మీ జీవిత లక్ష్యం ఏమిటి? అని ఎవరైనా అడిగితే సంతోషంగా ఉండటమనో, దేనికి లోటు లేకుండా ఉండాలనో, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతేచాలనో, లాంటి సమాధానం చెప్తారు. మరి కొంత మంది ఒక ఇంజనీర్ కావాలనో, వ్యాపారవేత్త కావాలనో, చెప్తారు. కొంత మంది లక్ష్యమా! - అదెందుకు?, పూర్వం విజయాలు సాధించినవారంతా ఇలా లక్ష్యాలు అవి వ్రాసుకోలేదే అనొచ్చు! పోనీ అలా వ్రాసుకుంటున్న వాళ్ళందరూ విజయం సాధిస్తారని మీరు గ్యారంటి ఇస్తారా? అని అనవచ్చు. తప్పకుండా వీరి వాదంలో నిజం ఉందని నేను చెప్పగలను.
చాలా మంది జీవితంలో బిజీగా ఉంటారు కాని, ఎటు వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా పరుగు పెడుతుంటారు. ప్రపంచం మొత్తం మీద ఈ లక్ష్యం అన్న విషయంపై కొన్ని వేల పుస్తకాలు వచ్చాయి. అయినా ఇప్పటికి కేవలం 5 శాతం కంటే తక్కువ మంది మాత్రమే సరైన లక్ష్యాలను ఎర్పరచుకొంటున్నారు. మన సమాజంలో కేవలం 3 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే జీవితంలో వారికి కావలసినట్టుగా బ్రతగ్గలుగుతున్నారు.
లక్ష్యం విషయంలో కొంతమంది ఒక్కొక్కసారి కావలసినది పొందుతున్నారు. మరొకసారి లేదు. అంటే లక్ష్యం ఏర్పరచుకుంటే మంచిదా లేక జీవితం ఎలా నడిస్తే అలా గడిపేయడం ఉత్తమమా అని ఎవరికైనా సందేహం కలగక మానదు. నాకు ఈ సందేహమే కలిగింది. ఎందుకంటే నేను నేర్చుకున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ వల్ల ఒక 5 సంవత్సరాలు ఎనలేని లాభం పొందాను. నేను పెట్టుకున్న ప్రతి లక్ష్యం నెరవేరింది. ప్రతి వస్తువూ పొందగలిగాను. అయితే ఆ తరువాత వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధమవలేదు. జయాపజయాలు సర్వసాధారణం. అందులో సందేహం లేదు. కాని ఒక ఎత్తుకు వెళ్ళాక క్రిందకు పడడం కొంచెం నొప్పిగానే ఉంటుంది. అదీ ఆర్ధిక విషయాల్లో, అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎంతో ఉత్సాహంతో, చిన్న వయసులోనే విజయం సాధించిన యువత మరీ ఇలా ఎదురు దెబ్బలు తినడం, ఎన్నో ఒత్తిడిలకు గురౌడం నాలో ఆలోచన రేకెత్తించింది.
కొంతమంది తమ లక్ష్య సాధనకు ఎంతో కష్టపడుతుంటారు. ఒక లక్ష్యం తరువాత మరొక లక్ష్యం సాధించడంలో నిమగ్నమౌతుంటారు. అయితే వీరిలో చాలా మందికి అంతిమ లక్ష్యం ఏమిలో అవగాహన ఉండదు. ఊహించండి. రైల్వే స్టేషన్ లో మీరు ఎక్కాల్సిన రైలు బయలుదేరి పోవడం గమనించి, పరుగుపెట్టి, ఎంతో శ్రమ పడి ఆ రైలును అందుకున్నాక, మీరు ఎక్కింది తప్పు రైలు అని తెలిస్తే ఎలా ఉంటుంది?
ఈ రోజు పరుగులు తీస్తున్న వారిలో ఎంతమంది, నిజంగా విజయం వైపు వెళ్తున్నారు? లేదా విజయం వైపు అనుకొని విజయానికి వ్యతిరేక దిశలో పరిగెడుతున్నారా అన్నది తెలుసుకోవలసిన విషయం.
స్వయంగా ఆచరించి ప్రయోగించిన ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. వీటిలో కొన్ని ప్రత్యక్షంగా చెప్పినా, మరికొన్ని పరోక్షంగా చెప్పడం జరిగింది. ఆసాంతం చదివినవారికి ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలే కాక మరెన్నో అర్దమవుతాయి
1.1..విజయమంటే ప్రయాణం, గమ్యం కాదు.
1953 లో యేలే యూనివర్శిటి వారు ఫైనల్ ఇయర్ విదార్దులచే వారి జీవిత లక్ష్యం గురించి ప్రశ్నాపత్రం సేకరించడం జరిగిందట. అందులో కేవలం 3 శాతం మంది మాత్రమే తమ జీవితంలో ఆశయం గురించి స్పష్టంగా వ్రాసారు. 20 సంవత్సరాల తరువాత అదే తరగతి వారిని కలిసిన తరువాత ఈ యూనివర్శిటి వారు తెలుసుకున్నది ఈ 3 శాతం వ్యక్తులు సంపాదించిన ఆస్తులు, మిగతా 97 శాతం సంపాదించిన ఆస్తుల కన్నా చాలా ఎక్కువట. అంటే దీనర్ధం మిగతా వారు ప్రయత్నించలేదని కాదు. వారూ ఎన్నో వ్యాపారాలు, ఉద్యోగాలూ చేసినా దేనిలోనూ అగ్రస్థానానికి చేరలేక పోయారు. ఇలాంటి ఎన్నో పరిశోధనలు తెలియచేసే సత్యం, జీవితం పట్ల స్పష్టమైన అవగాహనతో పని చేస్తే విజయం వరిస్తుందని.
