యండమూరి వీరేంద్రనాథ్ స్పెషల్ ఇంటర్వ్యూ.....

ఇది తన సీరియల్ 'డేగ రెక్కల చప్పుడు 'మొదలయ్యే ముందు వచ్చిన ఇంటర్వ్యూ.. ఈ ఇంటర్వ్యూఆగస్ట్ 9 న 2010 'పూడూరి రాజిరెడ్డి' గారు చేసినది.. యండమూరి మనోభావాలు అందరితో పంచుకోవాలనే అభిప్రాయంతో ఇక్కడ ఇలా మీ ముందుకు...

"ఒక వ్యక్తి తనకు తాను సంతృప్తిగా ఏమేం చేయొచ్చో నేను రాస్తాను" అంటారు యండమూరి వీరేంద్రనాథ్, దానికి భిన్నంగా వ్రాసింది, ఎంత వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించినప్పటికీ దాని వల్ల ప్రయోజనం శూన్యం అన్న గొంతుతో, దీన్నీ మనం అంగీకరించాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ తెలుగులో 'మోస్ట్ పాపులర్ రైటర్' ట్యాగును ఆయన ఎంజాయ్ చేసారు. ఈ ట్యాగ్ రావడానికి, అక్షరాల వెంట కళ్ళను పరుగులెత్తించే ఆయన శైలి కారణం కావొచ్చు. ఆయన చెప్పిన మార్గంలో విజయం అనే నిధి దొరుకుతుందనుకున్న పాఠకులు  కొల్లలుగా ఉండడం కావొచ్చు. ఏదేమైనా యండమూరిని చదవడం ఓ స్వీట్ ఎక్స్ పీరియన్స్ ఏ బస్ స్టాండు లోని బుక్స్ స్టాల్లోనో ఎవరో ఒకరు 'వీరేన్' పుస్తకం పేజీలు తిప్పడం సర్వసాధారణం. ఈర్ష్య పడగలిగే సెలబ్రేటి.

'డేగ రెక్కల చప్పుడు' సీరియల్ 'ఫన్ డే' లో ప్రారంభమవుతున్న సందర్భంగా ఇంటర్వ్యూ చేయడానికి ఓ సాయంత్రం ఆయన ఇంటికి వెళితే. షార్ట్ టీ షర్టు తో యంగ్ గా కనిపించారు. బాల్కనిలో కూర్చోడానికి వచ్చే ముందు ఆయన వాడని గదిలోని లైట్ ఆపేసి మరీ వచ్చారు.

తర్వాత 62 ఏళ్ల వీరేంద్రనాథ్ తో సంభాషణ ప్రారంభమైంది. దాని సారాంశం ఇదీ.


మొదటిప్రశ్నగా ఇది అడగటం కరెక్ట్ కాకపోవచ్చు. అయినా అడుగుతున్నా మీరు ఆస్తికులా? నాస్తికులా?
రెండూ కాదు, వీటికి మధ్యన బౌద్ధం అనుకోవచ్చు.

అంటే..?
విగ్రహారాధన చేయకపోవడం, దేవుడి పేరుతో వ్యాపారం చేయకపోవడం ఇలా ఉంటె నాకు నచ్చుతుంది.

కానీ మీ ముందట సరస్వతి విగ్రహం ఉన్నట్టుంది..?
అది ఆహ్లాదం కోసం. ప్రపంచంలో అంత్యంత అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది గుడి. ఏ ఆలయమైనా అందులో ఉండే 'కళ' నాకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఒక వేణువు ఊదుతుంటే ఉండేలాంటి హాయి....

ఇలా చెప్పిన వాళ్ళు 'ఒక వయసు' కొచ్చాక మళ్ళీ అటువైపే మళ్ళారు..?
నేనయితే ఖచ్చితంగా పోను, ఒకవేళ పోయినా దేవుణ్ణి నా స్నేహితుడు అనుకుంటాను తప్ప, ఇదివ్వు అని కోరను.

