నాకు నచ్చిన పండుగలు
భోగి, వినాయక చవితి,అట్ల తద్దె, డబ్బులుంటే దీపావళి (ఎందుకో చెప్తా ), మల్లన్న పండగ (ఇది లోకల్ పండగ ).
ముందు చెప్పాల్సింది వినాయక చవితి.అప్పుడే వానాకాలం చల్లగా మొదలౌతుంది.పొలం పనులు తక్కువగా ఉంటాయి. రే వినాయక చవితికి ఎం చేద్దాం రా? మనం పరవటిది (పడమర వీధి ) వాళ్ళకంటే ముందు వెళ్ళాలి రా, లేకపోతే ఏనుగు దంతాలు దొరకవ్. ఇలా కలల్లో ఉండేవాళ్ళం.
ముందు గ చెప్పాలి కదా , మా ఊర్లో తూర్పు వీధి , పరమట వీధి అని రెండు భాగాలు చేసారు మాటల్లో.ఊరు తూర్పు వీధితో మొదలౌద్ది. మా ఇల్లు మొగదాల్నే ఉంటుంది. మా వీధిలో నేను,అనవయ్య(హనుమయ్య ), శీని గాడు , స్వర్ణ హరి, వాళ్ళ అన్న చెంచయ్య, వెంకటేశ్వర్లు,కిశోరు, చందు గాడు, పెండ్యాల మాధవ, మా మాధవన్నాయి ,అచ్చానగారి మధు, అచ్చానగారి సురేష్, పెండ్యాల సీనన్నాయి, మస్తాను గాడు..ఇంకా చాల మంది ఉన్నారులే..మేమేందారం కల్సి పత్రీ కి వెళ్ళే వాళ్ళం. పత్రీ తెల్సు కదా. తెలీదనకండి.నేను hurt అవుతా. వినాయకచవితి దగ్గరపడే కొద్ది మా preparations మొదలౌతాయి. ఆ రోజు రానే వస్తుంది.ముందు రోజు రాత్రే ఒక గోతాము, కొడవలి,వీలైతే ఒక టార్చ్ లైటు దాచుకుని పడుకునే వాడిని.పడుకున్న మాటే కాని నిద్ర పట్టేది కాదు.అప్పుడే తెల్లారి నట్టు , అందరు నాకన్నా ముందు గ లేచి వెళ్ళిపోయినట్టు అనిపించేది.ఎక్కడ చిన్న శబ్దం అయిన మా వాళ్ళే పిలుస్తున్నారనుకునేవాడిని. ౩ గంటలకి వచ్చి లేపేవాళ్ళు. ఇక లేచి "మా నేను వెళ్తున్న" అని చెప్పి పరిగెత్తే వాడిని. నాన్నేమో రే జాగ్రత్త చెప్పేవాడు. ముందు నర్రోడు గుంటకి వెళ్ళాలి.మా ఊరి తార్రోడ్డు అంటా వెళ్తే నర్రోడు గుంట వస్తుంది.ఆ దారిలో నక్కలు , అడవి పందులు అరుస్తూ ఉండేవి.కొంచెం భయం గా ఉన్న పెద్దోళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉండేది. అక్కడ హాల్ట్ వేసే వాళ్ళం.అక్కడ మామిడి తోపు ఉంది.ముందు మంట వేసి ఒకటి ,రెండు కనిచేసేవాళ్ళం.పుల్లలెట్టి పళ్ళు తోమేసి, ఇక పత్రీ కోయటం మొదలు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది.పత్రీ సంచి కింద పెడితే అది ఇక పనికి రాదు.కాబట్టి కింద పెట్టకూడదు.ఒక్కోసారి పడ్డాకూడా, ఎవరు చూడలేదని వెళ్ళిపోయినా సందర్భాలు బోలెడు. నర్రోడు గుంట నుంచి ఎడమకి తిరిగి,ముందు మామిడాకులు..