బాల్యం బాగుంటుందని వాళ్లు వీళ్లు అన్నప్పుడు జరిగిపోయిన కాలం బాగానే ఉంటుందనిపించేది...కానీ ఇప్పుడు తెలుస్తోంది బాల్యం ఎంత బాగుందో ఎందుకు బాగుండేదో..
ఇద్దరు ముగ్గురు కలిసి ఆడుకునే వాళ్ళు... అందులో ఇద్దరూ ఒక ఇంటి వాళ్లే... ఒకానొక సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నారో అంతుబట్టక ఎక్కడికని అడిగితే కొత్త ఇంటికి అంటూ అందిన జవాబు. మనము వెళ్ళిపోదామని ఇంట్లో పేచీ, కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలెమ్మని ఊరడింపు. నిజమోనని అబద్ధం తెలియని నమ్మికతో నేను వచ్చేస్తాను అక్కడికి అంటూ సంతోషంగా వీడ్కోలు.
కొత్త ఇంటికి వెళ్తాము అన్నది నిజం కానీ అదే చోటు అదే మనుషుల మధ్యకి కాదన్న తెలియనితనం తెలుసుకోలేనితనం.
ఎందుకో
అప్పుడప్పుడు ఆ మనుషులు... ఆనాటి సమయం హఠాత్తుగా కలలో కదలాడినట్టు అనిపిస్తుంది విరిగిన నెలవంక ముక్కల్లాగా.
అప్పటి సమయం కథలుగా వాన చినుకులై కురపడానికి.. ఇప్పుటి సమయమో, చెప్పకనే తప్పుకునేవారో లెక్కతేల్చాలి అనిపించదు.
ఏది ఏమైనా
కావాల్సింది బాల్యం కాదు, కరిగిపోయిన కాలం కాదు. అదే తెలియనితనం, అప్పటి తెలుసుకోలేనితనం, తెలివిడిలేనితనం. ఇప్పుడు కూడా ఉంటే బాగుండు. నిజంగా బాగుండు.