వారిని వారిలా ఉంచండి (అమ్మ..నాన్న..ఓ జీనియస్! -వేణు భగవాన్)

పరిచయం...2002 లో విడుదలైన 'ది సీక్రెట్' - విజయానికి అంతిమ సూత్రం. పుస్తకం 12 ముద్రణలతో  ఇప్పటికీ వేలాదిమందిని ప్రభావితం చేస్తూ తెలుగులో అత్యధికంగా  అమ్ముడైన ఒక పుస్తకంగా ఆవిర్భవించింది. 2009 లో వచ్చిన 'ది ఫైర్' పుస్తకం  సామాన్యులనే కాక మేధావుల, ఉపాధ్యాయుల, మానసిక నిపుణుల, రాజకీయ నాయకుల అభిమానాన్ని, ప్రశంసలను అందుకుంది. మొదటి పుస్తకానికి ఎంత సమయం తీసుకున్నానో ఈ పుస్తకానికి అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నాను. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. పాఠకులకు కావలసింది చెప్పి అభిమానం సంపాదించడం సులభం, అవసరమైనది ఇచ్చి విమర్శలను ఎదుర్కోవడం కొంచెం ఇబ్బందికరమే. ఫ్రెంచి రచయిత విక్టర్ హూగో చెప్పినట్టు 'ఎవరైనా రచయిత తను జీవించిన కాలానికే రచనలు చేస్తే పెన్ను విరగొట్టి అవతల పారేయాలి'. అమ్మ.. నాన్న.. ఓ జీనియస్ !  పుస్తకం పూర్తిగా చదవకుండా, కొద్ది పేజీలు చదివి ఇది ఎలాంటి పుస్తకమో 'తీర్పు' ఇచ్చేవారికి ఈ పుస్తకం ఎప్పటికి అర్దంకాదు లేదా వీరికి ఈ పుస్తకం అవసరమై ఉండదు. పిల్లల క్షేమం కోరి, భావి భారత్ శ్రేయస్సు కోరి, విమర్శలకు సిద్దపడి రాసే ఈ మాటలు నేను సత్యమని నమ్మినవి.

వారిని వారిలా ఉంచండి


"నేను ఒకసారి , ఒక పిచ్చివాళ్ళ ఆశ్రమ గార్డెన్ లో పచార్లు చేస్తుండగా, అక్కడ ఒక ఫిలాసఫీ పుస్తకం చదువుతున్న యువకుడిని కలవడం జరిగింది. అతని ప్రవర్తన, ఆరోగ్యవంతమైన అతని తీరు మిగతావారికంటే విభిన్నంగా ఉంది. నేను అతని ప్రక్కనే కూర్చొని - ఇక్కడ ఏం చేస్తున్నావు? అని అడిగాను. ఆతను నా వంక ఆశ్చర్యంతో తేరిపార చూసి, నేను ఆ ఆశ్రమంలోని వైద్యుడిని కాదని నిర్ధారించుకుని - ఏం చెయ్యను సార్! మా నాన్న గొప్ప లాయర్, నన్ను తనలాగే లాయరును కావాలంటాడు. మా మామయ్యా పెద్ద బిజినెస్ మాన్, నన్ను బిజినెస్ మాన్ చెయ్యాలనుకుంటాడు. యిక మా అమ్మ, వాళ్ళ నాన్నలా నేను రాజకీయ నాయకుడవ్వాలని, మా చెల్లి తన భర్తలా నేను సాఫ్ట్ వేర్ ఇంజనీరు అవ్వాలని, మా అన్నయ్య తనలా ఒక అథ్లెట్ అవడం మంచిదని చెప్తాడు. యిక స్కూల్ లో నైతే మా పియానో, ఇంగ్లిష్ టీచర్ వాళ్ళనే ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఫాలో అవ్వాలని నిర్ధారించేశారు! ఎవరు నన్ను నన్నులా, ఒక మనిషిలా చూడటంలేదు. అందరూ తమ అద్దంలో నన్ను చూస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. కనీసం ఇక్కడైనా నేను నాలా ఉందామని...అన్నాడు". - ఖలిల్ జిబ్రాన్ రాసిన ఒక కథ.


ఒక గొప్ప పారిశ్రామికవేత్త కుమారుడు. తండ్రి తదనంతరం ఆ కంపెనీకి చైర్మన్ గా నియమితుడై, కొత్త పాలసీలతో, దృక్పథంతో, కొత్త ఉత్పత్తులు ప్రవేశ పెట్టి కంపెనీ ని విప్లవాత్మకమైన రీతిలో పలు కొత్త రంగాలకి దిశా నిర్దేశం చేయసాగాడు. ఈయన దూకుడు చూసిన ఆ కంపెనీ డైరెక్టర్స్ అతనితో....'సర్, మీరు మీ తండ్రిలా కాదు, మీరు పూర్తిగా భిన్నంగా ఉన్నారు' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దానికా యువకుడు 'కాదు కాదు నేనూ మా నాన్న లాంటి వాడినే, ఆయనకూ నాకూ తేడా ఏం లేదు' అన్నాడు. 'కాదు సార్, మీ పాలసీలు, ఐడియాలు, ఆలోచనలు,విజన్, మేనేజ్ మెంట్, లీడర్ షిప్ అన్ని మీ తండ్రిగారి కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి' అన్నారు అందరూ. దానికి ఆ యువకుడు 'చూడండి! మా నాన్నగారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఏ విషయాలలోనూ ఎవరినీ అనుకరించేవారు కాదు, నేను కూడా అంతే, ఎప్పుడూ ఎవరినీ అనుకరించను, మా నాన్నగారితో సహా!  ఆ విధంగా నేను కూడా మా నాన్నగారిలాంటి వాడినే" అన్నాడు.

మీ పిల్లలను, వారిని వారిలా ఉండనివ్వగలిగినంత విజయవంతమైన పెరెంటింగ్ మరొకటిలేదు. తల్లి, తండ్రుల నుండి వ్యాపారాలు, వృత్తులు అంది పుచ్చుకున్న వారు తమ వ్యాపారం/వృత్తిలో రాణించాలంటే తనదైన శైలిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, ఒక స్పష్టమైన విజన్ తో పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులే కాక లోకం మెచ్చే నాయకులు అవుతారు. అలా మీ పిల్లలు కూడా ఒక విశిష్టమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటే మీలోని మంచి గుణాలని తీసుకోవాలి కాని మీలాగే ఉండాల్సిన అవసరం లేదని గ్రహించాలి.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!