కక్కుర్తి పడి ఎక్కువ కొస్తే సంచి నిండి పోద్ది కదా.అందుకే కొంచెం.వెదురాకులు,దర్బలు. అక్కడ మెయిన్ ఈవెంట్ (ముఖ్య ఘట్టం ) ఉంటుంది అదే "ఏనుగు దంతం ".నేను వీరప్పాన్ని అస్సలు కాదు. ఇక్కడ ఏనుగు దంతం అంటే అల్లోవీర మొక్క లో ఉండే అలాటి ఆకారం.దానికోసం కొట్టుకు చచ్చే వాళ్ళం.ఇప్పుడు మనం రెండు మామిడి తోపులు దాటి వచ్చాం.అది మా ఊరి పొలిమేర.అక్కడ కుడికి తిరిగితే మర్రి ఆకులు,నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ,జామ ఆకులూ ఉండేవి. అక్కడేమో సాయిబు కాపలా కాసే జామ తోట ఉంది. రెండు జట్ల గ విడి పోయేవాళ్ళం . ఆ చివర, ఈ చివర కోస్తూ సాయిబు ని పరిగెత్తించే వాళ్ళం. తోట వెనుక ఓ నేల బావి ఉంది.దాని మీద ఒక జామ చెట్టు ఉంది.అక్కడకి మాత్రం వెళ్ళకుండా జాగ్రత్త పడే వాళ్ళం.
అక్కడ నుంచి భూమిలో ఉండే ఉల్లి లాటి మొక్కలు కోసుకునే వాళ్ళం.అక్కడ నుంచి అత్తి చెట్ల దగ్గరకి వెళ్లి అక్కడ ఇంకా కొన్ని కోసుకొని,పత్రీ సంచుల్ని అక్కడ తగిలించి కబడ్డీ ఆడేవాళ్ళం. ముందు రాగి ఆకులు చాల కోసుకోవాలి , కుడుములు చేయాలి కదా.10 గం ల కల్లా ఇంటికి వెళ్ళాలి.
ఆటలు ముగించి ఇంటికి బయల్దేరేవాళ్ళం. మద్యలో అడిగినవాళ్ళకి పంచుకుంటూ ఇంటికి చేరి పత్రీ అమ్మకిచేస్తే, నాన్న మామిడాకులు గుచ్చి గుమ్మానికి కట్టమనేవాడు.ఆ పని అయాక ఇంట్లోంచి పొంగలి వాసనా అలా వస్తూ ఊ ఊ ఊ .తొందరగా తలారా స్నానం(కుంకుడు రసం తో ) చేసి దేవుడి కి పూజ చేయాలి.నాకేమో ఓ బొజ్జ గణపయ్య రాదు. ఓ సారి తన్నులు కూడా tinnanu అమ్మ చేతిలో. ఇక అప్పటి నుంచి పుస్తకం కొన్నా.అందులో ఏమో చాల మంత్రాలూ ఉంటాయే,నాకేమో ఆకలేస్తుంది ఇలాక్కాదని తొందరగా పూజ ముగించి ,దేవుడి కి ఆరగింపు కోసమని అన్ని అక్కడ పెట్టి తలుపు వేసి బయటకి వెళ్ళేవాళ్ళం.మరి దేవుడు తినాలిగా. తలుపు కొట్టి లోపలి కి వెళ్ళాలి.ఎ పండగకి ఐనా అంతే. నాకు ఇక్కడ వరకు చాఆఆఆఆల ఇష్టం.
ఇప్పుడేమో అందరు స్టేటస్ symbol గ వేలు వేలు పోసి విగ్రహాలు తెస్తున్నారు.అక్కడ పండగ వాతావరణం కనిపించదు పై పై మెరుగులు తప్ప.ఏమో నాకు తెల్సి అదే పండుగ.ఆకలితో ఎదురు చూసి తిన్న ఆ పొంగలి రుచి దేనికి రాదు.మా ఇంట్లో ఉన్న చెక్క వినాయకుడు ఇంకా ఉన్నాడు. కాకుంటే పసుపు ఎరుపు రంగుల్లోకి మారిపోయి.
ఈ సారి మల్లన్న పండగ గురించి చెప్తా. కాని ఇది మీకు నచ్చితేనే.