మన చేతిలోని అద్బుతాలెన్ని....

మీరు ఇపుడు ఏ వయసులో ఐన ఉండండి..మిమ్మలిని మీ చిన్న కోరికలు ఎపుడు తీరాయి అని అడిగితే చాలు..ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది , మీ చిన్న కోరిక ఎలా కలిగింది, దాని తీర్చుకోడానికి  మీరు పడ్డ బాధ, ఎదురుచూపు, అందుకున్నాక  కలిగిన సంతోషం. కోరికలు చిన్నవో పెద్దవో ఏవైనా కానీ అవి అలా అందుకుంటూనే మీరు ఈ వయసుకు వచ్చారు. అంటే మీరు మీ వాళ్ళ నుంచి ఇప్పటి వరకు  అద్బుతాలు అందుకుంటూ ఉన్నారన్నమాటా... అందుకోడం లో ఉన్న విలువా, ఆనందం మీకు బాగా తెలుసు అన్నమాట..
మరీ మీరు ఇపుడు మీ పిల్లలకు అలాంటి అద్బుతాలు ఇవ్వాలనుకుంటారు కదా! ఎక్కడ విన్నా ఎపుడు విన్న, తరచుగా ప్రతి ఇంట్లో వినపడే మాట " మేము చాలా కష్టపడి చదువుకున్నాం  .మీకు అన్ని చేసి పెడుతుంటే విలువ తెలీడం లేదు అని" విలువ తెలీడం లేదు అని వాపోతున్నారా..లేక   మీరు అతి ఉత్సాహంతో మీ పిల్లలు అడగక ముందే కోరికలు తీర్చడం మొదలు  పెట్టి, దాని విలువ తెలుసుకోనివ్వకుండా  చేస్తున్నామని అనుకుంటున్నారా..

పెరుగన్నం  తిని ఆనందించే  వయసులో కాడ్బరీస్ చాక్లెట్స్, పరిగెత్తి ఆడుకునే వాడికి బైక్ పై షికార్లు, కథ చెపితే ఆనందించే పిల్లలకు వీడియో గేమ్స్, ఉహలోకి రాకముందే అరచేతికి అందిస్తున్నారా!  మీరు 30 సంవత్సరాలు అందుకున్నవి అన్ని, మీరు మీ పిల్లలకు అతి తక్కువ సమయంలోనే అందిచారా..నిజంగా మీరు చాలా గొప్పవారు అన్నమాటే..

మీరు మీ పిల్లలకు అందించేవి వాళ్ళకు అద్బుతం అనిపించాలి.. మీ పిల్లలు మీ వయసుకు వచ్చేవరకు ఇలాంటి అద్బుతాలు అందిస్తూనే ఉండాలన్న విషయం కూడా గుర్తుపెట్టుకున్నారా...మీకు  మీ పిల్లలకు మధ్య ఒక సౌమ్యమైన అనుబంధం  ఈ ఇవ్వడంలోనే ఉంటుంది.. ఆ అనుబంధం  ఆలా ఉండాలంటే మీకు  మీ చేతిలోని అద్బుతలెన్నో మీకు తెలుసి ఉండాలి.. అందివ్వడం లో ఒక కట్టడి కూడా ఉండాలి..మరీ మీ దగ్గర మీ పిల్లలు  30 వచ్చేవరకు అందించేన్ని అద్బుతాలు ఉన్నాయా..ఉండే ఉంటాయి లెండి మరీ అంతా ముందు చూపు లేకుండానే అడిగినవన్నీ అరచేతిలో పెట్టరు కదా! ఏదో నా మనసు కొందర్ని చూసి అలజడి చెంది అడుగుతున్నాను..

ఒకరింట్లో వాళ్ళ 8 సంవత్సరాల అమ్మాయి కొత్త కారు కొనమని పేచి పెడుతుందట.. పాత కారులో స్కూల్ కి వెళ్ళదట .. వాళ్ళది మధ్య తరగతికి కాస్త ఎక్కువ అనుకోవాలి.. ఉన్నదంతా పెట్టినా ఆ అమ్మాయి అడిగిన కారు కొనలేరు.. ఎపుడో కోరిక తీరుతుంది  అని ఎదురుచూడడానికి...కోరిక తీర్చలేరు  అని అనుకోడానికి చాలా పెద్ద తేడా ఉంది.. యిక ఇక్కడినుంచి మొదలు, పెద్దలకు , పిల్లలకు మధ్య ఉండే బంధానికి  పగుళ్ళు..ఇలాంటి పరిస్థితి  రాకూడదనుకుంటే  మన గుప్పిట మూసే ఉంచాలి, కొన్ని అద్బుతాలు దాచే ఉంచాలి, కఠినమైన కట్టడి ఉండే ఉండాలి..

మనం ఈ రోజు అందించేది గొప్ప కాదు, అది పునాది మాత్రమే,, ఈ రోజు అందిచిన దానికి పైమెట్టు అందిస్తూ ఉండాలి మనం, మన పిల్లలు తిరిగి వాళ్ళ పిల్లలకు అందిచేవరకు.. ఇందుకు పెద్దలు చెప్పిన జీవన సూత్రాలు చాలానే ఉన్నాయి..ఒక సన్యాసి చెప్పిన జీవన సూత్రం ఉండే ఒక కథ చెప్పలని ఉంది నాలాంటి అమ్మా, నాన్నలకు..

ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఆతను ప్రతి ఊరిలో 40 రొజులు మాత్రమే బస చేసేవాడు, తిరిగి  5 సంవత్సరాల తరవాతనే  ఆ ఊరికి వచ్చేవాడు, ఆతను ఏ ఊరిలో ఐనా సరే స్థిరంగా ఉండేవాడు కాదు. యిలా 40 రోజులకు ఒక ఊరిలో బస చేస్తూ ఉండేవాడు అందుకనే ఆతను ఒక ఊరినుండి వెళ్ళాక తిరిగి మళ్లీ అదే ఊరికి రాడానికి ఐదు సంవత్సరాలు పట్టేది. ఆతను ఎన్నో మహిమలు చూపించేవాడు ఐతే రోజుకు ఒక్క మహిమ మాత్రమే, అలా 39  రోజులు గడిచేవి, అన్ని రోజులు కూడా ఎవరి దగ్గరనుండి రూపాయి కూడా దక్షిణ తీసుకునేవాడు కాదు. ఆఖరి రోజు మౌన వ్రతంలో ఉండి, రోజు మొత్తంలో  ఎపుడో  ఒక ఐదు నిముషాలు మాత్రం కళ్ళు తెరిచేవాడు, అపుడు దర్శించిన వాళ్ళందరికీ  కోరికలు తీరతాయని ప్రసిద్ది, అపుడు మాత్రంవాళ్ళకు తోచినంత కానుకలు ఇస్తే స్వీకరించేవాడు.. ఒక ఊరిలో పదిరూపాయలు వచ్చిన, ఒకో ఊరిలో ఏమి రాకున్న అతని పద్దతి  మాత్రం ఒకేలా ఉండేది..ఆ సాధువు గురించి ప్రతి ఊరిలో కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు.

కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు వృద్దుడు అయ్యాడు.. 5 సంవత్సరాలకు నేను రాకుంటే, యిక ఎప్పటికి రాను అని తెలుసుకోండి, నా శిష్యులు  అంటూ ఎవరులేరు, నా పిల్లలు అంటూ ఎవరు లేరు, నేను హిమాలయాలకు వెళ్ళా లనుకుంటున్నాను, ఇదే ఆఖరి దర్శనం కావొచ్చు అని చెప్పాడు. ఆ ఊరిలోని ఒక యువకుడికి అతనిపై సందేహం వచ్చింది..ఇతను ఎంతో సంపాదించాడు, ఎక్కడో దాచే ఉంటాడు, యితడు ఎలాంటివాడో తెలుసుకోవాలని, అతని వెంట ప్రతి ఊరు వెళ్ళసాగాడు, సాధువుతో పాటుగా ఆరు నెలలు తిరిగే సరికి ఆ యువకుడు డస్సిపోయాడు, సాధువుని క్షమాపణ కోరుతూ, స్వామీ మీరు యిలా ఉండడంలో ఏమి లాభం ఉంది.. హాయిగా ఒక ఊరిలోనే ఉంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నాడు..
నాయనా! ఒకే అద్బుతాన్ని మళ్లీ మళ్లీ చూడరు, అది మరుపుకు వచ్చేంత  సమయం ఇస్తే, అవే అద్బుతాలు సరిపోతాయి, ఆ అద్బుతాలు చూడడానికి కొత్తవాళ్ళు చేరుతూనే ఉంటారు, మరీ కట్టడి ఎందుకు మీకు వచ్చినంత కానుకలు తెసుకోకుండా ఆఖరి రోజు వరకు ఉండి, ఐదు నిముషాలు కళ్ళు తెరవడం, అందుకు ఒక సమయం లేకపోవడం, దీనివల్ల మీకు ఏంటి లాభం అన్నాడు ఆ యువకుడు,నేను సాధువుని, నాకు కావాల్సింది ఏ ఊరు వెళ్ళినా ఆదరంగా నా చుట్టూ చేరే మనుషులు, నా రాకకై ఎదురు చూసే వాళ్ళు,అది కాక మన చేతిలోని అద్బుతాలెన్నో  మనకు తెలిస్తే చాలు, అవే నేను ప్రదర్శించేవి, దానికి ఇలాంటికఠినమైన కట్టడి ఉండి కాబట్టే నాకు ఇంతవిలువా, నీకు ఇంత ఆరాటం కలిగాయి అన్నాడు సాధువు.

ఒక సాధువు తను కొంతకాలం ఉండే చోటు అయినా,తన వాళ్ళు కాకపోయినా తను తన చుట్టూ ఉన్నవాళ్ళు  ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాడు.  ఒక సమన్వయ బంధం కలిగి ఉండాలంటే ఎలాంటి కట్టడి ఉండాలి, తన వద్ద ఉన్న వనరులు ఎంత అని తెలుసుకొని జీవితమంతా గడిపాడు.. మనం ప్రేమించే  మన పిల్లలతో అందంగా, అనుకువైన బంధం  కలిగి,  అందుకునే కోరికల విలువ పిల్లలు తెలుసుకోవాలి , అందుకోడంలో ఆనందం  పొందాలి అని మనం అనుకుంటే ...మన చేతిలోని అద్బుతాలెన్నో... ఉండాల్సిన కట్టడి ఏమిటో..మనకు తెలిసి ఉంటే చాలు కదా!

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!