మీకు ఇంత 'రేర్' పేరు ఎవరు పెట్టారు...
మా నాన్న (చక్రపాణి) పోయెట్ కదా, బెంగాలి ప్రభావం. మా ముగ్గురి తమ్ముళ్ళకూ ఇలాగే ఉంటుంది. రాజేంద్రనాథ్, అమరేంద్రనాథ్, మణేంద్రనాథ్

మీరు మొట్టమొదటగా రాసిన క్రియేటివ్ పీస్ ఏమిటో గుర్తుందా..?
ఉంది. 'చెల్లు' అనే కథ 'చందమామ'లో వచ్చింది. బీ.కాం. ఫైనల్ ఇయర్ లో ఉన్నా లేటరల్ థింకింగ్ మీద వ్రాసాను. ఓ బిచ్చగాడు నాకు దొరికేదాన్లో సగం దేవుడికి ఇస్తానని మొక్కుకుంటాడు. రెండువందల వరహాలు వస్తాయి. కానీ వాటా ఇవ్వడు. దాంతో గిల్టీగా  ఫీలవుతాడు. ఈసారి దొరికిన దాంట్లో ఖచ్చితంగా సగం ఇస్తానంటాడు. కానీ ఆ రోజు ఏమి దొరకదు. అంటే, నిన్నటిది ఇవ్వల్టిది దేవుడే ఉంచేసుకున్నాడనుకొని సమాధానపడతాడు.

మీరు కంప్యూటర్ బాగా వాడుతారు.. అయినా స్క్రిప్ట్ చేత్తో రాస్తున్నారు..?
టైపు అలవాటు కాలేదు......

మీ స్వభావానికి టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకోవాలి కదా....
గేదపాలని చేత్తో పితికే అలవాటు ఉన్నవాడికి  మిషన్ ఇస్తే తృప్తి ఉండదు. నాదీ అంతే..ఇది నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడమే అనుకోండి...అయినా చేతితో వ్రాస్తుంటే తరవాతి అక్షరం ఫ్రేమ్ అవుతుంటుంది. అది టైపులో జరగదు.

కానీ మార్చాలనుకున్నపుడు సమస్య అవుతుంది కదా..?
అందుకేగా రెండు మూడు వర్షన్స్ రాస్తూ ఉంటాను. ఒకోసారి ఇలా మళ్ళి మళ్లి రాస్తుంటే కూడా స్టొరీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది.

అసలు ప్లాన్ ఎలా వేసుకుంటారు?
అమ్మాయిని అబ్బాయి ప్రేమించాలి...ఇది ముందు అవుట్ లైన్, అందులోకి ఏమేం చేయొచ్చో ఒక్కో పాయింట్ అనుకుంటూ దాని చుట్టూ డ్రామా అల్లుతూ పోతాను.

రాయాలనుకున్నది రాశారా? 'ఇది చదువుతారు' అనుకొని, అది  రాశారా ?
రెండు రకాలుగా రాశాను. 'ఆనందోబ్రహ్మ', 'ప్రేమ' లాంటివి నాకోసం రాసుకున్నవి. ఆనందోబ్రహ్మకు తరవాత పేరొచ్చింది కానీ సీరియల్ గా అది ఫెయిల్యూర్. అలాగే, రుద్రనేత్ర, ఆఖరిపోరాటం, తులసిదళం, వెన్నెల్లో ఆడపిల్ల...ఇలాంటివన్నీ డబ్బులొస్తాయి కాబట్టి రాసినవి.

బాగా అమ్ముడుపోయిన నవల?
వెన్నెల్లో ఆడపిల్ల 24 ఎడిషన్లు వచ్చింది. 80,000 కాపీలు అనుకుంటా.

నాన్ ఫిక్షన్ లో 'విజయానికి ఇదుమెట్లు' ?
అవును. రెండు లక్షలు..

'ఓన్లీ రైటర్' అనిపించుకున్నారు, దాన్ని మీరు అంగీకరించా(స్తా)రా ?
'భూమి'కి రాస్తున్నపుడు మార్కెటింగ్ కోసం అనేవారలా. నాకేం పట్టింపులేదు. నాట్ ఓన్లీ రైటర్ అన్న అభ్యంతరం లేదు.

సెలబ్రిటీ స్టేటస్ పొందగలిగిన మీకు, తెలుగు సాహిత్యంలో చోటు ఉన్నట్టు కనపడదు. మీ పేరు ఉటంకించటానికి విమర్శకులు పెద్దగా ఆశక్తి చూపరు. చూపితేగనక అది విమర్శించడానికే. దాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు..?
సెలబ్రిటీ అన్నమాట తప్పు. శ్రీ.శ్రీ, రావి.శాస్త్రి .. అలాంటివాళ్ళు సెలబ్రిటీలు. రాయడం ద్వారా ఐశ్వర్యవంతుడైన రచయిత అనండి నన్ను, ఇక విమర్శ అంటారా? వాళ్ళు పొందలేనిది నేను పొందగలిగాను కాబట్టి ఈర్ష్య, అంతే! నేను రాసింది పాపులర్ సాహిత్యం అంటారు. పాలేరు భార్యను కామందు అత్యాచారం చేస్తే పాలేరు ఏమి చేశాడనేది రాయడం సీరియస్ సాహిత్యం! దీనివల్ల ఏంటి ప్రయోజనం.

