచ్చు. ఎవరైనా క్రియేటివ్ వ్యక్తా అని తెలియడానికి ఇక్కడ ఒక ఏసిడ్ టెస్ట్ ఉంది.
ఒకవేళ మీరు ఇలా ఉన్నా లేకపోయినా మీ పిల్లలు అలా ఒక రంగంలో గుర్తింపు పొందితే ఎలా ఉంటుంది? రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ గుర్తింపు రావడానికి సులభ మార్గం సృజనాత్మకత మైండ్ ను ప్రోత్సహించడమే. అయితే ఏ సమాజం కూడా పూర్తిగా సృజనాత్మకత కలిగినవారితో నిర్మితమవ్వదు, ఎందకంటే సృజనాత్మకత అధికంగా కలిగినవారు స్థిరంగా ఉండరు. వాళ్ళు సహజంగా ఒక దానికి అతుక్కుని ఉండలేరు. చేసిందే మళ్ళీ మళ్ళీ అసలు చేయలేరు.అయితే ఈ మద్యే తెలిసిందేమిటంటే ఐకమత్యంగా కలిసి కూడా అద్బుతమైన క్రియేటివ్ వర్క్ చేయగలరని, ఒక ప్రాజెక్ట్, ఈవెంట్ పట్ల అందరూ ప్రేరణ పొందినట్లయితే, ఒకటే విజన్ అందరూ చూడగలిగితే ఎన్నో అణువులు చేరి మనం తయారయినట్లుగానే, ఒక అద్బుతమైన ఈవెంట్ ఉత్పత్తి ఆవిర్బవించవచ్చు.
The Respectful Mind (వినయముగల మైండ్)
మనం ఒకరినొకరు గౌరవించుకుంటేనే మనుగడ, అభివృద్ధి సాధించగలం. మన దేశాన్ని మనం ఎంత ప్రేమిస్తామో పొరుగు దేశాన్ని కూడా అంతగా ఒకరినొకరు ప్రేమించుకునే రోజులు వస్తేనే దేశంలో శాంతి. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోదృక్కోణం నుండీ ఆలోచిస్తారు. ఎవరిదీ మరొకరితో సరిపోలదు కనుక అందరి దృక్కోణాన్ని గౌరవించడం నేర్చుకోగలగాలి. ఒకవేళ అభిప్రాయభేదాలున్నా, మాకు భిన్నాభిప్రాయాలున్నాయి అనే విషయంలో ఏకాభిప్రాయం రావాలి. స్నేహం చేసేవారందరితో మన అభిప్రాయాలన్నీ కలవాల్సిన అవసరం లేదు కదా!
ఆటవిక జాతులు యుద్దాలు చేసుకునేవి. బలవంతులదే రాజ్యం అయ్యేది. బలహీనులు ఇతరుల నిరంకుశత్వాన్ని భరించేవారు. నేడు రెండూ అవసరం లేదు. ఒకరిపై ఒకరు ఆధారపడే విధంగా ప్రపంచం ఉండటం అభివృద్దికీ, శాంతికి దారితీస్తుంది.
పిల్లలకు ఈ గౌరవించుకునే సంస్కృతి నేర్పించాలి. మనుషులను, ప్రకృతిని, పశుపక్ష్యాదులను గౌరవించి, కృతజ్ఞతగా ఉండటం నేర్పించాలి, మన వద్ద పనిచేసేవారిని, మనం ఎంత గౌరవిస్తామో చూసి పిల్లలు నేర్చుకుంటారు.
మనం ఏదైనా స్కూలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉందా? పాతకాలపు భయపెట్టి చదివించే విధానం ఉందా అన్నది కొద్ది సేపు టీచర్లు, విద్యార్థులు, ఉద్యోగులతో మాట్లాడితే తెలిసిపోతుంది. పిల్లలను వారి స్థోమత బట్టి, మార్కులను (గ్రేడింగ్) బట్టి కాక వారిని వారుగా గౌరవించగలిగితే ప్రతి పిల్లవాడు బాధ్యతగల పౌరుడే అవుతాడు.
The Ethical Mind (నీతిగల మైండ్)
విలువలు, నీతి నియమాలు కల మైండ్ డెవలప్ చేయడం అత్యంత ఆవశ్యకం. అన్ని మైండ్స్ డెవలప్ అయినా ఎథికల్ మైండ్ డెవలప్ అవకపోతే అది సమాజానికి హానిచేస్తుంది. పీటర్ డ్రకర్ చెప్పినట్లు మేనేజ్ మెంట్ అంటే పనులను సరిగా చేయడం. లీడర్ షిప్ అంటే సరైన పనులను చేయడం. అత్యంత ఉన్నత చదువులు చదివినా, ఈ మైండ్ డెవలప్ కాకపొతే అది దేశానికి, సమాజంకి అత్యంత ప్రమాదకరం. మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడూ ఏది సరైనది, ఏది కాదు అనే విషయంలో దిక్సూచిలా గైడ్ చేస్తుంటుంది. అయితే మనిషి వినడం మానేస్తే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో దానికి మాత్రమే మనం బాధ్యులం కాము, ఏం చేయట్లేదో దానికి కూడా మనం బాధ్యులమే. కనుక పిల్లలకు ప్రతీ సారీ మంచి చెడుల గురించి వివరించడమే కాక అలా జీవించి చూపాలి. మనిషి గౌరవం సంపాదించుకోవాలన్నా, తలెత్తుకుని తిరగాలన్నా, పది మందికి మంచి చేయాలన్నా ఈ ఎథికల్ మైండ్ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆ వ్యక్తికి శోభనిస్తుంది. మనిషి యొక్క విలువలు వైఖరిని, వైఖరి ..ప్రవర్తనను, ప్రవర్తన ఫలితాలను శాసిస్తాయి.
ఈ 5 మైండ్స్ గురించి ఒకసారి చూద్దాం...
ఈ 5 రకాల మనస్సులను అభివృద్ధి చేయడం విద్యాలయాలు, తల్లిదండ్రులు చేసినప్పుడే ఒక గొప్ప సమాజం ఆవిష్కరించబడుతుంది.