ఈ ఉదాహరణ ఇంచుమించు ప్రతి పర్సనాలిటి బుక్ లోనూ, కోర్సు లోనూ చెబుతారు. లక్ష్యం అవసరం అని బోధపడుతుంది. కాని తన స్వభావానికి, ప్రతిభకు, విలువలకు అనుగుణంగా ఏ రకంగా ప్రణాళిక వేసుకోవాలనేది తెలియదు.
భారత దేశానికి ఉన్న ఘన చరిత్ర బహుశా ప్రపంచంలో ఏ నాగరికతకూ ఉండకపోవచ్చు. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే నాగరికంగా జీవించిన భరతఖండం ఎంతో మంది గొప్పవారికి జన్మభూమి. ఆర్యభట్ట నుండి అబ్దుల్ కలాం వరకూ ప్రపంచం విస్మయం చెందే మేధావులు పుట్టిన ఈ దేశ యువత తెలివితేటలూ, నైపుణ్యం గుర్తించి వారిని ఈ దిశగా ప్రోత్సహించే విద్యావిధానం మనకు లేకపోవడం బాధాకరం.
ఎంచుకున్న ఉద్యోగం/వ్యాపారం తన స్వభావానికి, సామర్ధ్యానికి, విలువలకు అనుగుణంగా లేకపోతే ఎంత కష్ట పడినా సుడిగుండంలో పడిన నౌక లాగా వేగంగా తిరిగినా, ఆయాసం మిగులుతుంది కాని ఆశయం ఫలించదు. ఎంతో కష్టపడి విజయం అనే నిచ్చెన ఎక్కినా తరువాత, ఎక్కినది తప్పు గోడ అని తెలిస్తే, సమయం వృధా కాదు. ఒక జీవితమే వృధా.
మీ శక్తియుక్తులు తెలుసుకుని, మీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో, మీ ప్రవృత్తిని గుర్తించి వృత్తిగా ఎలా మార్చుకోవచ్చో తెలియచేసేదే ఈ పుస్తకం
'ది సీక్రెట్' గురించి వేణు భగవాన్ గారి తొలిమాట....
ఒకటే జీవితం! మరోటి ఉందో లోదో తెలియదు! ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకెంతకాలం? ఏం చేస్తే జీవితం మారుతుంది? ఎప్పటికి యిలా బ్రతకాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసుకు ఎప్పుడైనా వచ్చాయా? బహుశా వచ్చే ఉంటాయి. లేకపోతే ఈ పుస్తకం మీ చేతిలో ఉండదు.
మీరు కష్టపడి కొంత విజయం సాధించి ఉండవచ్చు. కాని దేనిని ఫణంగా పెట్టి? మీ కుటుంబం? ఆరోగ్యం? మనశ్శాంతి? సంతోషం?...
మనలో ఉన్న ప్రతిభను గుర్తించడమెలా? జీవితానికి ఒక ప్రయోజనం కల్పించుకోవడమెలా? జీవిత లక్ష్యం ఏర్పరచుకోవడం ఎలా? ధనవంతులు కావడం ఎలా? అనుకున్నది సాధించడం ఎలా? లాంటి ప్రశ్నలకు సమాధానం కాగలదని విశ్వసిస్తున్నాను.
ఈ చాప్టర్ వ్రాస్తున్నప్పుడు ఒక యువకుడు వచ్చి ఈ పుస్తకం ఎవరు చదువుతారు? చదివి ఎవరైనా ఆచరిస్తారా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? అని అడిగాడు. నిజమే చాలా మందికి చదివే అలవాటు లేక పోవచ్చు. చదివే అలవాటున్నవారు వేరే పుస్తకంతో పోల్చవచ్చు. కాని నేను ఈ పుస్తకంలో వ్రాసిన 'ది సీక్రెట్' అనే భావప్రపంచం ఆధారంగా, ఇది చేరవలసిన వారికి ఖచ్చితంగా చేరుతుంది. ఎంతమంది కావాలి, చరిత్ర సృష్టించడానికి? ఆ కొద్దిమందికి ఈ పుస్తకం సింహబలాన్ని ఇస్తుంది. అది మీరే కావొచ్చు.
ఈ పుస్తకంలో ఇమిడి ఉన్న ఎన్నో విషయాలు మీ విజయానికి అత్యంత కీలకమని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా లక్ష్య సాధన వెనుక ఉండే ఒక భావప్రపంచం గురించిన విషయాలు మీ ఆలోచనా దృక్పదాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధాలు. మీరు విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. దానికి సాక్ష్యం ఈ పుస్తకం మీ చేతిలో ఉండడమే.