వాస్తవ జీవితాన్ని చిత్రించడమే కదా సాహిత్యం చేయాల్సింది ..?
కానీ ఏంటి దానివల్ల లాభం? నేనయితే ఏమి రాస్తానంటే, నీ దగ్గర 100 రూపాయలుంటే 20 ఎలా పోదుపుచేసుకోవచ్చో రాస్తాను, మీ రిలేషన్ షిప్స్ ఎలా బాగుచేసుకోవచ్చో చెపుతాను.

మీ అభిమాన రచయితలు?
బుచ్చిబాబు, కుటుంబరావు, కృష్ణశాస్త్రి, తిలక్, విశ్వనాధ.. అంటే వీళ్ళు వ్రాసిన ప్రతీది నచ్చుతుందని కాదు. అలాగే, ఆర్ధన్ హేలీ, ఇర్వింగ్ వాలెస్... ఇంకా, స్టీవెన్ కోవే, పాలో కోయిలోనూ కూడా ఇష్టంగా చదివాను కానీ రాసిందే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారని వదిలేశాను.

మీమీద అయన్ ర్యాండ్ ప్రభావం ఎంత?
నాకు దగ్గరగా ఉంది కాబట్టే ఆమె రైటింగ్స్ నచ్చాయి. అలాగని ఆమెతో పూర్తిగా ఏకీభవిస్తానని కాదు..

మీరు వ్రాసిన వాటిల్లో బెస్ట్ - 5 ...?
అంతర్ముఖం, మైండ్ పవర్, నెంబర్ 1. అవడం ఎలా?. తప్పు చేద్దాం రండి,  ప్రేమ, వీళ్ళనేం చేద్దాం?

జాబితాలో ఆనందోబ్రహ్మ లేదా?
అందులో 'క్రాఫ్ట్' మెచ్యూరిటీ లేదు.

మీ 'ఋషి' నో 'పర్ణశాల' నో మళ్ళీ ఎంతకాలం క్రింద చదువుకున్నారు?
చదవను. చదివితే దుఖం కలుగుతుంది ఇంకా బాగా రాయొచ్చనిపిస్తుంది.

రైటర్స్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు కదా! ఏమైనా ఫ్రస్టేషన్..?
పాపులారిటీ మాంగర్స్ లో నేను ఒకణ్ణి. కధలు, నాటికలు, నవలలు, సినిమాలు, అది కాకపొతే సీరియళ్ళు లేకపోతె టివి షోలు...ఏదో విధంగా నేను జనాలకు కనపడాలనుకుంటాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి కవర్ అయిపోతుంది.

ఏదో రకంగా కనబడడం ఎందుకు..?
ఆత్మనూన్యతాభావం ప్లస్ ఐడెంటిటీ క్రైసిస్ ....ఇవి ఉన్నవాళ్ళే ఇలా చేస్తారు..

ఇన్ని జయించమని చెప్పిన మీరు కూడా జయించలేక పోతున్నారా?
నేను జయించాను అనుకుంటే ఇపుడు నేను ఏమి చేస్తాను. ఖాళీగా ఉంటాను.. ఒక విధంగా ఇది మేలే చేస్తుంది కదా..

మీ స్వీయ క్షురకర్మ నియమాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారా?
ఆ..భేషుగ్గా..ఇదిగో..(జుట్టును చూపిస్తూ) తెలియట్లేదా? ఎత్తులూ పల్లాలు..

ఖాళీసమయం అంటే, ఏమిటి మీ దృష్టిలో? దాన్ని ఎలా గడుపుతారు?
రిలాక్స్ అవడమనేగా మీ ఉద్దేశ్యం..క్రికెట్ చూస్తా..

ప్రొడక్టివిటీ/సమయాన్ని ఊరికే వృథా చేయడం అని రాస్తారు..?
40 ఏళ్లకు చేరువైన సచిన్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే మనమూ ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో కదా అని ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది.

గెలవాలి, విజయం సాధించాలి అంటారు. మనిషికో ప్రత్యేక లక్ష్యం లేకపోతే ఏమైంది, వాళ్ళు చేస్తున్న పనులతో వాళ్ళు ఆనందంగా ఉన్నపుడు..?
పదింటికి, ఆఫీసుకి వెళ్ళిపోయి ఐదింటికి తిరిగొచ్చి, సిటీ బస్సులో ఫ్యామిలీని తీసుకెళ్ళి జూ చూపించి, వచ్చాక 'నీ మొగుడు నా మొగుడు' సీరియల్ చూసి, ముసుగు తన్ని నిద్రపోయేవాళ్ళు తమకు తాము సంతోషంగా ఉంటే నాకు ఏ కంప్లెయింట్ లేదు. కానీ బస్సులో ఉన్నపుడు స్కూటర్ వాణ్ని, స్కూటర్ మీద వెళుతూ కారువాణ్ని చూసి ఏడవొద్దు. అది కావాలంటే ఇంకా పనిచెయ్, సంపాదించు.

ఒక్కమాటలో  విజయం అంటే..?
రేపూ ఇంతే ఆనందంగా ఉండగలగడం...

ఓటమి...?
తనతో తన సంబంధం సరిగా ఉండకపోవడం..

దర్శకుడిగా మీరు ఫేయిలయినట్టు అంగీకరిస్తారా..?
అవును. నేను దానికి పనికిరాను అని అర్ధమైపోయింది. 'స్టువర్టుపురం పోలిస్ స్టేషన్' చివరి రోజు షూటింగ్ కు  కూడా వెళ్ళలేదు. దర్శకుడికి చాలా ఓపిక కావాలి. సూర్యుడు అస్తమించాడు అని ఒక వాక్యం రాసేసుకోవచ్చు. కానీ అదే దర్శకుడైతే సూర్యుడు అస్తమించేదాకా ఎదురుచూడాలి.

డబ్బు, కీర్తిని ఎడమకాలితో తంతాను అని రాసినట్టు గుర్తు..?
కీర్తిని తన్నలేదు, డబ్బును తన్నేసానుగా! తన్నడం అంటే నా ఇష్టమొచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోగలిగే స్వేచ్ఛను పొందడమే. నాకు రావాల్సిన వాటిని మాత్రం ముక్కు పిండి వసూలు చేసుకుంటాను.

ఎలా ఖర్చు పెడుతున్నారు..?
సరస్వతీ విద్యాపీఠం (కాకినాడ) కోసం..

దాన్ని నెలకొల్పిన ఉద్దేశం ఏంటి ?
నేను ఎప్పుడూ చెప్పేదే.. జ్ఞానాన్ని పెంచుకోవడం. వారంలో ఐదురోజులు అక్కడ ఉంటాను. రోజుకో స్కూలు నుంచి 40 మంది వస్తుంటారు, క్లాసు వింటారు. మధ్యానం భోంచేస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు.

మీ మనవడితో మీ బంధం ఎలా ఉంటుంది..?
ఆరేళ్ళు వాడికి. మా అబ్బాయి వాళ్ళు ఇక్కడికి వచ్చినపుడు వాడితో రోజుకో గంట గడుపుతాను. బొమ్మలకు రంగులు వేయిస్తాను. తెలివిని పెంచడంలో ఆనందం కలిగించమంటే అదే అలవాటైపోతుంది. అప్పుడు, పోగో చూద్దాం కాదు పోగోకు క్రియేటివ్ హెడ్ కాగలరు.

ఆత్మకథ రాసే ఉద్దేశం ఏమైనా ఉందా..?
ఆత్మకథ అంటే బోలెడంత స్కోత్కర్ష ఉంటుంది. నేను ఇలా పైకోచ్చాను, ఇంత కష్టపడ్డాను... దాన్ని జయించగలిగితే అప్పుడు ఆలోచిస్తా..

'డేగ రెక్కల చప్పుడు' ప్రత్యేకత ఏంటి ?
నలభై ఏళ్ళ కెరీర్ లో ఏ సీరియల్ కూ  ఇంత ఉత్సాహపడలేదు. మీరు నా ఎదురుగా ఉన్నారని చెప్పడం లేదు. శుక్రవారం ప్రింటింగ్ కు వెళ్తుంది అంటే, బుధవారం రాసిచ్చేసిన రోజులున్నాయి. దీనికి ఇప్పటికే (ఇంటర్వ్యూ జరిగింది ఆగష్టు 9 న) ఆరు ఏపిసోడ్లు అడ్వాన్స్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? అనిపిస్తుంది.

ఇందులో ఏమి చెప్పబోతున్నారు..?
మన దేశ సరిహద్దులు ఏంటని అడిగితే కూడా చాలా మంది చెప్పే పరిస్థితి లేదు. చరిత్రను నవలా రూపంలో చెపితే బాగా గుర్తుంటుంది అదే చేయబోతున్నాను.
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!